బాబు సంచలనం!.. జగన్ తో పొత్తుకు రెడీ!

నిజంగా ఈ వార్త సంచలనాలకు సంచలనం అని చెప్పక తప్పదు. ఎందుకంటే... రాజకీయాల్లో శత్రువులు మిత్రులు ఉండరన్న మాటను నిజం చేస్తూ టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన ప్రకటన చేశారు. నిత్యం తాను విరుచుకుపడే వైసీపీ అదినేత - ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకునేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు ప్రకటించారు. అది కూడా ఎక్కడనుకుంటున్నారు? ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ తీరుకు నిరసనగా ఢిల్లీలో చేపట్టిన దీక్షా వేదిక వద్ద ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు.

దీక్షలో కూర్చున్న చంద్రబాబును ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన ఓ జాతీయ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు నోట నుంచి ఈ మాట వినిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తనకేమీ ఇబ్బంది లేదని చంద్రబాబు పేర్కొన్నారు. *వచ్చే ఎన్నికల్లో జగన్ ఒకటో - రెండో సీట్లు గెలుస్తారు కదా. ఆ తర్వాత రమ్మనండి. మాకు మద్దతుగా నిలబడమనండి. నాకేమీ అభ్యంతరం లేదు. అయినా ఇందులో తప్పేముంది* అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన నేపథ్యంలో జగన్ పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు జనం చెవుల్లో పదే పదే మారుమోగిపోతున్నాయి. ఏపీకి అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సహకరిస్తున్న జగన్ తాను కూడా రాష్ట్రానికి అన్యాయం చేసినట్టేనని చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానితో పాటు ఏ పార్టీ నేతపై విమర్శలు సంధించినా.. జగన్ నామస్మరణ లేకుండా చంద్రబాబు ప్రసంగం ముగించడం లేదు.

సమయం ఏదైనా - సందర్భం ఏదైనా కూడా జగన్ ను విమర్శించనిదే చంద్రబాబుకు పొద్దు పోవడం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక జగన్ తో పొత్తుకు సిద్ధమేనని ప్రకటించిన సందర్భంగానూ చంద్రబాబు... ఆయనపై విమర్శలు గుప్పించారు. జగన్ ఇప్పటికీ బీజేపీకి సాయం చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు... నిన్న గుంటూరులో జరిగిన మోదీ సభకు వచ్చిన జనాలను జగనే తరలించారని కూడా చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం బలం లేదని - ఈ క్రమంలో బీజేపీ సభకు అంతమంది జనం వచ్చారంటే... జగన్ సహకారంతోనేనని కూడా బాబు ఆరోపించారు. మొత్తంగా జగన్ పై ఆరోపణలు సంధిస్తూనే.... ఆయన పార్టీతో పొత్తుకు తనకేమీ ఇబ్బందేమీ లేదని అయినా ఇందులో తప్పేముందని చంద్రబాబు చేసిన ప్రకటన ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయిందని చెప్పాలి.
× RELATED నేనైతే అలా చేయను.. వెంకయ్యపై తమ్మినేని సంచలనం