లద్దాఖ్ ను లాగేసుకుంటున్న చైనా.. కేంద్రానికి లేహ్ ఎస్పీ నివేదిక

డ్రాగన్ దేశం చైనాది తీరని రాజ్య కాంక్ష. ఎప్పుడూ పొరుగు దేశాల భూభాగంపైనే కన్ను. లేదంటే సముద్ర జలాల్లో పెత్తనం కోసం ప్రయత్నాలు చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా చైనా విస్తరణ కాంక్ష ఎంత బలీయమైనదంటే.. దాని బారినపడని పొరుగు దేశం లేదంటే అతిశయోక్తి కాదు. చైనా ప్రస్తుత భూభాగంలో 70 శాతం ఆక్రమించిందేనన్న వాదన ఉంది. భారత్ కు చెందిన ఆక్సాయ్ చిన్ ను ఇలాగే 1962 నాటి యుద్ధంలో ఆక్రమించింది. చైనా చేసిన నమ్మకం ద్రోహం కారణంగానే నాటి ప్రధాని నెహ్రూ మనో వేదనకు గురై ప్రాణాలు విడిచారని చెబుతుంటారు. కాగా నేపాల్ శ్రీలంక పాకిస్థాన్ ఇలా భారత పొరుగు దేశాలన్నిటిని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. భూటాన్ పైనా కన్నేసింది. ఇక భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఎప్పటినుంచో చైనా వాదిస్తోంది.

గల్వాన్ లో ఘర్షణకు దిగి..

2020 జూన్ లో లద్ధాఖ్ లోని గల్వాన్ లోయలో చైనా-భారత దళాల ఘర్షణ ఏ స్థాయిలో సాగిందో అందరూ చూశారు. నాటి ఘటనలో తెలుగు వాడైన కల్నల్ సంతోష్ బాబు అమరుడయ్యారు. అయితే అటు అరుణాచల్ తో పాటు లద్ధాఖ్ పైనా చైనా కన్నుంది. ఈ దిశగా డ్రాగన్ తన ప్రయత్నాలను చేస్తూనే ఉంది. తాజాగా తూర్పు లద్ధాఖ్ వద్ద భారత్ 26 గస్తీ పాయింట్లను కోల్పోయిందనే కథనాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. బఫర్ జోన్లు గస్తీ నిర్వహించకపోవడమే దీనికి కారణమని సీనియర్ పోలీసు అధికారిణి ఒకరు కేంద్రానికి నివేదిక సమర్పించారు.

గత వారమే నివేదిక..

లద్దాఖ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు ప్రభుత్వానికి గత వారమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా ప్రచురించింది కూడా. ''ప్రస్తుతం అక్కడ (తూర్పు లద్దాఖ్) కారాకోరం పాస్ నుంచి చుమూర్ వరకు మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో భారత్ సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. కానీ మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26 చోట్ల (5-17 24-32 37)కు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయి'' అని లేహ్ ఎస్పీ పి.డి. నిత్య కేంద్రానికి అందించిన నివేదికలో వెల్లడించారు.

మోదీ షా ధోబాల్ సమక్షంలోనే..

నిత్య నివేదికను గత వారం ఢిల్లీలో జరిగిన పోలీస్ల సదస్సులో కేంద్రానికి సమర్పించారు. దీనికి ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ హాజరవడం గమనార్హం. మన దళాలు పోలీసు గస్తీ లేకపోవడాన్ని అదనుగా తీసుకుంటున్న చైనా భూభాగాలను కలిపేసుకుంటోందని నిత్య తన నివేదికలో హెచ్చరించారు. బఫర్జోన్లను సృష్టించి సరిహద్దును వెనక్కి నెడుతోందని పేర్కొన్నారు.

సలామీ స్లైసింగ్..

ఒక్కసారిగా మీద పడి దాడి చేయదు.. అలాగని చేతులు కట్టుకుని కూర్చోదు.. చిన్నచిన్నగా లాగేసుకుంటుంది. మన ఊళ్లలో గట్లను చెరిపేసి పొలాలను ఆక్రమించుకున్నట్లు. ఇదీ చైనా వ్యూహం. దీనినే సలామీ స్లైసింగ్ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అంగుళం తర్వాత అంగుళం ఆక్రమించుకోవడం. ''ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చేపట్టిన చర్చల్లో ఏర్పాటు చేసే బఫర్ జోన్లను అవకాశంగా మలుచుకొంటోంది. ఎత్తైన శిఖరాలపై కెమెరాలను అమర్చి.. భారత్ దళాల కదలికలను పసిగడుతోంది. బఫర్ జోన్లోకి మన సాయుధ బలగాలు ప్రవేశించిన వెంటనే అభ్యంతరం చెబుతోంది. అది తమ భూభాగంగా వాదిస్తోంది. ఆ తర్వాత మరింత బఫర్ జోన్ ఏర్పాటు పేరిట భారత్ను వెనక్కి నెడుతోంది'' అని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో నిత్య విశ్లేషించారు.

సరిహద్దులపై రగడ జరిగిన నెలకే..

2020 నాటి గల్వాన్ ఘర్షణల తర్వాత ఆ స్థాయిలో భారత్-చైనా దళాలు గతేడాది డిసెంబరు 9న మరోసారి ఘర్షణ పడ్డాయి. ఇది అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో జరిగింది. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్ ఆరోపించింది. మళ్లీ ఇప్పుడు కలకలం. తాజా ఘర్షణ జరిగిన సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరో నివేదిక వెలుగులోకి రావడం విశేషం.         నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×