కళ్యాణం కమనీయం

'కళ్యాణం కమనీయం' మూవీ రివ్యూ
నటీనటులు: సంతోష్ శోభన్-ప్రియా భవానీ శంకర్-దేవీ ప్రసాద్-పవిత్ర లోకేష్-సత్యం రాజేష్-సప్తగిరి తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
మాటలు: మరుదూరి రాజా
నిర్మాణం: యువి కాన్సెప్ట్స్
రచన-దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ళ

ఈ సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య బరిలో నిలిచిన చిన్న సినిమా 'కళ్యాణం కమనీయం'. సంతోష్ శోభన్-ప్రియా భవానీ శంకర్ జంటగా యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

శివ (సంతోష్ శోభన్).. శ్రుతి (ప్రియా భవానీ శంకర్) ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. శివకు ఉద్యోగం లేకపోయినా.. తనకు ఉండడంతో అతడి బాధ్యత తీసుకుని తనను పెళ్లాడుతుంది శ్రుతి. ఐతే భార్య తన మీద చూపించే ప్రేమకు ఫిదా అయి ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ఆమెను సంతోషపెట్టాలనుకుంటాడు శివ. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడికి ఉద్యోగం రాదు. దీంతో అతడి కాపురంలో కలహాలు మొదలవుతాయి. తన ఉద్యోగం కోసం శ్రుతి లోన్ తీసుకుని ఇచ్చిన పది లక్షల రూపాయల్ని కూడా పోగొట్టేస్తాడు శివ. ఆ విషయం దాచి క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు అబద్ధం చెబుతాడు శివ. మరి ఈ విషయాన్ని ఎన్నాళ్లు దాచాడు.. చివరికి అతడికి ఉద్యోగం వచ్చిందా లేదా.. వీరి వైవాహిక జీవితం చివరికి ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

సంక్రాంతికి రెండు భారీ చిత్రాలు విడుదలయ్యాయి.. అవి కాక రెండు డబ్బింగ్ బొమ్మలు బరిలోకి దిగాయి. పోటీ తీవ్రంగా ఉంది. థియేటర్లు పెద్దగా అందుబాటులో లేవు. ఇలాంటి స్థితిలోనూ యువి క్రియేషన్స్ వాళ్లు ధైర్యంగా 'కళ్యాణం కమనీయం' అనే చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ల కాన్ఫిడెన్స్ ఏంటో అన్న చర్చ జరిగింది టాలీవుడ్లో. ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప ఇంత పోటీ మధ్య 'కళ్యాణం కమనీయం'ను బరిలోకి దించి ఉండరని అనుకున్నారు. కానీ ఆ ప్రత్యేకత ఏంటో చూద్దామని.. టైటిల్ కార్డ్స్ దగ్గర్నుంచి శుభం కార్డు పడేదాకా ఎదురు చూడడమే సరిపోతుంది. ఎక్కడా విశేషంగా అనిపించే ఒక్క పాయింట్.. ఒక్క సీన్ కనిపించదు. కేవలం గంటా 46 నిమిషాల నిడివే ఉన్నా సరే.. భారంగా అనిపిస్తుందంటే 'కళ్యాణం కమనీయం' పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

'కళ్యాణం కమనీయం'లో ఉన్నది చాలా చిన్న పాయింట్. ఉద్యోగం లేకుండా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి.. భార్య సంపాదన మీద ఆధారపడి బతకడం.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అపార్థాలు-విభేదాలు తలెత్తడం.. చివరికి భార్యను భర్త మెప్పించి కథ సుఖాంతం కావడం. ఈ పాయింట్ మీద ఈ రోజుల్లో ఒక ఫీచర్ ఫిలిం తీయాలనుకోవడం సాహసమే. సినిమాలో విషయం.. నిడివిని బట్టి చూస్తే.. ఈ పాయింట్ మీద ఒక షార్ట్ ఫిలిమో.. '30 వెడ్స్ 21' తరహాలో ఒక వెబ్ సిరీసో తీసి వదిలేస్తే సరిపోయేదేమో. మంచి కాస్ట్ అండ్ క్రూను పెట్టుకుని సినిమానే తీసేసిన కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ.. బిగ్ స్క్రీన్ కు సరిపోయే వినోదాన్ని కానీ.. మలుపులను కానీ.. డ్రామాను కానీ చూపించలేకపోయాడు. మంచి పెర్ఫామర్ అయిన సంతోష్ శోభన్.. చూడ్డానికి చక్కగా అనిపించే ప్రియా భవానీ శంకర్.. శ్రవణ్ భరద్వాజ్ లాంటి టాలెంటెడ్ మ్యుజీషియన్.. కార్తీక్ ఘట్టమనేని లాంటి అభిరుచి ఉన్న సినిమాటోగ్రాఫర్.. అందరినీ మించి యువి లాంటి పెద్ద సంస్థ.. వీళ్లంతా కలిసినా సరే.. 'కళ్యాణం కమనీయం'ను గట్టెక్కించలేకపోయారు.

'కళ్యాణం కమనీయం' ట్రైలర్ చూస్తేనే... ఇది ఎలా నడవబోతుందో ఒక అంచనా వచ్చేస్తుంది. ఐతే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వర్కవుట్ అయితే.. కథ పరంగా మరీ మలుపులు లేకపోయినా వర్కవుట్ అయ్యేదేమో. ఐతే సినిమాలో ప్లెజెంట్ గా అనిపించే సన్నివేశాలు పెద్దగా లేదు. విజువల్స్ కలర్ ఫుల్ గా అనిపించినా.. చాలా సాధారణంగా సాగిపోయే కథనం.. సన్నివేశాలు.. సినిమా గ్రాఫ్ ను ఏ దశలోనూ పైకి లేపలేకపోయాయి. హీరో వైపు నుంచి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు పెరుగుతూ పోవడం.. హీరోయిన్ అతణ్ని సూటి పోటి మాటలు అనడం.. ఆమె అబద్ధం చెప్పి కవర్ చేస్తూ హీరో తనలో తాను మథనపడడం.. చివరికి నిజం చెప్పాలనుకునే సరికి ఆ విషయం ఆమెకు తెలిసిపోయి అపార్థాలు ఇంకా పెరిగిపోవడం.. చివరికి కథ సుఖాంతం కావడం.. ఇలా డ్రామా అంతా కూడా ఒక ఫార్ములా ప్రకారం నడిచిపోతుందే తప్ప కొత్త సీన్లు అంటూ ఏమీ కనిపించవు. తక్కువ నిడివిలో కూడా సినిమా సాగతీతగా అనిపించిందంటే.. అది కథన లోపం తప్ప మరొకటి కాదు. యువి బేనర్ ప్రమాణాలకు 'కళ్యాణం కమనీయం' ఏమాత్రం తగని సినిమా అనడంలో సందేహం లేదు.


నటీనటులు:

సంతోష్ శోభన్ మంచి నటుడని ప్రతి సినిమాతో అర్థమవుతూనే ఉంది. కానీ కథల ఎంపికలో మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూ ఇబ్బంది పడుతున్నాడు. ఓటీటీ సినిమా 'ఏక్ మినీ కథ'తో మెప్పించిన అతను.. ఆ తర్వాత మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాలతో నిరాశ పరిచాడు. 'కళ్యాణం కమనీయం' వాటిని మించి కింది స్థాయిలో నిలిచే సినిమా. ఇందులోనూ సంతోష్ సహజంగా నటిస్తూ.. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రియా భవానీ శంకర్ అందం.. టాలెంట్ కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. చూడ్డానికి ఆమె చాలా చక్కగా అనిపిస్తుంది. హీరో పక్కన చేసిన కమెడియన్ బాగానే చేశాడు. సత్యం రాజేష్ నెగెటివ్ రోల్ లో పర్వాలేదనిపించాడు. సప్తగిరి చిన్న సన్నివేశంలో మెరిశాడు. మిగతా నటీనటులంతా ఓకే.


సాంకేతిక వర్గం:

శ్రవణ్ భరద్వాజ్ పాటలు సోసోగా అనిపిస్తాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా లేవు కానీ.. సినిమాలో బాగానే నడిచిపోయాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. సీనియర్ రైటర్ మరుదూరి రాజా మాటలు గుర్తుంచుకోదగ్గ స్థాయిలో లేవు. కథకుడు.. దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ పూర్తిగా నిరాశ పరిచాడు. కొత్త దర్శకుడంటే కొత్త కథాకథనాలతో ఆశ్చర్యపరుస్తాడనుకుంటే.. చాలా మామూలుగా లాగించేశాడు. ఇలాంటి స్క్రిప్టుతో అతను యువి వాళ్లను మెప్పించడమే ఆశ్చర్యం.


చివరగా: కళ్యాణం కమనీయం.. నిరాశ పరిచింది

రేటింగ్-2/5
× RELATED వారసుడు
×