ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు లేనట్లే

తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ దెబ్బకు కాంగ్రెస్ టీడీపీ రెండూ పొత్తులపై పునరాలోచనలో పడ్డాయి. అయితే.. ఎవరికి వారు అవతలివారు పొత్తు వద్దంటే బాగుణ్ననే ధోరణిలో ఈ నెల రోజులూ వెయిట్ చేశారు. చంద్రబాబుతో పొత్తు వల్లే దెబ్బయిపోయామంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఈ చంద్రబాబుతో పొత్తు లేకుంటే బాగుండు అనుకుంటున్నారట. తాజాగా పొత్తులపై రాహుల్ చంద్రబాబుల మధ్య దీనిపై చర్చ జరగ్గా.. నిర్ణయం మీరే తీసుకోండని రాహుల్ చెప్పేశారట.

దిల్లీలో జరిగిన ఈ భేటీలో రెండు పార్టీలూ కలిసి సాగాలని నిర్ణయించుకున్నప్పటికీ... మోదీని దించాలనే ఉమ్మడి లక్ష్యానికి కట్టుబడి ఉన్నప్పటికీ ఏపీలో కలిసి పోటీ చేసే విషయంలో మాత్రం వెనుకడుగు వేసినట్లు సమాచారం. తెలంగాణ ఫలితాల తరువాత రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీల కాంబినేషన్ను ప్రజలు స్వీకరించలేదని అర్థమైంది.

దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాహుల్ ఆ నిర్ణయ బాధ్యత చంద్రబాబుకే అప్పగించగా ఆయన ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో ఇంకా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. కాబట్టి అనవసరంగా వారికి సీట్టిచ్చి అవకాశాలు పోగొట్టుకోరాదన్నది చంద్రబాబు ఉద్దేశంగా తెలుస్తోది.

అయితే... రాష్ట్రంలో వేర్వేరుగా పోటీ చేసినా ఎన్నికల తరువాత మాత్రం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు కొనసాగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారట. రాహుల్ కూడా తనకూ అదే కావాలని... ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏమైపోయినా ఫరవాలేదు... జాతీయ స్థాయిలో తనకు చంద్రబాబు సపోర్టు చేస్తే చాలన్నట్లు మాట్లాడారాట.
× RELATED రాంమాధవ్ ను కలిసిన ఏపీ టీడీపీ నేతలు ఎవరు?