5.20 గ్రామ సేవకులు...మాకేంటి!

మొత్తానికి ఎన్నికలు పడుతున్న వేళ జ్ఞానోదయం అయిందా లేక వాలంటీర్లను ఎన్నికల కోసం వాడేస్తే ఈసీ ఒప్పుకోదు అని అర్ధమైందో తెలియదు కానీ ఎట్టకేలకు వాలంటీర్లను పక్కన పెట్టి పార్టీ ముద్దు అని వైసీపీ హై కమాండ్ అంటోంది. అందులో భాగమే ప్రతీ యాభై ఇళ్ళకు ఇద్దరు గ్రామ సారధుల కాన్సెప్ట్.

వైసీపీ బుర్రలో పుట్టిన ఈ ఆలోచన మంచిదే కానీ ఆలస్యంగా ఇపుడు వచ్చింది అన్నదే అందరి మాట. పార్టీని గత మూడున్నరేళ్లుగా గాలికి వదిలేశారు అన్న అపవాదు ఉంది. అంతే కాదు పార్టీ కోసం పని చేసిన వారిని అసలు సిసలు కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇపుడు తీరా అంతా అయ్యాక ఎన్నికల వేళ పార్టీకి సారధులు కావాల్సి వచ్చింది అని అంటున్నారు.

అంతే కాదు పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. మాకు వాలంటీర్లు ఉన్నారు అని ధీమాకు పోయారు. బూత్ స్థాయి వరకూ చూస్తే పార్టీ దారుణంగా పడకేసింది. అలా దాని ఎఫెక్ట్ ఇపుడు పడింది. ఈ విషయాన్ని పార్టీలోని కీలక నేతలు ఎన్నో సార్లు మొత్తుకున్నా అధినాయకత్వం మాత్రం పట్టించుకోలేదు. ఏ మాత్రం ఖాతరు చేయలేదు.

తీరా ఇపుడు అంతా అయ్యాక మాకు పార్టీ కార్యకర్తలు కావాలని హై కమాండ్ ఇపుడు కోరుకోవడమే వింతలో కెల్లా వింత అని అంటున్నారు. అయితే దీని వెనక కూడా ఒక సీరియస్ మ్యాటర్ ఉంది అని అంటున్నారు. పీకే టీం ఇచ్చిన రిపోర్టుల ప్రకారం చూస్తే వాలంటీర్లతో ఓట్లు అసల్జు రావు అని తేలిపోయిందట. పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవాలని కూడా పీకే టీం సూచించిందిట.

అంతే కాదు పోల్ మేనేజ్మెంట్ చేయాలీ అంటే అది వాలంటీర్ల వల్ల కాదు వారిని అసలు ఎక్కడా వాడే సీన్ ఉండదని అందువల్ల క్యాడర్ ని దగ్గర పెట్టుకుంటే ఈ తరహా కార్యక్రమాలు చేయగలమని పీకే టీం కాస్తా గట్టిగానే చెప్పిందట. ఆ విధంగా హై కమాండ్ కళ్ళు తెరచి ఇపుడు పార్టీ వైపు చూస్తోంది అని అంటున్నారు.

ఇక ఇపుడు చూస్తే కార్యకర్త తప్ప ఎవరూ పార్టీకి అమ్మ లాంటి వారు కారు అని అర్ధమైపోయింది. కార్యకర్తకు ఉన్న ప్రేమ ఎవరికీ ఉండదు అని వెల్లడైంది. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది కూడా కార్యకర్త అన్న సత్యమూ వెల్లడైంది. అయితే జగన్ నోట ఈ మాట వచ్చాక గ్రామాలలో చూస్తే వైసీపీ క్యాడర్ నుంచి భిన్నమైన రియాక్షన్ వస్తోందిట.

పార్టీకి మేము ఎంతో చేశాం అయినా మమ్మల్ని గత మూడున్నరేళ్ళుగా పూర్తిగా పక్కన పెట్టేశారు. వాలంటీర్లతోనే కధ నడిపించారు. ఇపుడు అంతా అయ్యాక ఎన్నికల వేళకు మాత్రం మా అవసరం ఉందని గ్రామ సారధులు అంటున్నారు. ఇపుడు మేము కావాల్సి వచ్చామా అని వారే ప్రశ్నిస్తున్నారు.

మమ్మల్ని ఇప్పటిదాకా ఎవరైనా పట్టించుకున్నారా అని వారు గట్టిగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి 13 ఏళ్ళుగా అంటే 2009 నుంచి పార్టీ కోసం అన్ని రకాలుగా తాము కష్టాలు పడ్డామని అయినా తమ సేవలను విలువను ఎవరూ గుర్తించలేదని వారు వాపోతున్నారు. జగన్ సీఎం కావాలని ఒకే ఒక లక్ష్యంతో తాము పనిచేస్తే కనీసం ఎమ్మెల్యేల అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కార్యకర్తలు అంటున్నారు.

అన్ని పధకాలు కాంట్రాక్టులు బిల్లుల క్లియరెన్స్ అన్నీ కూడా టీడీపీ వారికే ఇస్తూ వారికే అన్ని పనులూ చేస్తూ తమను కరివేపాకుల వాడేసుకున్నారు అని వైసీపీ క్యాడర్ గుర్రుమంటోంది. ఈ పరిస్థితులలో ఇప్పటికైనా తాము గుర్తుకురావడం వెనక ఎన్నికల అజెండావే ఉందని అంటున్నారు.

సరే తమను ప్రతీ ఇంటికీ వెళ్ళమంటున్నారు బాగానే ఉంది. కానీ ఎలా వెళ్లాలి. వారు చెప్పే సమస్యలు విని ఎలా జవాబు చెప్పాలి అని అడుగుతున్నారు. రోడ్లు బాగులేవు గుంతలు పడి ఉన్నాయని అంటే జవాబు ఉందా అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. అలాగే వైసీపీ వాళ్ళకు ఇచ్చే పెన్షన్లు టీడీపీ వాళ్ళు తీసేశారు తిరిగి వాటిని పునరుద్ధరించమని చెప్పినా మూడేళ్ళుగా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని వారు అంటున్నారు.

కాంట్రాక్టుల బిల్లులు రావు ఆఖరుకు ప్రొక్లైనర్ పని చేసిన వాళ్ళకూ బిల్లులు రావు ఇదేమి; పాలన అని జనాలు అంటున్న వేళ తాము ఎందుకు గ్రామ సారధులు కావాలి అని వారు నిలదీసే పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బాగుపడిన వారిని పధకాలు తీసుకున్న వారికే గ్రామ సారధులుగా ఎంచుకోండి అని తెగేసి చెబుతున్నారు.

మొత్తం మీద చూస్తే అయిదు లక్షల మందికి పైగా పార్టీ సారధులు అని పై స్థాయిలో అధినాయకత్వం గొప్పగా చెప్పుకోవచ్చు. జబ్బలు చరచుకోవచ్చు. కానీ గ్రామ స్థాయిలో క్యాడర్ మొత్తం రివర్స్ అవుతున్న వేళ అంతమంది కాదు కదా అందులో సగమైనా దొరుకుతారా అన్నదే ఇపుడు అతి పెద్ద ప్రశ్నట. దీనికి కారణం వైసీపీ పెద్దలు చేజేతులా చేసుకున్నదే అని అంటున్నారు.

ఏమీ ఆశించకుండా పనిచేసి దశాబ్దం పైగా కష్టించిన వారిని అధికారంలోకి వచ్చాక దగ్గరకు తీసుకోకపోయిన ఫలితమే ఇపుడు ఇలా రివర్స్ కొడుతోంది అని అంటున్నారు. ఇపుడు హై కమాండ్ వైఖరి మారినా క్యాడర్ మాత్రం గుర్రుమీద ఉన్నారు. వారిని ఎలా దారికి తెచ్చుకుంటారో ఏమో ఎవరికీ అర్ధం కాదనే అంటున్నారుట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఈసారి తోపులాటలో కింద పడిపోయారు.. షర్మిలకు ఇంకెన్ని కష్టాలో?
×