మూవీ రివ్యూ : గుర్తుందా శీతాకాలం

'గుర్తుందా శీతాకాలం' మూవీ రివ్యూ
నటీనటులు: సత్యదేవ్-తమన్నా భాటియా-మేఘా ఆకాష్-కావ్య శెట్టి-ప్రియదర్శి తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సత్య హెగ్డే
మాటలు: లక్ష్మీ భూపాల
నిర్మాతలు: భావన రవి-నాగశేఖర్-రామారావు చింతపల్లి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నాగశేఖర్

నటుడిగా చాలా మంచి పేరు సంపాదించినా.. క్యారెక్టర్-విలన్ పాత్రలతో ఆకట్టుకున్నా.. సోలో హీరోగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు సత్యదేవ్. రకరకాల జానర్లలో సినిమాలు చేసిన అతను.. ఈసారి ఒక ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే.. గుర్తుందా శీతాకాలం. మరి ఈ లవ్ స్టోరీతో సత్యదేవ్ ఎంతమేర మెప్పించాడో చూద్దాం పదండి.

కథ:

సత్యదేవ్ (సత్యదేవ్) ఒక మామూలు మధ్య తరగతి కుర్రాడు. స్కూల్లో ఉండగానే ఒక అమ్మాయిని ప్రేమించి తిరస్కారానికి గురైన అతను.. ఆ తర్వాత కాలేజీలో అమృత (కావ్య శెట్టి) అనే మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ సత్యను ఓవైపు ఇష్టపడుతూనే.. ఆస్తి విషయంలో తనకు ఏమాత్రం తగని అతడి పట్ల కొంచెం అవమానకరంగా మాట్లాడుతుంది కావ్య. అయినా కావ్యను సత్య వదులుకోవాలని అనుకోడు. కానీ అమృత అతణ్ని వదిలి వెళ్లిపోతుంది. ఈ బాధ నుంచి తేరుకునే లోపు తన ఆఫీస్ కలీగ్ అయిన నిధి (తమన్నా)తో సత్యకు పరిచయం అవుతుంది. ఇద్దరి అభిరుచులు కలిసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు. ఆ సమయంలో అమృత తిరిగి సత్య జీవితంలోకి రావాలని చూస్తుంది. ఈ స్థితిలో సత్య ఏ నిర్ణయం తీసుకున్నాడు.. తర్వాత అతడి లవ్ లైఫ్ ఎలా ముందుకు సాగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒక భాషలో సూపర్ హిట్టయిన ప్రతి చిత్రం మరో భాషలో వర్కవుట్ అయిపోతుందని అనుకుంటే పొరబాటే. అందులోనూ ఎంత మంచి సినిమాను పట్టుకొచ్చి పునర్నిర్మించినా ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ కనిపించని ఈ రోజుల్లో రీమేక్ లకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఇలాంటి టైంలో మనతో పోలిస్తే చాలా వెనుక ఉండే కన్నడ ఇండస్ట్రీ నుంచి మామూలు కథలను తీసుకొచ్చి రీమేక్ చేసేస్తున్నారు. ఈ మధ్య కేజీఎఫ్.. కాంతార లాంటి సినిమాలతో శాండిల్ వుడ్ వెలిగిపోతుండొచ్చు కానీ.. అక్కడి కథలు చాలా వరకు రొటీన్ గా ఉంటాయన్నది వాస్తవం. తెలుగు సినిమాల స్ఫూర్తితో తెరకెక్కే కన్నడ చిత్రాలను తీసుకొచ్చి మళ్లీ మన దగ్గర రీమేక్ చేయడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. కన్నడలో ఇరగాడేశాయని ముంగారు మలై (వాన)..  కిరిక్ పార్టీ (కిరాక్ పార్టీ).. దియా (డియర్ మేఘా) లాంటి చిత్రాలను రీమేక్ చేస్తే అవి ఎలా బోల్తా కొట్టాయో తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో 'లవ్ మాక్ టైల్' లాంటి ఒక మామూలు కథను నాగశేఖర్ అనే కన్నడ దర్శకుడితో సత్యదేవ్ హీరోగా 'గుర్తుందా శీతాకాలం' పేరుతో రీమేక్ చేయించారు. టైటిల్ చూసి ఇదేదో పొయెటిక్ లవ్ స్టోరీ అని.. 'ఫీల్'తో ముంచెత్తేస్తుందని.. అనుకుంటే ఏ మలుపులూ లేకుండా చాలా సాధారణంగా సాగిపోయి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
 
ప్రేమకథలు చాలా వరకు రొటీన్ గానే అనిపిస్తాయి. అయినా అవి ఎవర్ గ్రీన్ అని ఎందుకు అంటారంటే.. కథ కొత్తగా లేకపోయినా ఒక 'ఫీల్'తో నడిపిస్తే.. యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. కానీ ఆ ఫీల్ అంత తేలిగ్గా రాదు. లీడ్ క్యారెక్టర్లు యూత్ తమను ఊహించుకునేలా ఉండాలి. తెరపై మూమెంట్స్ మ్యాజికల్ గా అనిపించాలి. మనం చూసే జంట మధ్య కెమిస్ట్రీ పండాలి. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కొంచెం బలంగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కుదిరితే ఆ ప్రేమకథ పాసైపోతుంది. కానీ 'గుర్తుందా శీతాకాలం' చూస్తూ ఈ పాయింట్లకు టిక్ కొట్టడం కష్టమే. ఒక వ్యక్తి స్కూల్ డేస్ తో మొదలుపెట్టి.. పెళ్లి చేసుకునే వరకు వివిధ దశల్లో లవ్ లైఫ్ చూపించిన సినిమాలు తెలుగులో కొత్త కాదు. రీమేక్ సినిమాలైన 'ఆటోగ్రాఫ్'.. 'ప్రేమమ్'లతో పాటు ఈ మధ్యే వచ్చిన 'థాంక్యూ' కూడా ఇదే కోణంలో నడిచింది. వీటిలో ఏ సినిమా ఎలా ఆడిందన్నది పక్కన పెడితే.. ఆల్రెడీ చూసిన ఈ కథలనే మళ్లీ 'గుర్తుందా శీతాకాలం'లో రివిజన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది తప్పగా కొత్తదనం ఏమీ కనిపించదు. లైన్ పాతదైనా.. హీరో ప్రేమకథలైనా ఆసక్తికరంగా.. మ్యాజికల్ గా అనిపించాయా అంటే అదీ లేదు.

హీరో వివిధ దశల్లో తన ప్రేమకథల గురించి చెబుతూ ఉంటే.. అవి వింటూ ఓ అమ్మాయి (మేఘా ఆకాష్) తెగ ఎగ్జైట్ అయిపోతూ.. తర్వాతేమైంది అంటూ కుతూహలం చూపిస్తుంటుంది. కానీ అంత ఎగ్జైట్ అయ్యేంత స్టఫ్ ఏ ప్రేమకథలోనూ లేదు. స్కూల్లో లవ్ స్టోరీతోనే ప్రేక్షకులు నీరుగారిపోతారు. పోనీ కాలేజ్ లవ్ స్టోరీ అయినా హుషారుగా.. రొమాంటిగ్గా సాగి ఉత్సాహం తెప్పిస్తుందా అనుకుంటే.. అది ఇంకా పేలవం. నిజ జీవితంలో ఒక అమ్మాయి అబ్బాయి సింపుల్ కారణాలతో ప్రేమలో పడిపోవచ్చు కానీ.. తెర మీద కాస్త బలమైన కారణాలుండాలని కోరుకుంటాం. అది మిస్సయినా.. వారి మధ్య ప్రేమను అయినా కొంచెం గాఢంగా చూపించాలని కోెరుకుంటాం. అదీ లేకపోయినా.. ఇద్దరి మధ్య ఏవైనా మ్యాజికల్ మూమెంట్స్ అయినా ఆశిస్తాం. కానీ హీరో కాలేజ్ లవ్ స్టోరీలో అవేవీ లేవు. ఇక ఆఫీస్ లవ్ స్టోరీకి వచ్చాక అంతకుముందు చూసిన ప్రేమకథే నయం అనిపిస్తుంది. కావ్యశెట్టితో సత్యదేవ్ కెమిస్ట్రీనే అంతంతమాత్రం అంటే.. తమన్నాతో అయితే అతడికి అస్సలు జోడీ కుదరలేదు. తమన్నా లుక్స్.. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇందులో చాలా తేడాగా అనిపించాయి. ఈ ప్రేమకథలో 'సోల్' మిస్సయి సమయం భారంగా గడుస్తుంది. చివర్లో ట్రాజిక్ ఎండింగ్ ఇచ్చి హృదయాలు బరువెక్కించాలని దర్శకుడు చూశాడు కానీ.. ఆ ప్రయత్నమూ వృథానే. ప్రేక్షకులు జీర్ణించుకోలేని విధంగా తమన్నాను చూపించి ఇబ్బంది పెట్టడం మినహా చేసిందేమీ లేదు. ఒక్క సత్యదేవ్ పెర్ఫామెన్ప్ మినహాయిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు.

నటీనటులు:

సత్యదేవ్ ఇప్పటిదాకా రకరకాల జానర్లలో సినిమాలు చేశాడు. అతడి లుక్స్.. స్క్రీన్ ప్రెజెన్స్ కి ప్రేమకథలు సెట్ కావేమో అనిపిస్తుంది. 'గుర్తుందా శీతాకాలం'లో తన శక్తి మేర పాాత్రను పండించడానికి ప్రయత్నం చేసినా.. తన పెర్ఫామెన్స్ బాగున్నా.. కథాకథనాల్లో విషయం లేకపోవడం వల్ల తన శ్రమ వృథా అయింది. ఎంత బాగా చేసినా కూడా సినిమా అయ్యేసరికి సత్యదేవ్ కు ఇలాంటి సున్నితమైన ప్రేమకథలు సెట్ కావనే అనిపిస్తుంది. అందులోనూ 'గాడ్ ఫాదర్'లో ఇంటెన్స్ విలన్ పాత్రలో అదరగొట్టాక సత్యదేవ్ ను ఇలాంటి క్యారెక్టర్లో చూడడం అంత బాగా అనిపించదు. తమన్నా అతడి పక్కన సూట్ కాలేదు. ఆమెకు కథలో చాలా ముఖ్యమైన పాత్రే దక్కినా.. తన లుక్స్ ఆ పాత్రకు సూట్ కాలేదు. మేకప్ చాలా చోట్ల తేడా కొట్టి తన ఆకర్షణను తగ్గించింది. తమన్నా ఫ్యాన్స్ ఈ సినిమా చూసి కచ్చితంగా నిరాశ చెందుతారు. కావ్య శెట్టి కొన్ని సార్లు చూడడానికి బాగా అనిపించింది. కొన్నిసార్లు ఇబ్బంది పెట్టింది. మేఘా ఆకాష్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. హీరో ఫ్రెండుగా తనకు అలవాటైన పాత్రలో ప్రియదర్శి బాగా చేశాడు. అతడి గర్ల్ ఫ్రెండుగా నటించిన అమ్మాయి కూడా ఓకే. ఇంకెవరికీ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు లేవు.

సాంకేతిక వర్గం:

కాలభైరవ తొలిసారి ఒక ప్రేమకథకు సంగీతం అందించాడు. కానీ అతడి నుంచి ఆశించే స్థాయిలో పాటలు లేవు. ఏదో సోసోగా సాగిపోయాయి తప్ప మళ్లీ మళ్లీ వినాలనిపించేలా పాటలు లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సత్య హెగ్డే కెమెరా పనితనం ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. కన్నడ దర్శకుడు నాగశేఖర్ కు తెలుగు ప్రేక్షకుల అభిరుచి తెలియదని అనుకోవాలి. ఇలాంటి సాధారణ ప్రేమకథతో మన ప్రేక్షకులను ఎలా మెప్పించగలనని అనుకున్నాడో? దీన్ని మించిన టాప్ క్లాస్ లవ్ స్టోరీలను దశాబ్దాల కిందటే చూసేశాం మనం. నాగశేఖర్ నరేషన్ డెడ్ స్లో. సన్నివేశాల్లో పెద్దగా విషయం లేకుండా అంత సాగతీతను భరించడం కష్టం. దర్శకుడి పనితనానికి ఫిదా అయిపోయే మూమెంట్స్ ఏమీ లేవు సినిమాలో.

చివరగా: గుర్తుందా శీతాకాలం.. నో ఫీల్.. నో మ్యాజిక్

రేటింగ్-2/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED నిజంగా లేడీ పవర్ స్టార్... ఇది సాయి పల్లవి రేంజ్
×