'ఐప్యాక్' ని కంగారు పెట్టిన ఆ పత్రిక కథనం

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వేల పేరిట కొందరు వ్యక్తులు సంస్థలు హడావుడి చేస్తున్నారు. ఇవి నిజమో అబద్ధమో తెలియడం లేదు.

అలాగే తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ సర్వే చేసిందని.. ఆ సర్వేలో వైఎస్ జగన్ కే బినెట్ లో ఉన్న 25 మంది మంత్రుల్లో కేవలం ఐదుగురు మాత్రమే గెలుస్తారని ఒక దినపత్రిక లో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. జగన్ మొదటి విడత మంత్రివర్గంలో పనిచేసినవారు ప్రస్తుతం రెండో విడత మంత్రివర్గంలో ఉన్న మొత్తం 38 మందిలో గెలిచేవారు ఏడుగురు మాత్రమేనని ఐప్యాక్ సర్వేలో తేలిందని జనవరి 27న ఒక దినపత్రిక లో సంచలన కథనం ప్రచురించింది.

ఆ కథనం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ని మొత్తానికి కంగారు పెట్టింది . ముఖ్యంగా టీడీపీ జనసేన ఇతర ప్రతిపక్షాల కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున ఈ వార్త క్లిప్పింగును వైరల్ చేశారు. వైసీపీ శ్రేణుల్లోనూ ఈ వార్త ప్రకంపనలు సృష్టించింది. ఈ జనవరి నెలలోనే వైసీపీ ప్రస్తుత మంత్రులు మాజీ మంత్రులకు చెందిన 38 నియోజకవర్గాల్లో ఐప్యాక్ సర్వే చేసిందని.. ఇందుకు సంబంధించి ఐప్యాక్ అధికారిక లోగో ఉన్న ఒక వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని తన కథనంలో పేర్కొంది.

మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రుల్లో మొత్తం 38 మందికిగానూ గెలిచేవారు కేవలం ఏడుగురు మాత్రమేనని ఆ కథనం పేర్కొంది. తుని ఎమ్మెల్యే రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పుంగనూరు ఎమ్మెల్యే గనులు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడప ఎమ్మెల్యే మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ భాషా అమలాపురం ఎమ్మెల్యే రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఎక్సైజ్ శాఖ మంత్రి కళత్తూరు నారాయణ స్వామి గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని నరసన్నపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాత్రమే గెలుపొందుతారని ఐప్యాక్ పేర్కొన్నట్టు వెల్లడించింది.

అయితే ఈ కథనాన్ని ఐప్యాక్ ఖండించింది. ఆ కథనం ఫేక్ అని తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటించింది. అంతేకాకుండా ఆ పత్రికను ట్యాగ్ చేసింది. ఆ పత్రిక తాము చేయని సర్వేను చేసినట్టుగా ఒక నిరాధార కథనం ప్రచురించిందని ఐప్యాక్ మండిపడింది.  ఈ మేరకు ఆ పత్రిక  క్లిప్పును సైతం ఐప్యాక్ పోస్టు చేసింది. దానిపై ఫేక్ అని పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆ పత్రిక కథనం ఉందని తెలిపింది.

దీంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా 2024 ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో ఇలాంటి సర్వేలు ఇంకెన్ని తెరమీద కొస్తాయో వేచిచూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఈసారి తోపులాటలో కింద పడిపోయారు.. షర్మిలకు ఇంకెన్ని కష్టాలో?
×