రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. జై బాలయ్య..!

నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వీరసింహా రెడ్డి''. 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఇప్పటికే 'వీరసింహా రెడ్డి' ఫస్ట్ లుక్ - టైటిల్ టీజర్ మరియు ఇతర ప్రత్యేక పోస్టర్లు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ సింగిల్ 'జై బాలయ్య' మాస్ ఆంథమ్ ని రిలీజ్ చేయడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్.

'రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నిల్చొని మొక్కుతారు.. అచ్చ తెలుగు పౌరషాల రూపం నువ్వయ్యా.. అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా..' అంటూ సాగిన 'జై బాలయ్య' సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.

హీరో పాత్రని ఎలివేట్ చేస్తూ సాగిన ఈ పాటలో నటసింహం రాజసం చూపించారు. మాస్ లీడర్ గా వైట్ అండ్ వైట్ లో బాలయ్య ఆకట్టుకున్నారు. జై బాలయ్య సాంగ్ కి ఎస్ థమన్ ట్యూన్ సమకూర్చారు. ఇది 'ఒసేయ్ రాములమ్మ' టైటిల్ ను గుర్తు చేస్తుండటం గమనార్హం.

'తిప్పు సామీ కోర మీసం.. తిప్పు సామీ ఊరి కోసం.. అగ్గి మంటే నీ ఆవేశం.. నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా.. ఆ మొలతాడు కట్టిన మొగోడింకా పుట్టలేదయ్యా..' అంటూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి నందమూరి ఫ్యాన్స్ ను ఆకట్టుకునే సాహిత్యం అందించారు. సింగర్ కరీముల్లా హుషారుగా ఈ గీతాన్ని ఆలపించారు.

లిరికల్ వీడియో మాదిరిగా కాకుండా ఒక కవర్ సాంగ్ లా 'జై బాలయ్య' మాస్ ఆంథంని అందించారు. తమన్ సైతం వైట్ అండ్ వైట్ ధరించి కాలు కదిపారు. ఈ పాటకు శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. జన సమూహాల మధ్య దేవాలయాల పరిశరాలలో ఈ పాటని చిత్రీకరించారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌ గా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్‌ విభాగం చూసుకున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - వై రవిశంకర్‌ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందు రావిపాటి దీనికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. ఇందులో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్‌ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది. లాల్ - నవీన్ చంద్ర - రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చంద్రిక రవి స్పెషల్ సాంగ్ చేసింది.

సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకురాబోతున్న 'వీరసింహా రెడ్డి' సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 
 

 
× RELATED నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
×