పవన్ కోర్టులో బంతిని నెట్టిన బీజేపీ

బీజేపీ ఢక్కా మెక్కీలు తిన్న పార్టీ. ఆ పార్టీ రాజకీయం ఒక లెవెల్ లో ఉంటుంది. ఏడారి లాంటి చోట కూడా కమలాన్ని వికసింపచేయగలగడం బీజేపీ స్పెషాలిటీ. ఇక ఏపీలో చూస్తే బీజేపీ గతం కంటే బలపడాలని ఏదో నాటికి అధికారానికి చేరువ కావాలని చూస్తోంది. దాంతో బడా పార్టీలతో పొత్తులకు స్వస్తి పలికి కొత్త పార్టీ అయిన జనసేనతో జట్టు కట్టింది.

తమ కాంబినేషన్ ఏపీలో మూడవ ఆల్టర్నేషన్ అవుతుంది అని భావించింది. కానీ జనసేనకు మాత్రం 2014 పొత్తులు రిపీట్ చేయాలని ఉంది. ఏపీలో తెలుగుదేశం వంటి బలమైన పార్టీతో కలసి ముందుకు సాగితేనే తమ లక్ష్యం నెరవేరుతుందని పవన్ ఆశిస్తున్నారు. అందుకే ఆయన బీజేపీని కూడా కలుపుకుని తెలుగుదేశం తో జట్టు కట్టాలనేది పవన్ మార్క్ ప్లాన్.

దాన్ని భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో తుదికంటా తోసిపుచ్చేశారు. పైగా తమకు వైసీపీ తెలుగుదేశం రెండు పార్టీలు శత్రువులే అని తేల్చేసారు. ఈ రెండు పార్టీలు అవినీతి కుటుంబ పార్టీలు అని స్పష్టం చేశారు. ఇక పవన్ తమతో కలసి వస్తే రావచ్చు అని కూడా ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అన్న మాటలను తీసుకుంటే జనంతోనే పొత్తులు అని చూస్తే కనుక జనసేనతో పొత్తు విషయం పెద్దగా ప్రస్తావించలేదు అని తెలుస్తోంది.

తమ పొలిటికల్ స్టాండ్ ఏపీలో పొత్తుల విషయం తేల్చేశాం కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మరో వైపు చూస్తే బీజేపీ కూడా చివరి నిముషంలో పొత్తులతో కలిస్తే ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది కూడా చంద్రబాబు పవన్ తో చర్చించారు అని అంటున్నారు. ఆ సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతోనే బీజేపీ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని అని అంటున్నారు.

దాంతోనే వారు పొత్తులు లేవు ఏమీ లేవు అంటున్నారు అని తెలుస్తోంది. నిజానికి ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం పొత్తులతో వెళ్తే ఎన్నో కొన్ని సీట్లు వస్తాయని భావిస్తోంది. కానీ మరీ బొత్తిగా తక్కువ సీట్లు తమకు ఇస్తే ఇక ఏపీలో తాము ఎప్పటికి బలపడేనూ అన్న ఆలోచనతోనే పొత్తు వద్దు అని గట్టిగా చెప్పేస్తున్నారు అని అంటున్నారు. ఇక పవన్ చంద్రబాబుల కూటమిలో జూనియర్ పార్టనర్ గా ఉండేకంటే పవన్ని తమ వైపు తిప్పుకుని మేజర్ రోల్ ప్లే చేయడానికే బీజేపీ ఇష్టపడుతోంది అని అంటున్నారు. అందుకు గాను పవన్ నిర్ణయానికే అంతా వదిలేశారు అని అంటున్నారు.

పవన్ కనుక బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలీ అంటే కచ్చితంగా తెలుగుదేశం ఊసు ఎత్తకుండా ఈ వైపు నకు రావాలి. లేకపోతే ఆ పొత్తు రద్దు అయినట్లే అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీజేపీ వంటి బలమైన జాతీయ పార్టీ తమ వైపు లేకపొతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది అన్న ఆలోచనలు చంద్రబాబుకూ పవన్ కి ఉన్నాయని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలసి వెళ్తే కలిగే మేలు వేరేగా ఉంటుందని వారు అనుకుంటున్నారు అని తెలుస్తోంది. ఈ రకమైన ఆలోచనలను పసిగట్టిన తరువాతనే బీజేపీ భీష్మించుకుని కూర్చుంది అని అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీకి పోయేది ఏమీ లేదు.

పవన్ తమతోకూడితే మూడవ ఆల్టర్నేషన్ అని బిగ్ సౌండ్ చేస్తారు లేకపోతే ఒంటరి పొత్తుకు పోతారు. గతంలో వచ్చిన ఒక శాతం ఓట్ల కంటే నష్టం వేరేది ఉండదు కదా అన్నదే ఆ పార్టీ ప్లాన్. ఈ నేపధ్యంలో నుంచి చూస్తే తెలివిగానే తెలుగుదేశాన్ని విమర్శిస్తూ పవన్ తమకు మిత్రుడో కాదో బీజేపీ చెప్పమంటోంది. మరి పవన్ కోర్టులో బంతిని ఎలా డీల్ చేసి ఏ వైపు నకు విసురుతారో చూడాల్సి ఉంది.        నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×