ఒక్క కోటం రెడ్డి చాలుగా...!

నెల్లూరు జిల్లాలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీకి చమటలు పట్టిస్తున్నారు. ఆయన ఎక్కడా తగ్గడం లేదు. తాను ఇలాగే ఉంటాను అని డ్యాం ష్యూర్ గా చెబుతున్నారు. నేను మాట్లాడుతాను గొంతు ఎత్తుతాను నన్ను ఎవరూ ఆపలేరు. అవసరం అయితే నన్ను మీరు ఎంకౌంటర్ చేసుకోండి అప్పుడే నా గొంతు ఆగేది అని ఆయన అంటున్న తీరుతో ఏమి చేయాలన్నది వైసీపీ హై కమాండ్ కి అసలు అర్ధం కావడంలేదు అంటున్నారు.

కోటం రెడ్డి ఎపిసోడ్ చూస్తూంటే 1988లో ఇదే నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి ఉదంతం గుర్తుకు రాకమానదు. తెలుగుదేశం పెట్టిన నాటి నుంచి ఉన్న నల్లపురెడ్డి ఆ తరువాత ఎన్టీయార్ తో విభేదాలు రావడంతో రెబెల్ గా మారారు. ఆయన నాడు నెల్లూరు నుంచి మొదలుపెట్టి ఏపీ అంతా తిరిగి ఎన్టీయార్  కి వ్యతిరేకంగా చేసిన ప్రచారం 1989లో తెలుగుదేశం కొంప ముంచింది. నా లాంటి నిజాయతీపరుడు ఎన్టీయార్
పార్టీ నుంచి బయటకు నెట్టేశారు అని ఆయన తెలుగు జనం ముందు ఆవేదనతో చెప్పుకున్నారు.

నేను ఏమి పాపం చేశాను అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీయార్  నియంత అని ఆయన అహంకారి అని చాలా మాటలు అన్నారు. నాడు నల్లపురెడ్డి ఒక్కడే కదా అని ఎన్టీయార్  ఆయన్ని బయటకు పంపిస్తే ఆయన చేసిన ప్రచారం వల్ల తెలుగుదేశానికి విపరీతమైన డ్యామేజి జరిగింది. ఇపుడు కూడా చూస్తే అదే నెల్లూరు జిల్లా నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెడీ అయ్యారు. ఆయన కూడా  ఒక్కడే. నేను తగ్గేది లేదు అంటున్నారు.

అధికార పార్టీని ఎదిరించాలని నిర్ణయించుకున్నపుడే నేను అన్నింటికీ తెగించా. ఇపుడు కొత్తగా నాకు పోయేది ఏమీ లేదు అని ఆయన అంటున్నారు. ఏపీకి జగన్ సీఎం కావాలని ఒకనాడు బలంగా కోరుకున్న కోటం రెడ్డి ఇపుడు జగన్ కాకపోతే మరొకరు సీఎం అవుతారు అంటున్నారు. అంతలా జగన్ మీద వ్యతిరేకత పెంచుకోవడానికి కారణం ఆయనను నిర్లక్ష్యం చేయడమే అని అంటున్నారు.

ఇక చూస్తే నెల్లూరు జిల్లాలో కోటం రెడ్డి పక్కా మాస్ లీడర్. ఆయన జనం నాయకుడు. పేదలతో ఉంటారు. ప్రజల కోసం పనిచేస్తారు. ఇక విద్యార్ధి దశ నుంచే సేవా కార్యక్రామాలలో ఉన్నారు. ఆయనకు అంటూ సొంత బలం ఉంది. ఆయనకు సొంత ఇమేజ్ ఉంది. అలాంటి నాయకుడు ఇపుడు వైసీపీకి కంటిలో నలుసుగా మారారు. ఇక్కడ మరో మాట కూడ ఉంది. కోటం రెడ్డి తాను ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చిన జీతాన్ని పేదల కోసం ఖర్చు చేస్తారని అంటారు.

ఇలా అన్ని విధాలుగా ప్రజలతో మమేకం అయిన నేత కోటం రెడ్డి. అంతే కాదు తేడా వస్తే అవతల వైపున ఉన్న వారు ఎంతటి వారు అన్నది కూడా చూడకుండా ఇచ్చి పడేయండంలో ఆయనకు ఆయనే సాటి. ఒక విధంగా వైసీపీకి రెబెల్ ఎంపీ రాజు క్లాస్ లీడర్ గా ఎక్కడో ఢిల్లీలో కూర్చుని రచ్చ చేస్తూ మీడియా ద్వారానే చికాకు పెట్టేవారు. కానీ జనం మధ్యలో ఉంటూ పక్కా మాస్ లీడర్ అయిన కోటం రెడ్డి చేసే రచ్చను తట్టుకోవడం కష్టమే అని అంటున్నారు.

కోటం రెడ్డి తాను ఒకనాడు వైసీపీ కోసం అన్నట్లుగా పనిచేశారు. ఇపుడు వైసీపీ అంతం కోసం తాను నడుం బిగించారు. రాజకీయంగా వైసీపీని ఆయన ఢీ కొంటున్నారు. కోటం రెడ్డి ఒక రాయి అనుకుంటే వైసీపీ ఒక అద్దాల మేడ. కోటం రెడ్డి వర్సెస్ వైసీపీ అంతే ఆయనకు పోయేది ఏమీ లేదు కానీ వైసీపీకే డ్యామేజ్ అని అంతా అంటున్నారు.

ఎన్నో సార్లు జగన్ని కలవాలని తాను ట్రై చేసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి చూస్తే జగన్ తో ఆయనకు దూరం చాలా పెరిగింది అనే అంటున్నారు. తాను ఏదో ఒక పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే బీయారెస్ నుంచి కూడా పోటీకి రెడీ అని అంటున్న కోటం రెడ్డి వైసీపీని ఓడించడమే తన ధ్యేయం అని అంటున్నారు. మరి కోటం రెడ్డి తో పెట్టుకున్న వైసీపీ ఏమి సాధిస్తుంది అన్నది ఆలోచించాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఈసారి తోపులాటలో కింద పడిపోయారు.. షర్మిలకు ఇంకెన్ని కష్టాలో?
×