వైసీపీకి సీబీఎన్ అంటే భయంలేదు... పవన్ అంటే ఎందుకంత భయం

వైసీపీ పొలిటికల్ వ్యూ చిత్రంగా కనిపిస్తుంది. ఆ పార్టీ తానే పెద్ద పార్టీ. బలమైన పార్టీ అని భావిస్తుంది. ఇక 151 సీట్లు ప్రజలు కూడా ఇచ్చి పెద్దగా చేశారు. మరో వైపు చూస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ నూటికి తొంబై శాతం ఫలితాలను సాధించి తానే నంబర్ వన్ అనిపించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ ఇంతటి సానుకూలత ఉన్న పార్టీ మరోటి లేదు.

పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఒకే పార్టీని చెందిన వారు ఉండడం రేర్ గా జరిగిన రాజకీయ విషయం. అది వైసీపీ సాధించింది. ఇక ముప్పయ్యేళ్ళ పాటు తానే సీఎం అని జగన్ ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు. దాని అర్ధం  చూస్తే వైసీపీ ఫౌండేషన్ అంత గట్టిగా  గ్రౌండ్ లెవెల్ లో ఉందనే కదా అర్ధం. ఇక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని  వైసీపీ నిత్యం సెటైర్లు వేసే చంద్రబాబుకు చివరి ఎన్నికలు అంటున్నారు. ఆయన కానీ తెలుగుదేశం పార్టీ గానీ తమకు ఏ మాత్రం పోటీ కానే కాదని కూడా చెబుతున్నారు.

మరి క్షేత్రస్థాయిలోబూత్ లెవెల్ దాకా పార్టీ క్యాడర్ దండీగా ఉన్న టీడీపీ కానీ నాలుగున్నర దశబ్దాల చరిత్ర కలిగిన చంద్రబాబు కానీ తమకు పోటీ సాటీ కానపుడు పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది అని ఆ పార్టీ వారే అంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయం చూస్తే ఆయన పార్టీకి 2019 ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆయన కూడా ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు.  పవన్ చూస్తే రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు.

ఆ పార్టీకి కేవలం సినీ ఫ్యాన్స్ తప్ప బలమైన క్యాడర్ కానీ సంస్థాగతంగా బలం కానీ లేదని వైసీపీ నేతలే అంటారు. అటువంటిది పవన్ అంటే ఎందుకు భయపడుతున్నారు అన్నదే ఇపుడు చాలా మంది మాటగా ఉంది. నిజానికి ఏపీ రాజకీయాలను విశ్లేషించుకున్నా వైసీపీ వారి ఆలోచనలను చూసినా కూడా చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా పవన్ మీదనే వైసీపీ ఫోకస్ పెడుతోంది అని అంతా అనుమానిస్తున్నారు.

అదే నిజం అని కూడా అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా చూస్తే అందరూ పవన్ని పని గట్టుకుని మరీ విమర్శిస్తున్నారు అని అంటున్నారు.  మరి రాజకీయాలలో ఒకరిని పట్టించుకోవడం లేదు అంటే లైట్ తీసుకుంటున్నట్లు అనుకోవాలి. అదే వారి మీద పదే పదే విరుచుకుపడుతున్నారు అంటే కచ్చితంగా వారి వల్ల ముప్పు పొంచి ఉన్నట్లుగా అర్ధం చేసుకోవాలి. అలా కనుక లాజిక్ గా ఆలోచిస్తే పవన్ విషయంలో వైసీపీ ఎందుకో భయపడుతోంది అనే అంటున్నారు. లేకపోతే ఆయన గురించి కలలో కూడా మాట్లాడకూడదు.

ఆయన విషయం ఏదీ పట్టించుకోకూడదు.  పవన్ ఈ మధ్య తన బస్సుని చూపిస్తూ వీడియో పెట్టారు. దాని మీద కూడా వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఆయన వాహనం పేరు తప్పు అని అది సంప్రదాయవాదులకు ఇబ్బందిని కలిగిస్తుందని అంటున్నారు. అలీవ్ గ్రీన్ కలర్ వాహనానికి వేయరాదు అని అంటున్నారు. మరి ఈ విధంగా అంటున్నారు అంతే రేపటి రోజున పవన్ బస్సు యాత్ర వల్ల ఏమైనా ప్రభావం పడుతుంది అని ఆలోచిస్తున్నారా. ఏపీ అంతా పవన్ కళ్యాణ్ తిరిగితే వైసీపీకి నిండా వ్యతిరేకత వస్తుందని ఆందోళన పడుతున్నారా అన్నదే చర్చకు వస్తోంది.

ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్. పవన్ మీద ఏ రకమైన రాజకీయ మచ్చ లేదు. ఆయన నిజాయతీగా ఉన్నారు. అవినీతి మరకలు అంతకంటే లేవు. ఆయన వెనక బలమైన సామాజికవర్గం ఉంది. వారికి తమ వారు సీఎం కావాలన్న చిరకాల ఆకాంక్ష ఉంది. మరో వైపు పవన్ కి నిండా సినీ గ్లామర్ ఉంది. అదే విధంగా ఎవరికీ లేనంతమంది యూత్ ఫాలోయింగ్ ఉంది. అలాగే మహిళాదరణ ఉంది. ఇవన్నీ ఒక రాజకీయ పార్టీకు పటిష్టమైన ఓటు బ్యాంక్ గా మారుతాయి.

ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సీరియస్ పాలిటిక్స్ చేయలేదు అని అంటారు. ఆయన కనుక బస్సు యాత్ర పేరిట జనాలలో ఉంటే నేరుగా కనెక్ట్ అయితే మాత్రం ఏపీలో జనసేన బలమైన శక్తిగా అవతరిస్తుంది అన్నది కచ్చితమైన రాజకీయ విశ్లేషణ. బహుశా ఇలాంతి ఆలోచనలు వైసీపీలో ఉండడం వల్లనే ముందే జనసేన నీడను చూసి జడుసుకుంటోంది అని ఆ వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా జనం మంచి తీర్పరులు. వారికి మంచి చేస్తే ఎంతటి వారు పోటీగా వచ్చినా ఉపయోగం ఉండదు.

అలా కాకుండా తప్పులు చేస్తూ పోతే ఆ జనాలే ఎవరో ఒకరిని ఆల్టర్నేషన్ గా చూసుకుంటారు. అందువల్ల తప్పు అయినా పొరపాటు అయినా తమలోనే ఉంది అని ఏ పార్టీ అయితే ఆత్మ విమర్శ చేసుకుని ముందుకు సాగుతుందో ఆ పార్టీదే విజయం. అంతే తప్ప ఎదుటి వారు పోటీకే రాకూడాదని తమకు ప్రత్యర్ధులుగా ఎవరూ ఉండకూడదని విమర్శలు చేస్తూ పోతే అది రాజకీయంగా బూమరాంగ్ అవుతుంది. చివరికి అవతల వారే పెద్ద వారిగా మారి ఇబ్బంది పెట్టడమూ జరుగుతుంది. మరి ఈ లాజిక్ ని వైసీపీ మిస్ అవుతోందా. ఏమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×