కొత్త సినిమాలకు షాక్

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. గత వారం విడుదలైన ‘2.0’ మిక్స్ డ్ టాక్ తో.. వీకెండ్ తర్వాత వీక్ అయిన నేపథ్యంలో ఈ వీకెండ్ మీద చాలా ఆశలతో ఒకేసారి నాలుగు సినిమాల్ని రిలీజ్ చేశారు. శుక్రవారం తెలంగాణలో ఎన్నికలుండటంతో సెలవు కూడా ఇవ్వడంతో వీకెండ్ అడ్వాంటేజీ కలిసొస్తుందని అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. తెలంగాణ ప్రాంతంలో కొత్త సినిమాలకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జనాలంతా ఎన్నికల మీదే దృష్టి పెట్టడంతో థియేటర్లు వెలవెలబోయాయి. చాలా చోట్ల ఉదయం షోలే పడలేదు. మల్టీప్లెక్సుల యాజమాన్యాలు తమకు తాముగా ఉదయం.. మధ్యాహ్నం షోలు క్యాన్సిల్ చేశాయి.

షోలు పడ్డ థియేటర్లలో ఆక్యుపెన్సీ దారుణంగా ఉంది. 20-30 శాతానికి మించి థియేటర్లు నిండలేదు. తెలంగాణ ఎన్నికల కారణంగా సామాజిక మాధ్యమాల్లోనూ సినిమాల గురించి చర్చే లేకపోయింది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మెరుగే కానీ.. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ లేదు. ఉన్నంతలో ‘కవచం’ సినిమాకు మాత్రమే ఓపెనింగ్స్ వచ్చాయి. మిగతా సినిమాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఐతే ఈ చిత్రానికి ఫైన్స్ సమస్యల వల్ల మార్నింగ్ షోలు చాలా చోట్ల పడలేదు. యుఎస్ లో ప్రిమియర్లకు కూడా బ్రేక్ పడింది. ఈ చిత్రంతో పాటు మిగతా వాటికి కూడా టాక్ అయితే ఆశించిన స్థాయిలో లేదు. తొలి రెండు షోలకైతే పరిస్థితి దారుణంగా ఉండగా.. సాయంత్రం షోల నుంచి పరిస్థితి మెరుగు పడుతుందేమో అని ఆయా చిత్రాల నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు.


× RELATED సీఎం కుమారుడికి షాక్.. ఓడిపోతాడట..