నాడు చంద్రబాబు జగన్ కి పెట్టినవే నేడు లోకేష్ కి అప్పగిస్తున్నారంతే...!

ఆనాడు అంటే ఇప్పటికి అయిదేళ్ల క్రితం 2017 నవంబర్ 6 నుంచి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టారు. ఆయన పాదయాత్రకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం షరతులు పెట్టింది అన్నది ఇపుడు వెలుగు చూస్తున్న అంశం. ఎందుకంటే లోకేష్ పాదయాత్రకు షరతులు పెట్టారు అని తెలుగుదేశం విమర్శలు చేస్తోంది.

దాంతో ప్రభుత్వం ఒక పక్కా క్లారిటీతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.  దీని మీద చిత్తూరు ఎస్పీ పేరిట వివరణ వచ్చింది. అదేంటి అంటే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఎవరికైనా ఒకేలా షరతులు పెడతామని పేర్కొన్నారు. ఆనాడు కూడా జగన్ కి ఇవే షరతులతో పాదయాత్రకు అనుమతించారని ఇపుడు అవే ఉన్నాయని చెబుతున్నారు.

ఈ రూల్స్ అన్ని కూడా సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడే ఉన్నాని చెబుతున్నారు. సుప్రీం కోర్టు ఒక సుమోటో కేసు మీద తీర్పు చెబుతూ ఇలా గైడ్ లైన్స్ తెచ్చింది. ఆ గైడ్ లైన్స్ ఏంటో ఒక్కసారి చూస్తే రోడ్ల మీద ఏ కార్యక్రమం ఎవరూ చేయకూడదు అంబులెన్స్ లకు ఏ సభ అయినా దారి ఇవ్వాలి. సభ పెట్టుకునే వారే తమ సొంత పూచీకత్తు మీద సభను సాఫీగా సాగేలా వాలంటీర్లను నియమించుకోవాలి.

భారీ శబ్దాలు చేయరాదు బాణా సంచా కాల్పులు  అవతల ప్రజలు భయభ్రాంతులు అయ్యేలా చేయరాదు. జిలా పోలీసుల అనుమతితోనే సభలు అయినా ఏవైనా నిర్వహించాలి. మారణాయుధాలు వంటివి సభకు వచ్చే వారి వద్ద ఉండరాదు సభ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలి. ఇలా చాలా నిబంధలలను సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ద్వారా తెచ్చారు.

వాటి ప్రకారం పాదయాత్ర చేయాలీ అంటే కచ్చితంగా రోడ్డుకు ఎడం పక్కన రెండు వరసలలో చేయాలని ఉంది. ఇక ఒక జిల్లాను దాటి మరో జిల్లాకు వెళ్తున్నపుడు తప్పనిసరిగా ఆ జిల్లా పోలీసు అధికారికి రిపోర్ట్ చేయాలి. పాదయాత్ర కానీ సభ కానీ ఏదైనా అనుకోని అవాంచనీయ ఘటనలు జరిగినపుడు కానీ ఏదైనా అనుమానాలు ఉంటే కనుక కచ్చితంగా దాన్ని రద్దు చేసే అధికారం ఏ సమయంలో అయినా స్థానిక పోలీసులకు ఉంటుంది. అలాగే అవాంచనీయ ఘటనలు జరిగితే తక్షణం దాన్ని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది.

ఇలా చాలా నిబంధనలు ఉన్నాయి. వాటినే ఇపుడు లోకేష్ పాదయాత్రకు కూడా వర్తింపచేస్తున్నాం తప్ప వేరేదీ కాదని అంటున్నారు. అంతే కాదు కుప్పంలో సభకు పద్నాలుగు షరతులు పాదయాత్రకు పదిహేను షరతులు విధించారు. అయితే దీని మీద రాజకీయ రాధాంతం అయితే జోరుగా సాగుతోంది.లోకేష్ పాదయాత్రకు సంకెళ్ళు అంటూ తెలుగు తమ్ముళ్ళు విమర్శిస్తున్నారు. అయితే నాడు జగన్ పాదయాత్ర టైం లో కూడా అలాగే షరతులు పెట్టారని పాత కాపీలను వైసీపీ నేతలు చూపిస్తున్నారు.

మొత్తానికి చూస్తే ఇపుడే అసలైన రాజకీయం మొదలైంది. మరి లోకేష్ పాదయాత్ర తొలి అడుగులోనే ఇంత రచ్చ ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో కూడా చూడాలి. అటు ప్రతీ విషయాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం అన్ని పార్టీలు చూస్తున్న నేపధ్యం అప్రమత్తంగా ఉండాల్సింది ప్రజలు పోలీసులే అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×