వారసుడు

'వారసుడు' మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్-రష్మిక-ప్రకాష్ రాజ్-శరత్ కుమార్-జయసుధ-శ్రీకాంత్-కిక్ శ్యామ్-సంగీత-యోగిబాబు-ప్రభు తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
కథ-స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి-హరి-అహిషోర్ సాల్మన్
మాటలు: శ్రీనివాస్ చక్రవర్తి
నిర్మాతలు: రాజు-శిరీష్
దర్శకత్వం: వంశీ పైడిపల్లి

సంక్రాంతి సినిమాల్లో చిరు-బాలయ్యల వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డిలతో సమానంగా వార్తల్లో నిలిచిన అనువాద చిత్రం 'వారసుడు'. పండుగ రేసులో ముందుగా 11నే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడి చివరగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

విజయ్ (విజయ్) ఒక పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన కుర్రాడు. ఆ కుటుంబంలో చివరి సంతానమైన విజయ్.. తండ్రి చేతిలో కీలుబొమ్మలా ఉంటూ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు కావడం కంటే సొంత కాళ్లపై నిలబడాలనుకుంటాడు. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. సొంతంగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టే ప్రయత్నంలో ఉన్న అతను.. తల్లి కోరిక మేరకు తండ్రి షష్టి పూర్తి వేడుకల కోసం చాలా ఏళ్ల తర్వాత ఇంటికి వస్తాడు. క్యాన్సర్ బారిన పడ్డ అతడి తండ్రి ఆ విషయం ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టి తన మొదటి ఇద్దరు కొడుకుల్లో ఎవరిని వారసుడిని చేయాలనే ఆలోచనలో ఉంటాడు. కానీ వాళ్లిద్దరూ తండ్రికి తెలియకుండా చేసిన తప్పులు బయటపడతాయి. అదే సమయంలో వ్యాపారంలో ఆ కుటుంబానికి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించి తండ్రికి తనే వారసుడినని విజయ్ ఎలా రుజువు చేసుకున్నాడు అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. తెలుగు అగ్ర నిర్మాత దిల్ రాజు కలిసి.. తమిళంలో ప్రస్తుతం నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్ ని మెప్పించి ఓ సినిమా చేస్తున్నారంటే అంత విశేషం ఏముందో ఆ కథలో అనుకున్నారు మొదట్లో చాలామంది. కానీ విజయ్ సూటేసుకుని చాలా క్లాస్ గా కనిపించిన ఫస్ట్ లుక్.. 'వారసుడు' అనే టైటిల్ చూడగానే ఏముంది ఇందులో కొత్తదనం అనిపించింది. వంశీ చివరి సినిమా 'మహర్షి'లో మహేష్ ను ఇదే లుక్ లో చూశాం. 'వారసుడు' అనే టైటిల్ కూడా మనకు కొత్త కాదు. కానీ ఫస్ట్ లుక్.. టైటిల్ చూసి ఒక అంచనాకు వచ్చేయకూడదని ట్రైలర్ వరకు ఎదురు చూశాం. కానీ అది చూశాక ఒకట్రెండు కాదు.. 'గౌతమ్ ఎస్ఎస్‌సీ' మొదలుకుని.. 'అల వైకుంఠపురములో' వరకు అరడజను తెలుగు సినిమాలకు పైగా కళ్ల ముందు మెదిలాయి. కానీ ట్రైలర్ చూసి అప్పుడే ఒక అంచనాకు వచ్చేయకూడదన్న నిర్మాత దిల్ రాజు మాటను నమ్మి థియేటర్లకు అడుగు పెట్టి దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమా అంతా చూసేసరికి రెండంకెల సంఖ్యలో సినిమాలు గుర్తుకు వస్తే ఆశ్చర్యం ఏమీ లేదు. మన రైటర్లు.. డైరెక్టర్లు అరగతీసేసిన ఫార్ములాను పట్టుకుని.. కమర్షియల్ హంగులు అద్ది వంశీ వడ్డించిన కిచిడీ వంటకమే 'వారసుడు'.

హీరో తండ్రి తన మాట వింటూ, ప్రయోజకులుగా మారిన ఇద్దరు కొడుకులను చూసి ప్రౌడ్ ఫీలవుతూ.. తన అభీష్టానికి భిన్నంగా ఉన్న కొడుకును వెళ్లగొడితే.. ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే బయటికి వెళ్లిన ఆ కొడుకే సమస్యలన్నీ తీర్చి తన తండ్రి గర్వించేలా చేయడం.. స్థూలంగా 'వారసుడు' కథ. 17 ఏళ్ల ముందు తెలుగులో వచ్చిన 'గౌతమ్ ఎస్ఎస్సీ' అచ్చంగా ఇదే లైన్లో సాగే సినిమా. అందులో హీరో తండ్రికి తెలియకుండా సమస్యల్ని పరిష్కరిస్తే.. ఇందులో తండ్రి కోరిక మేరకు కుటుంబాన్ని ఆదుకుంటాడు. అంతే తేడా. కథ వరకు 'గౌతమ్ ఎస్ఎస్సీ'ని గుర్తు చేసే 'వారసుడు'.. కథనం.. సన్నివేశాల విషయంలో మరెన్నో సినిమాలను గుర్తుకు తెస్తుంది. ఇందులో ఫైట్లు చూస్తుంటే.. మన తెలుగు స్టార్ల ఫేసులు తీసేసి అందులో విజయ్ ముఖం పెట్టినట్లు అనిపిస్తుందే తప్ప రవ్వంత కొత్తదనం కనిపించదు. సినిమాలో చూపించే లొకేషన్లు సైతం అనేక తెలుగు సినిమాలను గుర్తుకు తెస్తాయి. 'అల వైకుంఠపురములో' అంత్యాక్షరి ఎపిసోడ్ స్ఫూర్తితో దాదాపు అలాగే కనిపించే లొకేషన్లో విజయ్ పాత సినిమాల రెఫరెన్సులు పెట్టి ఒక కామెడీ ఎపిసోడ్ ను నడిపించేశాడు వంశీ.

ఐతే మన తెలుగు సినిమాలతో పోలికల్ని పక్కన పెట్టి.. రొటీన్ అనే కంప్లైంట్ పట్టించుకోకుండా.. ఒక సగటు కమర్షియల్ సినిమా ఫార్మాట్లో సాగిపోయే ఎలివేషన్ సీన్లను ఎంజాయ్ చేయడం మొదలుపెడితే 'వారసుడు'తో కొంతమేర కనెక్ట్  కావచ్చు. తమిళంలో మాదిరి మనకు విజయ్ పెద్ద స్టార్ కాదు కాబట్టి ఇందులో ఎలివేషన్లు కొంచెం అతిగా అనిపించొచ్చు కానీ.. వాటిని వంశీ నీట్ గానే తీశాడు. ఫ్యామిలీ డ్రామా కొంచెం ఆసక్తికరంగానే సాగింది. యోగిబాబుతో విజయ్ కామెడీ ఓ మోస్తరుగా వర్కవుట్ అయింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మసాలా పాటలు.. ఫైట్లతో అలా అలా నడిపిపోతుంటుంది 'వారసుడు'. హీరో ఏ దశలోనూ కింద పడకుండా.. అతడికి ఎదురే లేనట్లు సాగిపోతుంటాడు. అతను ఏమనుకుంటే అది జరిగిపోతుంటుంది. ప్రకాష్ రాజ్ విలనీ ఏమాత్రం కిక్కు ఇవ్వదు. ఒకదాని తర్వాత ఒకటి హీరో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లిపోతాడు. హీరో అన్న కూతురి కిడ్నాప్ వ్యవహారంతో కొంచెం సెంటిమెంటును పండించే ప్రయత్నం చేశారు. క్లైమాక్సులో ఫైట్ మరీ భారీగా ప్లాన్ చేయకుండా కొంచెం సింపుల్ గా ముగించి మంచి పని చేశాడు వంశీ. విజయ్ హీరోయిజాన్ని ఎంజాయ్ చేయగలిగిన వాళ్లు.. కొంతమేర ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో కనెక్ట్ కావచ్చు కానీ.. అంతకుమించి 'వారసుడు'లో చెప్పుకోవడానికి ఏమీ లేదు.


నటీనటులు:

విజయ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు 'వారసుడు'లో. తమిళంలో అతడి అభిమానులను దృష్టిలో ఉంచుకుని ప్రతి సన్నివేశంలో అతణ్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. విజయ్ కూడా హీరోయిజం ఎలివేట్ అవ్వడానికి తన వంతుగా ఏం చేయాలో అంతా చేశాడు. యాక్షన్ సన్నివేశాలు.. డ్యాన్సుల్లోనూ తన బెస్ట్ ఇచ్చాడు. విజయ్ లుక్ బాగుంది. అతను కొన్ని సన్నివేశాల్లో చేసిన అతి తమిళ ఫ్యాన్సుకి నచ్చుతుందేమో కానీ.. మనవాళ్లు భరించడం కష్టమే. రష్మిక మందన్నాకు 'వారసుడు' ఏమాత్రం ఉపయోగపడకపోవచ్చు. పెద్ద హీరోల సినిమాల్లో మామూలుగా హీరోయిన్ పాత్ర ఎంత నామమాత్రంగా ఉంటుందో ఆమె క్యారెక్టర్ అలాగే ఉంది. ఇందులో రష్మిక మేకప్.. లుక్ కూడా ఏమంత ఆకర్షణీయంగా లేవు. ప్రకాష్ రాజ్ ను చూడగానే ఒక మొనాటనస్ ఫీలింగ్ కలిగేలా ఆ పాత్రను డిజైన్ చేశారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో జయసుధ.. శరత్ కుమార్ సరిగ్గా కుదిరారు. ఇద్దరి నటన బాగుంది. శ్రీకాంత్.. కిక్ శ్యామ్.. ప్రభు.. సంగీత.. వీళ్లంతా బాగా చేశారు.


సాంకేతిక వర్గం:

తమన్ ఒక పెద్ద హీరో నటించిన సగటు కమర్షియల్ సినిమాకు ఎలాంటి సంగీతం కావాలో అలాంటి ఔట్ పుట్ ఇచ్చాడు. రంజితమే పాట డబ్బింగ్ బాగాలేదు కానీ.. మంచి ఊపులోనే సాగుతుంది. మిగతా పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతంతో ఎలివేషన్ సీన్లను తమన్ బాగానే పైకి లేపాడు. కార్తీక్ పళని ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా సాగింది. దిల్ రాజు తెలుగులో తీసే పెద్ద సినిమాలను మించి 'వారసుడు'కు ఖర్చుపెట్టినట్లున్నాడు. తెర మీద అంతా భారీగా.. రిచ్ గా కనిపిస్తుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్తగా చేసిందేమీ లేదు. తాను తీసిన.. వేరే తెలుగు డైరెక్టర్లు తీసిన హిట్ సినిమాలను రెఫరెన్సుగా పెట్టుకుని ఒక కిచిడీ సినిమా వండేశాడు. తమిళంలో విజయ్ అభిమానులనైతే అతను మెప్పించాడు కానీ.. మనవాళ్లకు అతడి పనితనం ఏమీ కనిపించదు.

చివరగా: వారసుడు.. ఒక్క టికెట్టుపై బోలెడు సినిమాలు


రేటింగ్-2/5
× RELATED కళ్యాణం కమనీయం
×