జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ.. బోనీ సమాధానం ఇది!

అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు తమిళ హిందీ భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుని లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె నట వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. మరాఠీ మూవీ 'సైరఠ్' ఆధారంగా తెరకెక్కిన 'ధడక్'తో హీరోయిన్ గా తెరంగేట్రం చేయడం తెలిసిందే. జీ స్టూడియోస్ తో కలిసి కరణ్ జోహార్ ఈ మూవీని నిర్మించాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన జాన్వీ కపూర్  శ్రీదేవి వారసత్వాన్ని తన చరిష్మాని పునికి పుచ్చుకున్నా ఆ స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది.

ప్రస్తుతం భవల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ప్లస్ వంటి మూవీస్ లలో నటిస్తున్న జాన్వీ కపూర్ దక్షిణాదిలో తన తల్లి శ్రీదేవి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని హీరోయిన్ గా ఇక్కడి సినిమాల్లో రాణించాలని చాల కాలంగా కోరుకుంటోంది. మన స్టార్ డైరెక్టర్లు స్టార్ప్రొడ్యూసర్స్ కూడా జాన్వీని దక్షిణాది సినిమాల్లో నటింపజేయాలని గత కొంత కాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కొంత మంది జాన్వీ కోసం ప్రయత్నించి భంగపాటుకు గురైన సందర్భాలు కూడా వున్నాయి.

విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ కోసం జాన్వీని పూరి అనుకున్నారట. తనని సంప్రదించి కరణ్ జోహార్ ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. డేట్స్ సమస్య కారణంగా తాను 'లైగర్'లో నటించలేనని జాన్వీ చెప్పినట్టుగా వార్తలు వినిపించాయి. ఇక కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్న 30వ ప్రాజెక్ట్ కోసం జాన్వీ పేరు ప్రముఖంగా వినిపించడం మొదలు పెట్టింది.

ఈ ప్రచారంపై జాన్వీ కపూర్ కానీ ఆమె తండ్రి బోనీ కపూర్ కానీ స్పందించకపోవడంతో ఇది కూడా వట్టి ప్రచారమని అంతా భావిస్తున్నారు. ఇదిలా వుంటే తాజాగా జాన్వీ కపూర్ కోలీవుడ్ లోకి అరంగేట్రం చేయబోతోందని లింగుస్వామి డైరెక్ట్ చేసిన 'అవారా' మూవీకిది సీక్వెల్ అని అయితే ఇందులో కార్తి తమన్నా కాకుండా ఆర్య జాన్వీ కపూర్ నటించనున్నారంటూ ఓ కొత్త వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా జాన్వీ కపూర్ తండ్రి నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ప్రియమైన మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేయునది ఏమనగా జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎలాంటి తమిళ సినిమాని అంగీకరించలేదు. దయచేసి ఇలాంటి ఫాల్స్ రూమర్స్ ని ప్రచారం చేయకండి' అంటూ జాన్వీ తమిళ ఎంట్రీపై బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ అనే వార్తలని మాత్రం కండించకపోవడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED పాన్ ఇండియా.. అంత లైట్ తీసుకుంటే ఎలా?
×