ఇదంతా 'వారసుడు' చూట్టూ హైప్ క్రియేట్ చేయడానికేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం "వారసుడు" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో #Thalapathy67 మూవీ చేయనున్నట్లు ఇప్పటికే ధృవీకరించబడింది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రాకముందే నాన్-థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయినట్లుగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

విజయ్ - లోకేశ్ కాంబినేషన్ లో రాబోతున్న Thalapathy67 అన్ని భారతీయ భాషల డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. శాటిలైట్ రైట్స్ సన్ టీవీ.. ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ తీసుకున్నట్టు పేర్కొంటున్నారు. హిందీ శాటిలైట్ సెట్ మ్యాక్స్ సోనీ వారు కొన్నారని అంటున్నారు.

అయితే ఇదంతా బాగానే వుంది కానీ.. తళపతి67 హక్కుల గురించి తమిళ మీడియా చెప్తున్న ఫ్యాన్సీ రేట్లే నమ్మశక్యంగా లేవనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. విజయ్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ 160 కోట్లు చెల్లించిందని.. శాటిలైట్ రైట్స్ కోసం సన్ టీవీతో 80 కోట్లకు డీల్ క్లోజ్ అయిందని చెబుతున్నారు.

ఈ ఫిగర్స్ నమ్మేలా లేవని.. దీనికి ఎటువంటి ప్రామాణికత లేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దక్షిణాది చిత్రాలను కొనుగోలు చేసేటప్పుడు నెట్ ఫ్లిక్స్ ఎప్పుడూ దూకుడుగా ఉండదని.. ఒక ప్రాంతీయ హీరో సినిమాకి 160 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారనేది నమ్మడం కష్టంగా ఉందని అంటున్నారు.

అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధించిన తమిళ చిత్రాలు సైతం డిజిటల్ స్ట్రీమింగ్ లో ఎప్పుడూ సంచలనాలు సృష్టించలేదు. ఇటీవలి కొన్ని భారీ చిత్రాలను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. తెలుగు సినిమాల స్థాయిలో తమిళ్ చిత్రాలకు ఓటీటీలలో ఆదరణ దక్కలేదు.

అలాంటిది ఇప్పుడు అనౌన్స్ మెంట్ రాకముందే నెట్ ఫ్లిక్స్ అంత మొత్తాన్ని ఖర్చు చేయడానికి ఎటువంటి కారణం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కేవలం Thalapathy67 సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ ను పెంచే ప్రయత్నం మాత్రమేనని.. "వారసుడు" చూట్టూ హైప్ క్రియేట్ చేయడానికి కేవలం మీడియా స్టంట్ మాత్రమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమిళ మీడియా గతంలోనూ అనేక సినిమాల విషయంలో ఇలానే చేసిందని అంటున్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ - రష్మిక మందన్నా జంటగా "వారసుడు" సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతి సందర్భంగా ఈ డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

పొంగల్ బరిలో వాల్తేరు వీరయ్య & వీర సింహా రెడ్డి వంటి స్ట్రెయిట్ సినిమాలు నిలుస్తున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో ఒక డబ్బింగ్ చిత్రానికి మెజారిటీ థియేటర్లు కేటాయించడం సరికాదనే అంశం మీద ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఇవన్నీ దాటుకొని 'వారసుడు' సినిమా తెలుగులో ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
×