పార్టీలకు మోదీ నయా నజరానా..

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్డీయే నుంచి పార్టీలు దూరమవుతుండడంతో కలవరపడిన మోదీ కొత్తగా పొత్తుల అస్త్రాన్ని బయటకు తీశారు. కలిసొచ్చిన వారికి నయాసాల్ లో నజరానాలంటూ ప్రకటిస్తున్నారు.

తమిళనాడులోని ఐదు జిల్లాలకు చెందిన బూత్ స్థాయి కార్యకర్తలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీయేను బలోపేతం చేసే దిశగా పొత్తుల ఎత్తు వేశారు. పొత్తులకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.

తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీతోపాటు - అన్నా డీఎంకే - డీఎంకే పార్టీలతో పొత్తుకు సిద్ధమా..? అని కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానమిచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ దేశ రాజకీయాల్లో కొత్త సంస్కృతిని తెచ్చారన్నారు. 1990లో అటల్ సంకీర్ణ రాజకీయాలను విజయవంతంగా నడిపించారని గుర్తు చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారన్నారు.  భారీ మెజార్టీ సాధించిన సందర్భాల్లోనూ భాగస్వామ్య పక్షాలతో కలిసి నడిచేందుకు బీజేపీ ముందుకొచ్చిందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఆకాంక్షలపై కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రజల భాగస్వామ్యం ఎప్పుడూ విజయవంతమవుతుందని - కార్యకర్తలు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు.
× RELATED పార్టీలు కలిసినా తమ్ముడిని కలవని కిరణ్