దేశానికి మోడీ.. 'విద్యుత్ పాఠాలు' ఏం చెప్పారు సర్!

దేశ ప్రజలకు ప్రధానమంత్రి అనేక విషయాల్లో సూచనలు చేస్తుంటారు. సలహాలు కూడా ఇస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు.. ఆదేశాలు కూడా జారీ చేస్తారు. అది వేరే! అయితే తాజాగా ఆయన విద్యుత్తు పాఠాలు నేర్పారు. ఈ విద్యుత్ పాఠాలు ప్రజల జీవితాను మారుస్తాయని కూడా.. ఆయన చెప్పడం గమనార్హం. అంతేకాదు..  దీనిని పాటించి చూడండి!  అంటూ.. ప్రజలకు ప్రధాని చిలిపి సవాల్ కూడా జారీ చేశారు.

మరి ప్రధాని సర్ చెప్పిన విద్యుత్ పాఠాలేంటో చూద్దామా.. తాజాగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ.. విద్యుత్ విషయంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. అంటే.. ఒక రకంగా.. లెక్చర్ అన్నలెక్క. అంటే ప్రజలకు పాఠమన్న లెక్కన్నమాట! ఇది ఎందుకు అసలు చర్చకు వచ్చిందంటే.. గుజరాత్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. అక్కడ ప్రజలు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది.

ఇది బీజేపీలో కలకలం రేపుతోంది. దీంతో మోడీ రంగంలోకి దిగిపోయి.. ''ఉచిత విద్యుత్‌ను తీసుకుని మీరు ఏం చేస్తారు? '' అని ప్రశ్నించారు. ఇదేం ప్రశ్న అంటూ.. సభకు వచ్చిన వారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇంతలో మోడీ సర్ రియాక్ట్ అవుతూ.. ''ఉచిత కరెంట్ ఇవ్వడానికి బదులు.. విద్యుత్‌తోనే ప్రజలు సంపాదించుకునేలా చేస్తా'' అనేశారు.

ఆప్ కేవలం ఓటర్లను ఆకర్షించడానికే ఇలాంటి తాయిలాలు ప్రకటిస్తోందని మండిపడ్డారు. దానికి వత్తాసు పలికినట్లుగా కాంగ్రెస్ కూడా అలాంటి హామీలు ఇస్తోందని.. ఆ పార్టీ 'విభజించు పాలించు' రాజకీయాలు చేస్తోందని మోడీ ధ్వజమెత్తారు. విద్యుత్ ఉచితంగా పొందడానికి బదులు.. కరెంట్ నుంచి ఆదాయం పొందే సమయమిది అని ప్రధాని అన్నారు. విద్యుత్ నుంచి ఎలా సంపాదించాలో తనకు తెలుసునని చెప్పారు.  

'మెహ్సానా జిల్లాలోని మొధేరా గ్రామం సోలార్ విద్యుత్‌తో నడుస్తోంది. వాళ్లకు కావాల్సినంత వాడుకుని.. మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. ఇంతకుముందు టీవీ ఫ్రిజ్ ఏసీ లాంటివి లేని మొధేరా గ్రామంలోని మహిళలు.. ఇప్పుడు వాటన్నింటినీ కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవస్థను గుజరాత్ సహా దేశం మొత్తం తీసుకురావాలనుకుంటున్నాను. ఇలా చేయడం మోడీకి మాత్రమే తెలుసు'' అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు..  తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని మోడీ అన్నారు.  కానీ తాను మాత్రం ఇళ్ల మిద్దెలపై సోలార్ రూఫ్లతో విద్యుత్ ఉత్పత్తి చేసి.. మిగులు విద్యుత్‌తో గుజరాతీలు డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి విద్యుత్ అడిగినందుకు రైతులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రైతులు వారి విద్యుత్‌ను సోలార్ ప్యానెళ్ల ద్వారా వారే ఉత్పత్తి చేసుకుని.. మిగులు విద్యుత్ అమ్మడం ద్వారా అదనపు ఆదాయం కుడా పొందుతున్నారని మోడీ అన్నారు. మొత్తానికి.. మోడీ విద్యుత్ పాఠాలు ఏమేరకు పనిచేస్తాయో చూడాలి. నెటిజన్లు మాత్రం యథా ప్రకారం.. కామెంట్లు కుమ్మరిస్తూనే ఉన్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED అవినీతి ఆరోపణల్లో 'ఖాకీ'.. బీహార్ ఐపీఎస్ కు చిక్కులు..!
×