ఎమ్మెల్సీ.. మర్డర్ విషయంలో పోలీసులకు హైకోర్టు సంచలన ఆదేశాలు!

తూర్పుగోదావరి జిల్లాలో తన దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబుపై సీఆర్పీసీ సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆల్టర్ (వెలుగులోకి వచ్చిన వివరాలతో కొత్త సెక్షన్లు చేర్చి సవరించడం) చేయకుండా.. ఐపీసీ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ను ‘రీ రిజిస్టర్’ ఎలా చేస్తారని పోలీసులను ఏపీ హైకోర్టు నిలదీసింది. ఇందుకు ఏ ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది. ఆ వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 12కు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్రావు గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

అనంతబాబుపై కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మృతుడు  సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రావణ్కుమార్ వాదనలు వినిపించారు. ఈ హత్య వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు భార్య మరికొందరి సమక్షంలో జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. సీసీటీవీ ఫుటేజ్లో వారు కనిపిస్తున్నారని చెప్పారు. వారిపై కేసు నమోదు చేయకుండా ల్యాబ్ నివేదిక కోసం చూస్తున్నామంటూ పోలీసులు కాలక్షేపం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఎమ్మెల్సీ అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్కుమార్ వాదించారు. మృతుడి శరీరంపై 32 తీవ్ర గాయాలున్నాయన్నారు. దీన్నిబట్టి చూస్తే సుబ్రహ్మణ్యం హత్య ఘటనలో మరికొందరు పాల్గొన్నారని అర్థమవుతోందని చెప్పారు. ఎమ్మెల్సీ అనంత్ బాబుపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా మొదట అనుమానాస్పద మృతి కిందే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కుటుంబ సభ్యులు ప్రజా సంఘాలు నిరసనలు ఉద్యమాలు చేశాక ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చారని జడ శ్రావణ్ కుమార్ గుర్తు చేశారు.

వైసీపీ ఎమ్మల్సీ అనంత్ బాబుకు సహకరించే ఉద్దేశంతోనే రిమాండ్ విధించిన 14 రోజుల్లో కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేయకుండా ఆ గడువు దాటాక దాఖలు చేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా ఎమ్మెల్సీపై రౌడీషీట్ నమోదై ఉన్నప్పటికీ ఎలాంటి నేర చరిత్ర లేదని దిగువ కోర్టుకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు రక్తపు మరకలను ఇతర ఆధారాలను సీజ్ చేయలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇలా నిందితుడు ఎమ్మెల్సీ అనంత్ బాబు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారన్నారు. అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని విన్నవించారు.

హోంశాఖ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. శవపంచనామా ఆధారంగా ఎఫ్ఐఆర్ రీ రిజిస్టర్ చేశామన్నారు. దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతోందని తెలిపారు. ప్రత్యేక పరిస్థితులు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు భావించినప్పుడే సీబీఐకి అప్పగించాలన్నారు. దర్యాప్తును ఎవరైనా ప్రభావితం చేస్తున్నారనేందుకు ఆధారాలు సైతం లేవన్నారు. సీసీటీవీ ఫుటేజ్ను ల్యాబ్కు పంపించామని.. నివేదిక రావాల్సి ఉందని వెల్లడించారు. వీడియోలో ఉన్నవాళ్లు ఎవరనేది తేలితే వారిని నిందితులుగా చేరుస్తామని వివరించారు.

కాగా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని కోరగా అందుకు కోర్టు తిరస్కరించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఆ మహిళ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
×