అమ్మ మాజీ సన్నిహితుడు.నేడు పవన్ సలహాదారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ దూకుడును పెంచుతున్నారు. ఓ వైపు వివిధ పార్టీల నేతలకు కండువా కప్పుతూ మరోవైపు పలువురు తటస్థులను తన గూటికి చేర్చకుంటున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో ముఖ్యుడికి పార్టీ కండువా కప్పారు. పవన్ పొలిటికల్ అడ్వైజర్ గా తమిళ నాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పి.రామ్మోహన్ రావు నియమితులయ్యారు. సోమవారం ఉదయం విజయవాడలోని పార్టీ ఆఫీస్ లో రామ్మోహన్ రావుకు పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివంగత సీఎం జయలలిత అత్యంత విశ్వసించిన వ్యక్తి రామ్మోహనరావు కావడం గమనార్హం.

జయలలిత సారథ్యంలో అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో రామ్మోహన్ రావు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలోప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించారని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు అయ్యేలా చూశారని చెప్పారు. అలాంటి గొప్పవ్యక్తులు పార్టీపైన తనపైనా నమ్మకం ఉంచి రావడం సంతోషకరమనీ.. జనసేన బలోపేతం అవుతోందనడానికి ఇదే ఉదాహరణ అని పవన్ కల్యాణ్ చెప్పారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం.. ఆయనకు రాజకీయ సలహాదారుడిగా పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉందనీ.. రాష్ట్రాన్ని రక్షించడానికి కొత్త నాయకుడు రావాల్సి ఉందని చెప్పారు. ప్రజాక్షేమంపై పవన్ కల్యాణ్లో అత్యున్నత ఆశయాలు ఉన్నాయన్నారు. సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ గా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా… ప్రజా జీవితాన్ని ఎంచుకోవడం గొప్ప విషయం అని చెప్పారు. పవన్ కల్యాణ్ ను సీఎం చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని రామ్మోహనరావు తెలిపారు.


× RELATED ఆగని కృష్ణమ్మ వరద ఉగ్రరూపం!