అది 30 ఏళ్ల క్రితం నాటి దొంగ ఓట్లు.. 'రాపాక' క్లారిటీ

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఓ సమావేశంలో ఆయన మాటలు రాజకీయంగా హీటెక్కాయి. ఆ వీడియో వైరల్ అయ్యి రాపాక దొంగ ఓట్లతో గెలిచాడా? అన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయంగా ఇది రాపాకపై ప్రభావం చూపడంతో ఆయన ఎట్టకేలకు ఈ దొంగ ఓట్ల కామెంట్స్ పై వివరణ ఇచ్చారు.

'ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల ఘటన అది. నవ్వుకోవడానికి మాత్రమే చెప్పాను. ఎమ్మెల్యే ఎన్నికల్లో జరిగింది కాదని.. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. అన్ని కులాల వారు నాకు ఓట్లు వేయడంతోనే ఎమ్మెల్యేగా తాను గెలిచాను.

నవ్వుకోవడానికి అలా మాట్లాడానని.. సీరియస్ గా చెప్పింది కాదని లైట్ తీసుకోండి' అంటూ  వైరల్ అయిన మొత్తం వీడియో కూడా విడుదల చేసి రాపాక వివరణ ఇచ్చారు.

ఇటీవల రాత్రిపూట ఓ సమావేశంలో ఎమ్మెల్యే రాపాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చింతలమోరీ బూత్ లో కాపుల ఓట్లు ఉండవని.. అన్నీ ఎస్సీల ఓట్లే అని.. ఎవరో ఎవరికీ తెలియదని.. సుభాష్ తోపాటు వీళ్లంతా జట్టుగా వచ్చి ఒక్కొక్కరు దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయేవాల్లు. 20 మంది వరకూ వచ్చేవాళ్లని.. ఒక్కొక్కరూ పదేసి ఓట్లు వేసేవాళ్లని.. ఏకంగా ఈ ఓట్ల వల్ల 800 ఓట్ల మెజార్టీ వచ్చింది' అంటూ ఇటీవల వైరల్ అయిన వీడియోలో రాపాక వ్యాఖ్యానించడంతో పెనుదుమారం రేపింది.

రాపాక దొంగ ఓట్లతో గెలిచాడని రాజోలులో ఈయన చేతిలో ఓడిన టీడీపీ అభ్యర్థి దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారు. ఫిర్యాదు చేస్తే ఈసీ రాపాకపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈనేపథ్యంలో ఈ దొంగ ఓట్ల ముచ్చట ఎటు దారితీస్తుందన్నది వేచిచూడాలి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.× RELATED టాప్ ర్యాంకర్ల వలస బాట... కారణం తెలిసిందే!
×