ఆస్కార్ బరిలో 'చెలో షో' వైఫల్యానికి కారణం?

పాన్ నళిన్ తెరకెక్కించిన గుజరాతీ చిత్రం' చెలో షో' ఆస్కార్ 2023కి నామినేషన్ పొందుతుందని అంచనా వేసారు. కానీ నిరంతరం చర్చల్లో నిలిచిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల నామినేషన్ జాబితాలోకి ప్రవేశించలేకపోయింది. ఈ వైఫల్యానికి కారణమేమిటో చిత్రబృందం వివరించాల్సి ఉంటుంది.

ఆస్కార్ 2023 నామినేషన్లు జనవరి 24న సాయంత్రం 7 గంటలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రధాన కేటగిరీలలో అధికారిక ఆస్కార్ నామినీలను ఆవిష్కరించింది. అన్ని ఆశలు పాన్ నళిన్ తెరకెక్కించిన విమర్శకుల ప్రశంసలు పొందిన 'చెలో షో'పైనే ఉన్నాయి. కానీ చివరిలో ఊహించని ట్విస్టు. ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో చేరుతుందనుకున్న ఈ సినిమా చివరికి నిరాశపరిచింది. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్-అవతార్: ది వే ఆఫ్ వాటర్-ఎల్విస్ సహా ఇతర చిత్రాలు ఉత్తమ చిత్రం విభాగాల్లో నామినేట్ కాగా భారతదేశం తరపున అధికారిక ఎంట్రీ 'చెలో షో' ఆ అరుదైన అవకాశాన్ని కోల్పోయింది.

95వ ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ అకాడమీ శామ్యూల్ గోల్డ్ విన్ థియేటర్లో జరిగింది. ఆస్కార్-విజేత నటుడు కం నిర్మాత రిజ్ అహ్మద్ - అల్లిసన్ విలియమ్స్ ఆస్కార్ 2023 నామినేషన్ల ప్రకటించారు.

పాన్ నళిన్ తెరకెక్కించిన 'చెలో షో' ఫలితం ఎలా ఉండబోతోంది? అంటూ ఎంతో ఆసక్తిగా చిత్రబృందం వేచి చూసింది. కానీ ఆ పేరు కనిపించలేదు వినిపించలేదు. నిజానికి భారతదేశం తరపున ఉత్తమ చిత్రం కేటగిరీలో నిలిచిన ఏకైక చిత్రమిది. కానీ తుది నామినేషన్ల పోరులో నెగ్గలేకపోయింది.

చెలో షోకి ఎంచుకున్న కథాంశం ఆసక్తిని కలిగించేదే. తొమ్మిదేళ్ల కుర్రాడు సమయ్ సినీఅభిరుచి ఎలాంటిది.. అతడు అంత పేదరికంలోను తాను అనుకున్న లక్ష్యం వైపు ఎలా ప్రయాణించాడు అనే చిన్న కథను తెరపై హృద్యంగా తెరకెక్కించారు.

దర్శకుడు నిజమైన అభిరుచితోనే ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ గెలుచుకోవాలని కలలు కన్నాడు. కానీ అది నిజం కాలేదు. చరిత్రలో భారతదేశం నుంచి ఎన్నో సినిమాలు ఆస్కార్ తుది గడప వరకూ వెళ్లి వెనుదిరిగాయి. అమీర్ ఖాన్ 'లగాన్' నామినేషన్ అయ్యాక ఫైనల్ లో వేరొక అమెరికన్ చిత్రానికి ఆస్కార్ ని కోల్పోయింది. ఇంకా ఎన్నో ఇలాంటి అనుభవాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు.

చెలో షో చిత్రం 10 జూన్ 2021న థియేట్రికల్ గా విడుదలైంది. భవిన్ రబారి- భవేష్ శ్రీమాలి- రిచా మీనా- దిపెన్ రావల్ సహా పలువురు ప్రతిభావంతులైన కళాకారులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కానీ ఆస్కార్ పోరు నుంచి నిష్కృమించింది. అయితే మార్చిలో ఆస్కార్ లు అందుకునే జాబితాలో ఆర్.ఆర్.ఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ చిత్రం నుంచి నాటు నాటు పాట ఉత్తమ గీతం కేటగిరీలో నామినేషన్ పొందడమే దీనికి కారణం.

చెలో షో నిర్మాతలు ఆస్కార్ పోరులో ప్రచారం నిర్వహించేందుకు భారీ బడ్జెట్లను వెచ్చించలేని సన్నివేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. నిజానికి ఆర్.ఆర్.ఆర్ కి గ్లోబల్ వరల్డ్ లో దక్కిన ప్రచారం చిన్న సినిమా అయిన 'చెలో షో'కి దక్కలేదన్నది వాస్తవం.కేవలం సినిమాలో కంటెంట్ దమ్ము ఉంటే సరిపోదు. ప్రచారపు ఎత్తుగడలు.. ప్రముఖులతో ఇంటరాక్షన్ లు ప్రపంచం దృష్టికి తమ సినిమాని తీసుకెళ్లే విధానం ఇవన్నీ కూడా ఆస్కార్ రేసులో ఫలితాలను తారుమారు చేస్తుంటాయన్నది అందరికీ తెలిసిన నిర్వివాదాంశం.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×