మూవీ రివ్యూ : పంచతంత్రం

నటీనటులు: బ్రహ్మానందం-స్వాతిరెడ్డి-సముద్రఖని-రాహుల్ విజయ్-శివాత్మిక రాజశేఖర్-నరేష్ అగస్త్య-దివ్య శ్రీపాద-వికాస్-ఆదర్శ్ బాలకృష్ణ-ఉత్తేజ్ తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్-ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: రాజ్ కె.నల్లి
నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్-సృజన్ యరబోలు
రచన-దర్శకత్వం: హర్ష పులిపాక'


ఈ మధ్య తెలుగులో ఆంథాలజీ కథల జోరు పెరుగుతోంది. ఈ కోవలో వచ్చిన కొత్త చిత్రం.. పంచతంత్రం. ఆసక్తికర ప్రోమోలతో మొదట్నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చిన ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:


రిటైర్డ్ ఉద్యోగి అయిన వేదవ్యాస్ మూర్తి (బ్రహ్మానందం) 60 ఏళ్ల వయసులో రచయితగా తనేంటో రుజువు చేసుకోవాలని అనుకుంటాడు. అందుకోసం ఆయన ఒక స్టోరీ టెల్లింగ్ కాంపిటేషన్ కు వెళ్తాడు. అక్కడ అతను పంచేద్రియాలను సూచించేలా ఐదు కథలు చెప్పడం మొదలుపెడతాడు. తన ఉద్యోగంలో విసుగెత్తిపోయిన ఉన్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. సరైన జీవిత భాగస్వామి కోసం చూస్తున్న మరో కుర్రాడు.. ఒక మానసిక సమస్యతో ఇబ్బంది పెడుతున్న ఒక నడి వయస్కుడు.. తమకు పుట్టబోయే బిడ్డ కోసం చూస్తున్న భార్యాభర్తలు.. వీళ్లందరితో పాటు ఒక స్టోరీ టెల్లర్ కథను చెబుతాడు మూర్తి. ఆ కథల్లో సారాంశమేంటి.. వీటిలో మూర్తి ఎలా మెప్పించి ఆ పోటీలో గెలిచాడు అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:


ఓటీటీల హవా పెరిగాక కొన్ని కథల సమాహారంగా తెరకెక్కే ఆంథాలజీ సినిమాల ఒరవడి పెరిగింది. ఓటీటీల్లో అయితే తీరిగ్గా ఒక్కో కథను నరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత డెప్త్ గా అయినా కథను చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ ఫీల్ ఎలా ఉన్నా సరే.. ఒక్కో కథ కొంచెం ఎంగేజ్ చేస్తే చాలు ప్రేక్షకులు ఎంగేజ్ అయిపోతారు. వారికి టైంపాస్ అయిపోతుంది. ఐతే ఈ తరహా చిత్రాలు థియేటర్లలో మెప్పించిన దాఖలాలు చాలా తక్కువ. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల మూడ్ వేరుగా ఉంటుంది. కథల్లో వేగం.. డ్రామా.. ఆహ్లాదం కోరుకుంటారు. ఇవన్నీ సమపాళ్లలో మేళవించిన ఆంథాలజీ సినిమాలు తెలుగులో దాదాపుగా రాలేదనే చెప్పాలి. 'పంచతంత్రం' కొంత వరకు ఈ ప్రయత్నంలో విజయవంతం అయింది. కానీ ఇందులో చెప్పిన ఐదు కథల్లో అన్నీ అయితే మెప్పించలేదు. రెండింట్లో భావోద్వేగాలు బాగా పండాయి. అవి చాలా హృద్యంగా అనిపిస్తాయి. ఒక కథ ఆహ్లాదం పంచుతుంది. కానీ మిగతా రెండు మాత్రం అంత ఆకట్టుకోలేకపోయాయి. పంచేంద్రియాలను సూచించేలా రుచి.. వాసన.. దృశ్యం.. ధ్వని.. స్పర్శ కాన్సెప్టులతో ఒక్కో కథను నరేట్ చేయడం బాగుంది. కానీ చెప్పాలనుకున్న ఓవరాల్ గా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు.. ఈ సినిమా మోటివ్ ఏంటి అంటే మాత్రం చెప్పడం కష్టం. ఆ స్పష్టత లేకపోవడం.. కొన్ని కథల్లో సమగ్రత కొరవడడం.. స్లో నరేషన్ 'పంచతంత్రం'కు ప్రతిబంధకాలయ్యాయి. కానీ ఇదొక మంచి ప్రయత్నం అనడంలో మాత్రం సందేహం లేదు.

ఐదు కథల సమాహారంగా తెరకెక్కిన 'పంచతంత్రం'కు ఆరంభంలోనే పెద్ద బ్రేక్ పడిపోయింది. నరేష్ అగస్త్య పోషించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చుట్టూ సాగిన 'దృశ్యం' కథలో ఏమాత్రం ఆసక్తి లేదు. అసలీ కథతో ఏం చెప్పదలుచుకున్నారన్నదే అర్థం కాదు. ఇక 'వాసన' చుట్టూ తిరిగే సముద్రఖని రెండో కథతోనూ కనెక్ట్ కావడం కొంచెం కష్టమే. ఒక మానసిక సమస్యతో బాధ పడుతూ తనకు మాత్రమే పరిమితం అయిన ఒక 'వాసన' గురించి వేదన చెందే నడి వయస్కుడిగా సముద్రఖని నటన బాగున్నా.. ముగింపు దశలో మినహాయిస్తే ఈ కథ విసుగెత్తిస్తుంది. ప్రథమార్ధం అయ్యేసరికి మధ్యలో ఆపాడు దర్శకుడు. ఆంథాలజీ సినిమా అంటే.. ప్రథమార్ధం అయ్యేసరికి దర్శకుడు తాను చెప్పదలచుకున్న కథలన్నింటికీ ఒక ఇంట్రో ఇచ్చి.. ఒక మలుపు దగ్గర ఇంటర్వెల్ ఇస్తాడని.. ద్వితీయార్ధంలో ఒక్కో కథను విడివిడిగా ముగించడం.. లేదా అన్నింటినీ కనెక్ట్ చేసి క్లైమాక్సుని నడిపించడం చేస్తాడనుకుంటాం. కానీ 'పంచతంత్రం' దర్శకుడు మాత్రం అలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా తనకు నచ్చిన రీతిలో తాపీగా ఒక్కో కథను చెప్పుకుంటూ వెళ్లాడు. దీని వల్ల ప్రేక్షకులకు ఒకింత నీరసం తప్పదు.

ప్రథమార్ధంలో.. రెండో కథగా వచ్చే యువ జంట స్టోరీ 'పంచతంత్రం' మిగతా అన్ని కథలతో పోలిస్తే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.పెళ్లి పట్ల ఒక స్పష్టత ఉండి.. తనేంటో తనకు తెలిసిన అమ్మాయినే చేసుకోవాలని కోరుకునే అబ్బాయి కథ ఇది. వరుసగా పెళ్లి చూపులు చూసి విసిగిపోయిన ఆ కుర్రాడికి సరైన అమ్మాయి దొరకడం.. తనతో అతడి కాన్వర్జేషన్లు.. పెళ్లి గురించి యువతీయువకుల మనోభావాలను ప్రతిబింబించేలా సాగే సన్నివేశాలతో ఈ కథ ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఇక 'పంచతంత్రం'లోని  చివరి రెండు కథలను దర్శకుడు హృదయాలను హత్తుకునేలా చెప్పాడు. ఇందులో ఒక కథ ఒక బిడ్డ ప్రసవంతో ముడిపడ్డది కావడం.. ఇంకో కథ చిరు ప్రాయంలోనే పెద్ద ప్రమాదానికి గురైన చిన్నారి పాపది కావడంతో ఎక్కువమంది ఈజీగా కనెక్టవుతారు. ఊరికే సెంటిమెంటుతో పిండేయకుండా.. హృద్యంగా ఆ కథలను చూపించాడు దర్శకుడు. ఎమోషన్లు బాగా పండడంతో ఈ రెండు కథలు మంచి ఫీలింగ్ ఇస్తాయి. దీంతో ఇంటర్వెల్ సమయానికి  ఉన్న ఫీలింగ్ చివరికొచ్చేసరికి మారుతుంది. సినిమాతో కొంత ఇంప్రెస్ అవుతాం. కానీ అన్ని కథలూ ఆకట్టుకునేలా ఉండి.. నరేషన్లో కొంచెం వేగం పెంచి.. ఈ కథల తాలూకు ఉద్దేశాన్ని బలంగా చెప్పగలిగి ఉంటే 'పంచతంత్రం' ప్రత్యేకమైన చిత్రంగా నిలిచేది. ఓటీటీల్లో బాగా ఫిట్ అయ్యే ఇలాంటి సినిమాలను థియేటర్లలో చూడాలంటే కొంచెం ఓపిక ఉండాలి. క్లాస్ గా సాగే 'స్లైస్ ఆఫ్ లైఫ్' సినిమాలను ఇష్టపడేవారికి 'పంచతంత్రం' ఓకే అనిపించొచ్చు.


నటీనటులు:


బ్రహ్మానందం కామెడీకి కేరాఫ్ అడ్రస్. కానీ 'పంచతంత్రం'లో పూర్తి సీరియస్ పాత్రను చేశారు. స్టోరీ నరేటర్ గా ఆయన చాలా హుందాగా నటించి మెప్పించారు. తక్కువ స్క్రీన్ టైం అయినా ఆయన పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. తొలి కథలో కనిపించే నరేష్ అగస్త్య చూడ్డానికి బాగున్నాడు. కానీ నటన పరంగా తనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. రెండో కథలో రాహుల్ విజయ్-శివాత్మిక ఇద్దరూ కూడా బాగా నటించారు. మూడో కథలో ముఖ్య పాత్ర పోషించిన సముద్రఖని కూడా తన అనుభవాన్ని చూపించారు. తర్వాతి స్టోరీలో వికాస్-దివ్య శ్రీపాద భావోద్వేగాలను చక్కగా పండించారు. చివరి స్టోరీలో స్వాతి తన ప్రత్యేకతను చాటుకుంది. ఉత్తేజ్ చాలా సహజంగా నటించాడు. ఆదర్శ్ బాలకృష్ణ కూడా ఓకే.


సాంకేతిక వర్గం:


టెక్నికల్ గా 'పంచతంత్రం' మంచి ప్రమాణాలతో తెరకెక్కింది. శ్రవణ్ భరద్వాజ్.. ప్రశాంత్ విహారి కలిసి అందించిన బిట్ సాంగ్స్.. బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ తో సాగాయి. రాజ్ కె.నల్లి కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా ఉన్నాయి. ఇలాంటి సినిమాకు సపోర్ట్ చేసిన నిర్మాతల అభిరుచిని మెచ్చుకోవాలి. రైటర్ కమ్ డైరెక్టర్ హర్ష పులిపాక కూడా తన అభిరుచిని.. దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. సున్నితమైన భావోద్వేగాలను పండించడంలో అతడి ప్రతిభ తెలుస్తుంది. హర్ష డైలాగ్స్ కూడా బాగున్నాయి. కానీ అతడి నరేషన్ మరీ స్లో. ఈ కథలను ఇంకొంచెం స్పష్టతతో.. స్ట్రైకింగ్ గా.. స్పీడుగా చెబితే బాగుండేది.

చివరగా: పంచతంత్రం.. సోల్ ఉన్న స్లో స్టోరీస్

రేటింగ్-2.5/5
× RELATED కోలీవుడ్ కళ్ళన్ని ఈ సినిమాపైనే.. ఏమవుతుందో?
×