టీడీపీ కంచుకోటలో వైసీపీకి కాక మొదలైందా...!

ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకున్నా.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల దూకుడు కారణంగా.. ఈ ఆశలు నెరవేరుతాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో నేతల మధ్య ముసలం పుట్టింది. నియోజకవర్గం అసలే ఇది టీడీపీ కంచుకోట. గత ఎన్నికల్లో పార్టీ 23 సీట్లకు పరిమితం అయినా కూడా కొండపిలో ఎమ్మెల్యే స్వామి వరుసగా రెండోసారి గెలిచారు. ఇన్చార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబు వ్యవహార శైలిని  సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అంతేకాదు ఆయన ఇన్చార్జిగా వద్దని మార్చేయాలని అసమ్మతి వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక కామేపల్లి రోడ్డులోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 150 మందికిపైగా వైసీపీ నేతలు సర్పంచ్లు ఎంపీటీసీలు అశోక్ బాబుకు వ్యతిరేకంగా భేటీ అయ్యారు. మొత్తంగా వీరు మూకుమ్మడిగా తేల్చింది ఏంటంటే.. వరికూటితో తాము కలిసి ముందుకు సాగబోమనే..!

అంతేకాదు అశోక్ బాబుకు అధిష్ఠానం సీటిస్తే ఇండిపెండెంట్ గా గట్టి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించి సీఎం జగన్కు కానుకగా ఇస్తామని ప్రతిజ్ఞ చేయడం కొసమెరుపు. అంతేకాదు.. అశోక్ బాబుకు అర్హత లేదని నాయ కులు తీర్మానం చేయడం..  వార్డులో కూడా గెలిచే అర్హతలేని వరికూటి.. ఎమ్మెల్యేగా ఎలా ? విజయం దక్కించుకుంటారనేది వీరి ప్రధాన ప్రశ్న. మొత్తంగా చూస్తే.. కొండపి నియోజకవర్గంలో ముసలం ఎటు మలుపు తిరుగుతుందో అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతుండడం గమనార్హం.

మరోవైపు.. స్థానికంగా కూడా వరికూటిపై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన అన్నింటిలోనూ  వసూళ్లు పడుతున్నారనేది స్థానికుల మాట. ఇటీవల వైసీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టించడం మరింత వివాదానికి దారితీసింది. అంతేకాదు.. పార్టీలోనూ కొందరని ముద్దు చేయడం.. మరికొందరిని దూరం పెట్టడం వంటిది కూడా  పార్టీలో అసమ్మతికి.. అసంతృప్తికి దారి తీసింది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×