వైసీపీ తిరిగి అధికారంలోకి రాకపోతే జరిగేది ఇదే: వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ పెద్ద కంకణమే కట్టుకుంది. వై నాట్ 175? అని ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జులు ప్రతి గడపకు వెళ్లి ఈ మూడున్నరేళ్లలో జరిగిన లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.

మరోవైపు వైఎస్ జగన్ సైతం వివిధ సంక్షేమ కార్యక్రమాలు పథకాల ప్రారంభాలకు ఆయా జిల్లాలను ఎంచుకుంటున్నారు. భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకు జరిగే యుద్ధమని అభివర్ణిస్తున్నారు.

ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి రాకపోతే పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పుడు వచ్చే పథకాలు ఆగిపోతాయన్నారు. పేద ప్రజల కోసమైనా వైసీపీ తిరిగి అధికారంలోకి రావాల్సి ఉందని హాట్ కామెంట్స్ చేశారు.

ప్రభుత్వం విద్య వైద్యం కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఎక్కడా లేని విధంగా నాడు–నేడుతో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తోందన్నారు. ఏ పథకం ప్రారంభించినా ముఖ్యమంత్రి జగన్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. గ్రామస్ధాయి నుంచే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకు మన సచివాలయ వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించారు.

ఈ మేరకు విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన గృహ సారథులు వలంటీర్ల సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. గ్రామ వాలంటీర్లతో కలిసి గృహసారథులు ఎలా పనిచేయాలనేది త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు అందుతున్న పథకాలపై గృహసారథులు వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలన్నారు.  మీడియాలో చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డుకట వేయాలన్నారు. అందుకే సీఎం జగన్ సమాంతర వ్యవస్ధల్ని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల వరకు ఈ ఏడాది కాలం అప్రమత్తంగా ఉండాలని వలంటీర్లు గృహ సారథులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రాకపోతే కోట్లాది మంది ప్రజలు నష్టపోతారని చెప్పారు.

కాగా ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి గురి చే స్తున్నారని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే ఇప్పుడు వస్తున్న పథకాలు నిలిచిపోతాయని.. ప్రజలు నష్టపోతారని చెబుతున్నారు. పథకాలు రావాలంటే మళ్లీ వైసీపీకే ఓటేయాలని వివిధ సభల్లో కార్యక్రమాల్లో నొక్కివక్కాణిస్తున్నారు. వైసీపీ కాకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ పథకాలను ఎత్తేస్తారని వలంటీర్ సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తారని వైసీపీ నేతలు ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి గురి చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే తీరులో మాట్లాడటం గమనార్హం. తాము అధికారంలోకి రాకపోతే కోట్లాదిమంది ప్రజలు నష్టపోతారని ఆయన చెప్పడం గమనార్హం. ఇక సీఎం జగన్ అయితే పేదలకు పెత్తందార్లకు జరిగే యుద్ధంగా వచ్చే ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. ఓటమి భయం వల్లే వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×