ఫేక్ లా సర్టిఫికేట్...స్పీకర్ తమ్మినేని లా పాయింట్ ఏంటంటే...?

ఏపీలో వైసీపీ టీడీపీకి అడ్డంగా ప్రతీ విషయంలోనూ దొరికిపోతోంది. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లలో ఓడి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అది చాలదు అన్నట్లుగా వడ్డీ గా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఒక సీటు సమర్పించుకుని అభాసుపాలు అయింది. ఇక్కడ మ్యాజిక్ ఏంటి అంటే వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీ అభ్యర్ధిని గెలిపించడం.

వీరే క్రాస్ ఓటింగ్ చేశారు అని అనుమానించి నలుగురిని ఎట్టకేలకు సస్పెండ్ చేశారు. కానీ దుమారం మాత్రం ఆగడం లేదు. ఈ లోగా టీడీపీ డబ్బులిచ్చి వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని చెప్పాలని వైసీపీ ప్రయత్నాలు కూడా వికటిస్తున్నాయి. వైసీపీకి మద్దతుగా ఉన్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తనకు పది కోట్లతో టీడీపీ వారు ఆఫర్ చేశారని చెబుతూ దొంగ ఓట్లతో తాను గెలిచాను అంటూ ఆయన చేసిన కామెంట్స్ మొదటి ఆరోపణలలోని సీరియస్ నెస్ ని తగ్గించేసి కామెడీ పండించాయి.

అంతే కాదు దొంగఓట్లతో గెలిచాను అని చెప్పడం ద్వారా రాపాక ఇపుడు టీడీపీకి టార్గెట్ అయ్యారు. ఇలా వైసీపీ నేతలు ప్రతీ విషయంలో చెబుతున్న మాటలు చేస్తున్న ప్రకటనలు అన్నీ అడ్డం తిరిగి బొక్క బోర్లా పడుతున్నారు. సరిగ్గా ఈ టైం లో ఏపీ స్పీకర్ తమ్మినేని మీద ఆయన అల్లుడు రాజకీయంగా ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం నేత కూన రవికుమార్ చేసిన ఆరోపణలు ఇపుడు సంచలనం రేపుతున్నాయి.

ఆదివారం నుంచి దీని మీద పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. తమ్మినేని సీతారాం డిగ్రీ చేయకుండా లా అడ్మిషన్ తీసుకున్నారని అది ఎలా సాధ్యమని కూన ప్రశ్నిస్తున్నారు. ఆయనవి ఫేక్ లా సర్టిఫికేట్లని అంటున్నారు. తమ్మినేని తాను డిగ్రీ డిస్ కంటిన్యూ అని అనేక సార్లు ఇంటర్వూలలో చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమ్మినేని వ్యవహారం తాము అసలు వదిలిపెట్టమని ఆయన నిజం చెప్పేదాకా దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలుగుదేశం పార్టీ అంటోంది.

మరో వైపు ఈ అంశం మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కూడా చెబుతున్నారు. దీంతో ఇపుడు స్పీకర్ గట్టిగానే టార్గెట్ అవుతున్నారు. దాంతో ఎట్టకేలకు తమ్మినేని పెదవి విప్పారు. కానీ సరైన క్లారిటీ ఇవ్వలేకపోయారు. సరైన సమయంలోనే అన్నింటికీ జవాబు చెబుతాను అని తమ్మినేని   అంటున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని భయమెందుకు అని ఆయన అంటున్నారు.

అయితే ఈ క్లారిటీతో తమ్మినేని లా పాయింట్లు తీస్తూ మాట్లాడిన మాటలతో టీడీపీ సంతృప్తి చెందడంలేదు. పూర్తి వివరాలు చెప్పాలని పట్టుబడుతోంది. తమ ఆరోపణలు నిజమా కాదా అన్నది చెప్పమంటే సరైన టైం లో చెబుతాను అనడమేంటి అని మండిపడుతోంది

ఇంకో వైపు చూస్తే స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి కోటబోమ్మాళిలలో ప్రాధమిక విధ్యను అభ్యసించారు. ఇక శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ విధ్యను అభ్యసించారు. తరువాత అదేవిదంగా డిగ్రీ హెచ్ఇసి గ్రూప్ తో డిస్ కంటిన్యూ చేసినట్లు స్పీకర్ పలు టీవీ ఇంటర్వూల్లో ఇచ్చారు. అలాగే 2019 ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఇదే అంశం పేర్కొన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఇక తమ్మినేని ఇంటర్ తో లా చదివితే అయిదేళ్ల లా కోర్సు అవుతుంది కదా కానీ ఆయన మూడేళ్ల లా కోర్సు అంటున్నారు ఇదెలా సాధ్యమని టీడీపీ అంటోంది. పూర్తి వివరాలు ఆధారాలతో బయటపెడతాను అని తమ్మినేని ప్రస్తుతానికి ఇచ్చిన వివరణ ఏమీ సరిగ్గా లేదని అంటోంది.

మరో వైపు చూస్తే తమ్మినేని డిగ్రీ చేయకుండా ఎలా మూడేళ్ల లా కోర్సు చేశారు అన్నదే ప్రశ్న అయితే దీనికి ముందు యూనివర్శిటీ పెద్దలు కూడా జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక తమ్మినేనిని టార్గెట్ చేసినా ఆయన స్పీకర్ పదవికి ఏ గండం ఉండదని అంటున్నారు. సో తమ్మినేని తప్పుడు అఫిడవిట్ ఇచ్చారా లేదా అన్నదే ఇపుడు తేలాల్సిన మ్యాటర్ అని అంటున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED టాప్ ర్యాంకర్ల వలస బాట... కారణం తెలిసిందే!
×