పవన్ కళ్యాణ్=బాలయ్య-2

కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్.. జనసేన పార్టీల మధ్య మాటల దాడి చర్చనీయాంశమవుతోంది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇటు పవన్ కళ్యాణ్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తర్వాతి స్థాయి నాయకులు.. కార్యకర్తల మధ్య కూడా ఇదే స్థాయిలో వాదనలు నడుస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వ్యవహారం గురించి జగన్ విమర్శలు చేయగా. ప్రతిగా పవన్ తీవ్ర స్వరంతో స్పందించాడు. వైఎస్సార్ కాంగ్రెస్ కు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి టీజే సుధాకర్ బాబు సీన్ లోకి వచ్చాడు. పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. పవన్ కళ్యాణ్ ను సుధాకర్ బాబు బాలకృష్ణ-2గా అభివర్ణించడం విశేషం.

పవన్ మాటలు.. చేతలు బాలయ్యను తలపిస్తున్నాయని సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. తమ అధినేత జగన్ గురించి పవన్ హద్దులు దాటి మాట్లాడుతున్నాడని.. ఇప్పటికైనా నోటికి తాళం వేయకుంటే పవన్ కు తెలుగుదేశం పార్టీతో ఉన్న లాలూచీ.. చీకటి ఒప్పందాల గురించి బయటపెట్టాల్సి ఉంటుందని సుధాకర్ బాబు హెచ్చరించారు. జగన్ ను ఉద్దేశించి పవన్ పదే పదే వ్యక్తిగత విమర్శలే చేస్తున్నాడని.. కానీ తన విషయానికి వస్తే మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నాడని.. ఐతే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ ఉండదని సుధాకర్ అన్నారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం.. ఒకరితో వివాహ బంధంలో ఉండగానే మరొకరితో బిడ్డను కనడం వాస్తవం కాదా అని సుధాకర్ సూటిగా ప్రశ్నించారు. ఇలా చేసిన పవన్ మళ్లీ చీప్ మాటలు మాట్లాడుతున్నారని.. వాటిని ఇకనైనా ఆపాలని అన్నారాయన. పవన్ తనకు చేగువేరా స్ఫూర్తి అంటున్నారని.. కానీ నిజంగా చేగువేరా స్ఫూర్తితో పోరాడుతున్నది జగనే అని సుధాకర్ చెప్పారు.
× RELATED పవన్ కళ్యాణ్ ను హోమం గెలిపిస్తుందా?