పఠాన్

'పఠాన్' మూవీ రివ్యూ
నటీనటులు: షారుఖ్ ఖాన్-దీపికా పదుకొనే-జాన్ అబ్రహాం-డింపుల్ కపాడియా-అశుతోష్ రాణా తదితరులు
సంగీతం: సంచిత్ బల్హారా-అంకిత్ బల్హారా
ఛాయాగ్రహణం: సచిత్ పాలోజ్
నిర్మాత: యశ్ చోప్రా
రచన-దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్

సరైన హిట్టు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. చివరగా 'జీరో' సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తిన్న షారుఖ్.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యాక్షన్ సినిమాల స్పెషలిస్టు సిద్దార్థ్ ఆనంద్‌ తో జట్టు కట్టాడు. వీరి కలయికలో తెరకెక్కిన 'పఠాన్' భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా.. హిట్టు కోసం షారుఖ్ నిరీక్షణకు తెరదించిందా.. చూద్దాం పదండి.

కథ:

పఠాన్ (షారుఖ్ ఖాన్) అనాథగా పెరిగి పెద్దవాడై.. దేశం కోసం సైన్యం చేరి.. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధ పడ్డ వ్యక్తి. అతను తర్వాత 'రా'లో సీక్రెట్ ఏజెంట్ గా మారి రకరకాల ఆపరేషన్లలో పని చేస్తుంటాడు. ఒక మిషన్లో తీవ్ర గాయాల పాలై 'రా'కు దూరం అయిన పఠాన్.. తనలా దెబ్బ తిని 'రా'లో పని చేయడానికి అర్హత కోల్పోయిన మరికొందరితో కలిసి ఒక స్పెషల్ టీం తయారు చేస్తాడు. ఒకప్పుడు 'రా'లో పని చేసి.. ఆ తర్వాత దేశ ద్రోహిగా మారిన జిమ్ (పఠాన్) పాకిస్థాన్ తో కలిసి ఇండియాకు వ్యతిరేకంగా చేస్తున్న ఒక భారీ కుట్రను ఛేదించాల్సిన బాధ్యతను చేపడుతుంది పఠాన్ బృందం. ఇంతకీ జిమ్ గతమేంటి.. ఇండియాను దెబ్బ కొట్టడానికి శత్రు దేశంతో కలిసి అతను చేసిన కుట్ర ఏంటి.. దీన్ని పఠాన్ ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

షారుఖ్ ఖాన్ అంటే ఒక స్టైల్.. షారుఖ్ ఖాన్ అంటే ఒక స్వాగ్.. షారుఖ్ ఖాన్ అంటే ఒక ఛార్మ్. ఏ పాత్ర చేసినా.. దానికొక స్టైల్ ఆపాదించి.. తనకే సొంతమైన ఆకర్షణతో ప్రేక్షకులను సమ్మోహనపరచడం షారుఖ్ ప్రత్యేకత. కానీ షారుఖ్ ను బాలీవుడ్ దర్శకులు సరిగ్గా వాడుకుని చాలా కాలం అయిపోయింది. గత దశాబ్ద కాలంలో తనకు నప్పని.. ప్రేక్షకులకు రుచించని కథలతో షారుఖ్ పూర్తిగా గాడి తప్పేశాడు. 'జీరో' సినిమాతో దాదాపుగా జీరో అయిపోయాడు. ఐతే కాస్త ఆగి ఆలోచిస్తే కానీ తానేం తప్పు చేస్తున్నాడో.. ప్రేక్షకులతో ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతున్నాడో షారుఖ్ కు అర్థం కానట్లుంది. ఈసారి బాగా గ్యాప్ తీసుకుని.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లు తీస్తున్న సిద్దార్థ్ ఆనంద్ తో జట్టు కట్టడం షారుఖ్ కెరీర్లో ఉత్తమ నిర్ణయాల్లో ఒకటని చెప్పొచ్చు. 'పఠాన్'లో సిద్దార్థ్ తన మార్కు ట్విస్టులతో కూడిన స్టైష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించడమే కాదు.. షారుఖ్ ను అభిమానులతో పాటు అందరూ మెచ్చేలా ప్రెజెంట్ చేశాడు. కథాకథనాలు క్లిక్ అయి.. షారుఖ్ 'ది బెస్ట్'గా కనిపిస్తే ఆ సినిమా ప్రేక్షకులను అలరించకుండా ఎలా ఉంటుంది?

సిద్దార్థ్ ఆనంద్ సినిమాలంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలుంటాయి. వాటిలో కళ్లు చెదిరిపోయే ప్రపంచ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. హీరో-విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది. హీరో పాత్ర సటిల్ గా అనిపిస్తూనే పవర్ ఫుల్ గా ఉంటుంది. విలన్ పాత్ర హీరోకు దీటుగా.. ఇంకా చెప్పాలంటే హీరోను మించి ఉంటుంది. కథ పరంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ట్విస్టులుంటాయి. స్క్రీన్ ప్లే రేసీగా సాగిపోతుంది. 'పఠాన్' సినిమాలో సైతం వీటికి లోటేమీ లేదు. కథ ఔట్ లైన్ చూస్తే అంత విశేషం ఏమీ కనిపించదు. దేశం కోసం తాను ప్రాణాలు పెట్టి పోరాడితే తన కుటుంబాన్ని కాపాడాల్సినపుడు దేశం అండగా నిలవలేదన్న ఆక్రోశంతో దేశం మీదే దండెత్తడానికి సిద్ధపడ్డ విలన్.. నిజమైన సైనికులు దేశానికి తనేం చేశానని తప్ప తనకు దేశం ఏం చేసిందో ఆలోచించడంటూ దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే హీరో.. వీరి మధ్య ఎత్తులు పై ఎత్తులతో సాగే సినిమా ఇది. కథ పరంగా పాతగా అనిపించినా.. స్క్రీన్ ప్లే.. నరేషన్ చాలా ట్రెండీగా ఉంటూ ఆద్యంతం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.

మామూలుగా అయితే బాలీవుడ్ సినిమాల్లో హీరో ఎలివేషన్లు మరీ ఎక్కువగా ఉండవు. కానీ దక్షిణాది సినిమాలకు హిందీ ప్రేక్షకులు బాగా అలవాటు పడి అలాంటి వినోదమే కోరుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్ ఫిలిం మేకర్లలోనూ మార్పు వస్తోందనడానికి 'పఠాన్' సూచిక. ఇందులో సౌత్ సినిమాలకు దీటుగా హీరో ఎలివేషన్లు సెట్ చేశాడు సిద్ధార్థ్. షారుఖ్ గత సినిమాల్లో ఏం మిస్సయిందో అదంతా అతను ఇచ్చేశాడు. తొలి సన్నివేశం నుంచి షారుఖ్ కు మంచి ఎలివేషన్లు ఇస్తూ అభిమానులతో విజిల్స్ కొట్టించాడు. రొటీన్ సీన్లలో కూడా షారుఖ్ మార్కు చమత్కారం.. హావభావాలు అలరిస్తాయి. యాక్షన్ సీన్లలో షారుఖ్ కుర్ర హీరోలకు దీటుగా అదరగొట్టేయడంతో అవన్నీ బాగా ఎంగేజ్ చేస్తాయి. మామూలుగా ఇలాంటి సినిమాల్లో విలన్ పాత్రను నేరుగా రంగంలోకి దించకుండా.. ఏ ఇంటర్వెల్ దగ్గరో ఎంట్రీ ఇప్పించి అక్కడ్నుంచి హీరో-విలన్ మధ్య పోరాటం మొదలుపెట్టడం కాకుండా.. చాలా త్వరగానే ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ చేసేశాడు దర్శకుడు. రెండు పాత్రలూ నువ్వా నేనా అన్నట్లు సాగుతాయి. దీపికాకు షారుఖ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఎంగేజింగ్ గానే సాగాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.

ద్వితీయార్ధంలో సల్మాన్ ఖాన్ ఎంట్రీతో సినిమా ఇంకో లెవెల్ కు వెళ్తుంది. షారుఖ్-సల్మాన్ మధ్య సరదా సంభాషణల మధ్య మైండ్ బ్లోయింగ్ గా అనిపించే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ హై తర్వాత సినిమా కొంచెం నెమ్మదిస్తుంది. కొన్ని సీన్లు బోరింగ్ గా అనిపిస్తాయి. కానీ మళ్లీ ప్రి క్లైమాక్స్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. ఇండియా మీద వైరస్ వార్ చుట్టూ నడిపిన సన్నివేశాలు కొంచెం అతిగా అనిపించినా.. యాక్షన్ సన్నివేశాలు.. ఎలివేషన్లు పతాక స్థాయిలో సాగడంతో ప్రేక్షకులకు ఎంగేజ్ అయిపోతారు. సినిమాలో ఎక్కడ కొంచెం బలం తగ్గినట్లు అనిపించినా షారుఖ్ తన ఆకర్షణతో ఎంగేజ్ చేస్తాడు. అలాగే షారుఖ్ కొంచెం వీక్ గా అనిపించిన చోట కథనంలోని బలం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. యాక్షన్-గ్లామర్ మోతాదు మరీ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కు 'పఠాన్' రుచించకపోవచ్చు కానీ.. యూత్ కు మాత్రం ఈ సినిమా మంచి కిక్కిస్తుంది. యాక్షన్ ప్రియులకైతే ఇది విందు భోజనమే.

నటీనటులు:

షారుఖ్ ఖాన్ ఫాంలో ఉంటే ఎలా ఎంటర్టైన్ చేస్తాడో.. ఆయనకు సరైన క్యారెక్టర్ పడితే దాన్నెలా పండిస్తాడో 'పఠాన్'లో చూడొచ్చు. 'swag' అనే పదానికి అర్థమేంటో షారుఖ్ చూపిస్తాడు. బేసిగ్గా పఠాన్ క్యారెక్టర్ సీరియస్ అయినప్పటికీ.. షారుఖ్ తనకే సొంతమైన హ్యూమర్ ను జోడిస్తూ ఆ పాత్రను ఎంటర్టైనింగ్ గా మార్చిన తీరు తన ప్రత్యేకతను చాటుకుంటుంది. షారుఖ్ స్టైల్.. అతడి హావభావాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. పాత్రకు తగ్గట్లు బెస్ట్ ఫిజిక్ తో.. చాలా స్టైలిష్ గా కనిపించాడు కింగ్ ఖాన్. ఎమోషనల్ సీన్లలో సైతం ఆయన బాగా చేశాడు. ఐఎస్ఐ ఏజెంట్ పాత్రలో దీపికా కూడా బాగా చేసింది. ఆమె సినిమా అంతటా చాలా సెక్సీగా కనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లో షారుఖ్ కు దీటుగా అదరగొట్టింది. విలన్ పాత్రలో జాన్ అబ్రహాం కూడా చాలా బాగా చేశాడు. హీరోని మించి అతను స్టైలిష్ గా కనిపించాడు. జాన్ పెర్ఫామెన్స్ కూడా చాలా స్టైలిష్ గా సాగింది. అతను ఎప్పట్లాగే సూపర్ ఫిట్ గా కనిపించాడు. సహాయ పాత్రలో డింపుల్ కపాడియా.. అశుతోష్ రాణా బాగా చేశారు. క్యామియో పాత్రలో సల్మాన్ ఖాన్ మెరుపులు మెరిపించాడు.

సాంకేతిక వర్గం:

యశ్ రాజ్ ఫిలిమ్స్ తీసే యాక్షన్ సినిమాలంటే టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఉంటాయి. 'పఠాన్' కూడా అందుకు భిన్నం కాదు. యాక్షన్ సన్నిశాల కోసం పెట్టిన ఖర్చంతా తెరపై కనిపిస్తుంది. తొలి సన్నివేశం నుంచి భారీతనాన్ని చూడొచ్చు. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగా చేశారు. సంచిత్ బల్హారా-అంకిత్ బల్హారా జోడీ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా స్టైలిష్ గా.. సినిమా నడతకు తగ్గట్లుగా సాగిపోయింది. హీరో ఎలివేషన్ సీన్లలో.. అలాగే విలన్ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్లో ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. సచిత్ పాలోజ్ ఛాయాగ్రహణం రిచ్ గా సాగింది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ సిద్దార్థ్.. తన నుంచి యాక్షన్ ప్రియులు ఏం ఆశిస్తారో అదే ఇచ్చాడు. 'వార్' తరహాలోనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ విందు అందించాడు. షారుఖ్ స్టైల్.. బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా తన పాత్రను డిజైన్ చేసి.. హీరో నుంచి ఏం కావాలో అది రాబట్టుకున్నాడు. సిద్దార్థ్ రేసీ స్క్రీన్ ప్లే.. స్టైలిష్ నరేషన్ యూత్-యాక్షన్ ప్రియులను బాగా ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా అతడికి మంచి మార్కులు పడతాయి.

చివరగా: పఠాన్.. యాక్షన్ ధమాకా

రేటింగ్-3/5
× RELATED కళ్యాణం కమనీయం
×