పేరుకుపోతున్న ఈ వ్యర్థాలు.. పొంచివున్న ప్రమాదం..!

అతి అనర్థదాయకమని మన పెద్దలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు. ఏదైనా శృతిమించి వాడితే ప్రమాదం తప్పదని దీని అర్థం. ఈ నియమం మనుషులకైనా.. వస్తువులకైనా ఒకేలా వర్తిస్తుంది. అతిగా ప్రేమించినా.. అతిగా ద్వేషించినా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అందరికీ తెల్సిందే. అలాగే మన జీవితంలో భాగమైన స్మార్ట్ ఫోన్.. టీవీ.. కంప్యూటర్ లాంటి వస్తువులను అతిగా వినియోగిస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది.

రోజురోజుకు పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ప్రపంచానికి సవాలుగా మారుతున్నాయి. యేటా టీవీలు.. ఏసీలు.. స్మార్ట్ ఫోన్లు.. కంప్యూటర్లు.. ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగి పోతుంది. వీటి వాడకం యేటా 35 శాతం పెరిగి పోతుండగా 33 శాతం వ్యర్థాలుగా మారుతున్నాయని గణంకాలు చెబుతున్నాయి. 2021-22లో 17.86 లక్షల టన్నుల ఈ వ్యర్థాలు వెలువడ్డాయి. వీటిలో కేవలం 3.93 టన్నులు మాత్రమే రీసైక్లింగ్ చేయబడుతున్నాయి.

మిగిలిన వ్యర్థాలుగా కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. ప్రతి యేటా పేరుక పోతున్న వ్యర్థాలన్నీ భూమి.. నీరు.. గాలి కాలుష్యానికి కారణమవుతోన్నాయి. దీని వల్ల భూమి వేడెక్కి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి. రుతుపవనాల గమనం దెబ్బతీయడానికి ఈ వ్యర్థాలు కారణం అవుతున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వాడే ప్లాస్టిక్.. నికెల్.. లెడ్.. క్రోమియం.. అల్యూమినియం వంటి విషతుల్యాలు భూమిలో కలుస్తుండటంతో కొత్త సమస్యలు వస్తున్నాయి.

భూగర్భ జలాలు కలుషితం కావడంతో చర్మ.. శ్వాసకోశ.. గుండె.. క్యాన్సర్ సంబంధ వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. దీని వల్ల జీవావరణ సమతుల్యత దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యర్థాలు సేకరించడం రీ సైక్లింగ్ చేయడంపై దృష్టి సారిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యర్థాలు వెలువరించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. మొదటి స్థానంలో అమెరికా.. రెండో స్థానంలో చైనా ఉన్నాయి. భారత్ లో యేటా ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోవడంతో ఈ వ్యర్థాలు సైతం అదే స్థాయిలో పేరుకుపోతున్నాయి. 2028-29 నాటికి దేశంలో ఈ వ్యర్థాలు 32.30 లక్షలు ఉండే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంచనా వేసింది.

ఈ వ్యర్థాలను అత్యధికంగా వెలువరిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్.. ఉత్తరప్రదేశ్.. కర్ణాటక.. ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ వ్యర్థాలను నిర్మూలించేందుకు 2016లోనే కేంద్ర చట్టం తీసుకొచ్చిన సత్ఫలితాలు మాత్రం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా కేంద్ర.. రాష్ట్రాల ఈ వ్యర్థాల నిర్మూలనపై దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో పెను ప్రమాదం తప్పదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×