12 ఏళ్ల తర్వాత భారత్–పాక్ సంబంధాల్లో కీలక పరిణామం!

దాయాది దేశాలు.. భారత్ పాకిస్థాన్ సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అది కూడా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కావడం ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో భద్రతా సిబ్బందిపై దాడులు సీమాంతర ఉగ్రవాదం ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాల నేపథ్యంలో భారత్ –పాకిస్థాన్ సంబంధాలు గాడితప్పాయి. అంతేకాకుండా ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో అంతంతమాత్రంగా ఉన్న భారత్ పాక్ సంబంధాలు పూర్తిగా దిగజారాయి.

ఇలా సీమాంతర ఉగ్రవాదం కశ్మీర్ అంశాలపై భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోవాలో త్వరలో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో పాల్గొనేందుకు భారత్.. పాకిస్థాన్ కు ఆహ్వానం పంపింది.

ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్. జైశంకర్.. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు అధికారికంగా ఆహ్వానం పంపారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

కాగా గతేడాది సెప్టెంబరులో షాంఘై సదస్సు నిర్వహణకు భారత్ అధ్యక్ష బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో గోవాలో మంత్రుల స్థాయి సమావేశాలు నిర్వహించనుంది.

మే 4–5 తేదీల్లో గోవా వేదికగా ఎస్సీవో విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలని భారత్.. ఇటీవల షాంగై సహకార సంస్థలోని సభ్య దేశాలన్నింటిని ఆహ్వానించింది. ఈ మేరకు వాటికి ఆహ్వానాలు పంపింది. ఇందులో భాగంగా చైనా రష్యా కజకిస్థాన్ కిర్గిస్థాన్ తజకిస్థాన్ ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలతో పాటే పాకిస్థాన్కు కూడా ఈ ఆహ్వానం వెళ్లిన ట్టు తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ తనకు ఆహ్వానం అందినట్టు ఇంకా ధ్రువీకరించలేదు.

ఒకవేళ భారత్ ఆహ్వానం మేరకు పాక్ విదేశాంగ మంత్రి భారత్ కు వస్తే 12 ఏళ్ల తర్వాత వచ్చినట్టు అవుతుంది.  2011లో అప్పటి పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. భారత్ సాయం అందిస్తే తప్ప ఈ గండం నుంచి బయటపడే సూచనలు లేవని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్–పాక్ సంబంధాలపై ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. భారత్తో మూడు యుద్ధాల నుంచి తాము చాలా నేర్చుకున్నామన్నారు. భారత్ తో ప్రశాంత వాతావరణంలో సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ ఆహ్వానం పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు తమ విదేశాంగ విధానంలో 'పొరుగుదేశాలకే ప్రథమ ప్రాధాన్యం' లో భాగంగానే పాకిస్థాన్ కు ఈ ఆహ్వానం పంపామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×