విరాటపర్వం దర్శకుడి నెక్స్ట్ మూవీ ఆ స్టార్ హీరోతోనా..?

'నీదీ నాదీ ఒకే కథ' అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన వేణు ఊడుగుల.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని 'విరాటపర్వం' చిత్రంలో వచ్చారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ వైవిధ్యమైన ప్రేమకథ ఆశించిన విజయం సాధించినప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా వేణు మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు.

విరాటపర్వం సినిమా వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇంతవరకూ వేణు ఉడుగుల తదుపరి ప్రాజెక్ట్ పై ప్రకటనేదీ రాలేదు. అయితే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో దర్శకుడు ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం వుంటుందని అంటున్నారు.

ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార బ్యానర్ లో 'సార్' అనే బైలింగ్వల్ మూవీలో నటిస్తున్నాడు. దీని తర్వాత శేఖర్ కమ్ములతో విలక్షణ నటుడు ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఇప్పుడు సితార లోనే మరో చిత్రం చేసేలా ధనుష్ ని ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే ధనుష్ మరియు వేణు ఉడుగుల మధ్య కథా చర్చలు కూడా జరిగినట్టు చెబుతున్నారు. దర్శకుడు ఆ మధ్య తన పుట్టినరోజు సందర్భంగా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి స్పందించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా కమర్షియల్ అంశాలతో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని.. అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని వేణు చెప్పారు.

అయితే ఇప్పుడు ధనుష్ తో వేణు సినిమా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇది నిజమైనా ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవచ్చు. ప్రెజెంట్ తమిళ హీరో లైనప్ లో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులో అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన శేఖర్ కమ్ముల సినిమాని సెట్స్ మీదకి తీసుకురావాల్సి వుంది. దీని తర్వాతే వేణు చిత్రం వుండొచ్చు.

నిజానికి 'నీదీ నాదీ ఒకే కథ' సినిమాని తమిళ్ లో రీమేక్ చేయటానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. వేణు ని డైరెక్ట్ చేయమని పలువురు ప్రముఖ హీరోలు సంప్రదించినట్లుగా సమాచారం. అయితే ఎందుకనో ఇది ముందుకి వెళ్ళలేదు.  ఇప్పుడు ధనుష్ తో ప్రాజెక్ట్ సెట్ అయిందని అంటున్నారు. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
×