మాంద్యం వేళ మన ఆర్థిక బడ్జెట్ ఎటువైపు?

ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పై దేశ ప్రజలంతా బోలెడు ఆశపెట్టుకున్నారు. వ్యాపార పారిశ్రామికవర్గాలు కూడా ఈ సంవత్సరం మాంద్యం మబ్బుల వేళ ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్రంలో వరుసగా రెండు సార్లు ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వం వచ్చే లోక్ సభ ఎన్నికల్లోగా ప్రవేశపెట్టే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.

మోడీ ఎప్పుడూ జనాకర్షక పథకాలకు వ్యతిరేకం. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తారు. ఈసారి కరోనాతో సృష్టించిన ఆర్థిక అల్లకల్లోలం వేల సగటు మనిషి జీవన స్థితిగతులు దారుణంగా దెబ్బతిన్నాయి. కరోనా ముప్పు తొలిగి కార్యకలాపాలు కుదురుకుంటున్న వేళ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో ఆర్థిక మాంద్యం వచ్చిపడింది. సరుకుల సరఫరా వ్యవస్థలు దెబ్బతిని ద్రవ్యోల్బణం పెరిగింది. ఐరోపా దేశాల్లో ఆర్థికంగా పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ప్రభుత్వాలే కూలిపోతున్నాయి.

ఈ క్రమంలోనే దేశంలో సరుకులకు గిరాకీని పెంచడం.. ఆర్థికవృద్ధికి చాలా కీలకం అని ఇందుకోసం పేదల జీవన ప్రమాణాలను పెంచేదిశగా ఆర్థిక విధానాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనాతో భారతీయుడి తలసరి వార్షిక స్థూల జాతీయాదాయం కరోనా ముందు స్థాయికి చేరలేదు. కరోనా తర్వాత కార్యకలాపాలు పెరిగాయి. కానీ వనరులు ఉన్న వర్గాలు వేగంగానే పుంజుకున్నా.. కరోనా వల్ల ఆదాయాలు కోల్పోయి మనుగడ కోసం ఆదా చేసుకున్న కొద్దోగొప్పో మొత్తాలను వాడేసుకున్నవారు.. అప్పులపాలైన సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. వారి కొనుగోలు శక్తి బాగా క్షీణించింది. దీంతో దేశంలో ఆర్థిక అసమానతలు భారీగా పెరుగుతున్నాయి.

వృద్ధిరేటు పెరగాలంటే మౌలిక వసతులపై బాగా ఖర్చు చేయాలి. ప్రస్తుత ఏడాది మూలధన వ్యయం కోసం రూ.7.5 లక్షల కోట్లు కేటాయించారు. దీన్ని రూ.10-12 లక్షల కోట్లకు పెంచాలి. ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి.వాటికి ప్రోత్సహాకాలు అందించాలి. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టాలి. గ్రామీద ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు చేపట్టాలి.

ముఖ్యంగా ఉద్యోగాల కోతలతో బతుకుతున్న మధ్యతరగతి ప్రజానీకానికి.. ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చేలా కొన్ని ఆదాయ పన్ను మినహాయింపులను రాయితీలను ప్రకటించాలి. ఇలా అన్నింటిని చేస్తేనే అది జనరంజక బడ్జెట్ అవుతుంది. ప్రజలను ఆకర్షిస్తుంది. లేకుంటే మోడీ సర్కార్ బడ్జెట్ పై మరిన్ని విమర్శలు వస్తాయి. ఆర్థికంగా దేశం అథోగతి పాలవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×