డేంజర్ జోన్లో ఇద్దరు మంత్రులు.. 25 మంది ఎమ్మెల్యేలు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయ వేడి సెగలు పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ వస్తుందా? అనే చర్చ అప్పుడే మొదలైంది. అయితే గతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 25 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆ తరువాత తన వ్యాఖ్యలు వక్రీకరించారని అన్నారు. కానీ గులాబీ బాస్ నిర్వహించిన పార్టీ సమావేశంలో కొందరు ఎమ్మేల్యేలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు నిజమేనన్న చర్చ సాగింది. అయితే తాజాగా ఇద్దరు మంత్రులు డేంజర్ జోన్లో ఉన్నట్లు హాట్ హాట్ గా టాపిక్ నడిస్తోంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ అనుమానమేనని మరో మంత్రి తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం.

వచ్చే జనవరికి ప్రభుత్వ గడువు తీరినందున తెలంగాణలో మూడు నెలల ముందే ఎన్నికల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

అయితే అధికార పార్టీలో మాత్రం టికెట్ కోసం ఆశావహులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోసారి టికెట్ కోసం అధినేత మెప్పుకోసం సెగ్మెంట్లలో జోరుగా పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు టికెట్ దక్కనివారు ఈ సారైనా టికెట్ దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఈ తరుణంలో ఇద్దరి మంత్రులపై కేసీఆర్ కు తీవ్ర వ్యతిరేకత ఉందని మరో మంత్రి తన సన్నిహితుల ద్వారా వాపోయినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఒకరు 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మరొకరు 2009 నుంచి ఇప్పటి వరకు ఓడిపోలేదు.

దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు ఈసారి ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపించేందుకు రెడీ అవుతున్నారట. రహస్యంగా నిర్వహించిన ఓ సర్వే ద్వారా కేసీఆర్ ఈవిషయాన్ని గ్రహించినట్లు తెలుస్తోంది. ఈ సమాచార నేపథ్యంలో కేసీఆర్ ఆ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగులకు కాకుండా కొత్తవారికి టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోందని చెప్పారు.

ఇతర నియోజకవర్గంలో బీజేపీకి చెందిన బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్పించుకొని వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆ రెండు నియోజకవర్గాలు బీజేపీకి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ జాగ్రత్తపడుతున్నాడట. ఈ విషయం లీక్ కావడంతో ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రుల్లో గుబులు పట్టుకుంది. ఆ ఇద్దరు మంత్రులు ఎవరా? అని ఆరా తీస్తున్నారు.

అయితే ఎన్నికల సమయం నాటికి ఎవరా అని తేలిపోనుందని పార్టీ నాయకులు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఎర్రబెల్లి 25 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర చర్చ సాగుతోంది. అందులో తమ పేరు ఉందా? అని చాలా మంది ఎమ్మెల్యేలు ఎంక్వైరీలు పెట్టినట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED కరెంట్ షాకిస్తున్న కేసీఆర్... ఏపీతో పాటు ఎవరికీ అంత సీన్ లేదు!
×