
విభిన్నమైన గ్యాంగ్ స్టర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. `ఖైదీ`, మాస్టర్, `విక్రమ్` వంటి సంచలన చిత్రాలని తనదైన సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో తెరకెక్కించి సంచలనం సృష్టించిన లోకేష్ కనగరాజ్ తాజాగా `విక్రమ్` యూనివర్స్ లో భాగంగా దళపతి విజయ్ తో ఓ భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.
విజయ్ కి జోడీగా త్రిష నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. `గిల్లీ` తరువాత త్రిష, విజయ్ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అంతే కాకుండా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ నటిస్తున్న రెండవ సినిమా ఇది. `మాస్టర్` లో ఎలాంటి హీరోయిన్ పెయిర్ లేకుండా విజయ్ ని చూపించిన లోకేష్ కనగరాజ్ దళపతి 67లో మాత్రం త్రిషని హీరోయిన్ గా తీసుకోవడం విశేషం.
ఎప్పుడెప్పుడు విజయ్, లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందా? అని విజయ్ అభిమానులు గత కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల కశ్మీర్ లో మొదలైంది. శుక్రవారం చిత్ర బృందం ఈ మూవీ టైటిల్ ని ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. కమల్ `విక్రమ్` సమయంలో సినిమాలో కనిపించని సన్నివేశాన్ని ప్రత్యేకంగా షూట్ చేసి టైటిల్ గ్లిమ్స్ ని లోకేష్ కనగరాజ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
విజయ్ 67 కు కూడా అదే ఫార్ములాని వాడి టైటిల్ గ్లిమ్స్ వీడియోని రూపొందించాడు. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ మూవీకి `లియో` అనే టైటిల్ ని మేకర్స్ ఫైనల్ చేశారు. టైటిల్ ని వెల్లడిస్తూ విడుదల చేసిన వీడియో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిర్మానుణ్యంగా వున్న ప్రదేశంలోని ఓ ఇంట్లో హీరో విజయ్ చాకోలేట్స్ తయారు చేస్తూ కనిపించాడు. పీనాట్స్ ని గ్రౌండ్ చేస్తూ చాక్లెట్ సిద్ధం అవుతుండగా కారు చీకట్లో గ్యాంగ్ స్టర్ ల ఓ భారీ కాన్వాయ్ తనని వెతుక్కుంటూ వస్తున్నట్టుగా చూపించాడు.
చాక్లెట్స్ ని తయారు చేస్తున్నట్టుగా భారీ ఖడ్గాన్ని హీరో సిద్ధం చేసి దాన్ని చాక్లెట్ క్రీమ్ లో ముంచడం.. బయటికి తీస్తూ బ్లడీ స్వీట్ అంటూ కామెంట్ చేయడం.. ఆ వెనకే నల్లత్రాచు బుసలు కొడుతూ కనిపించడం.. ఆ వెంటనే తనకు ఎదురుగా గ్యాంగ్ స్టర్స్ కి సంబంధించిన కాన్వాయ్ ఎదురుగా నిలబడటం `విక్రమ్` గ్లిమ్స్ ని యదా తథంగా ఫాలో అయిపోయి `లీయో` గ్లిమ్స్‌ని స్పెషల్ ట్రీట్మెంట్ తో రెడీ చేసినట్టుగా వుంది. టైటిల్ తో పాటు ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని అక్టోబర్ 19న రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. అంటే దసరాకు సరిగ్గా ఐదు రోజుల ముందు రిలీజ్ చేయబోతున్నారన్నమాట.
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ మూవీకి `విక్రమ్`, ఖైదీ`, మాస్టర్ లకున్న లింకేంటన్నది తెలియాలంటే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్ లు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.