సెల్ ఫోన్ లేని కాలంతో తీస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్

ఎవరు ఎన్ని చెప్పినా.. సెల్ ఫోన్ మన జీవితాలతో విడదీయరానిది అయిపోయింది. అందులోనూ స్మార్ట్ ఫోన్ వచ్చాక యువత మహిళలు పురుషులు.. ఇలా అందరూ అందులోనే మునిగి తేలుతున్నారు. దీనికి సోషల్ మీడియా పైత్యం కూడా తోడవడంతో రోజంతా సెల్ ఫోన్ కు అతుక్కుపోతున్నవారు ఎందరో? భోజనం చేస్తున్నా.. బాత్ రూమ్ కు వెళ్లినా.. బైక్ తోలుతున్నా.. ఆఖరుకు నిద్రపోయే ముందు కూడా సెల్ ఫోన్ చూస్తేనే నేటి మనుషుల తనివి తీరుతోంది. అంతగా మన జీవితంలో సెల్ ఫోన్ ప్రభావం చూపుతోంది.

అనేక వ్యాధులు.. ఆందోళనలు.. సెల్ ఫోన్ ను అదే పనిగా చూస్తుండడం అనేక వ్యాధులకు కారణమవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో మయోపతి.. పెద్దల్లో మోడ నొప్పి.. ఇలా సెల్ ఫోన్ చీడ అంతాఇంతా కాదు. రాత్రిళ్లు పడుకునే ముందు సెల్ ఫోన్ నీలి కాంతిని చూడడం కళ్లకు దెబ్బ. కాగా శారీరకంగానే కాక మానసికంగానూ సెల్ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువ. వాట్సాప్ లో పెట్టిన స్టేటస్ ను మనకు కావాల్సిన వారు చూడకున్నా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కు స్పందన లేకున్నా.. యూట్యూబ్ వీడియోలకు ఆదరణ తగ్గినా.. మనసులో కుమిలిపోవడం పెద్ద ఆరోగ్య ఇబ్బందిగా మారింది. ఇక రోజంతా సెల్ ఫోన్ ను చూస్తూ చుట్టుపక్కల వారిని మర్చిపోవడం.. బయటి ప్రపంచాన్ని చూడకపోవడం.. శారీరక శ్రమ చేయకపోవడం రుగ్మతలకు కారణమవుతోంది.

మళ్లీ ఆ కాలంలోకి వెళ్తే.. అసలు విషయంలోకి వస్తే ఇప్పుడున్న 30-40 ఏళ్ల వయసున్న వారు సెల్ ఫోన్ లేని కాలంలో పుట్టారు. ఆరు బయటకు వెళ్లి స్వేచ్ఛగా ఆడుకోవడం బంధువుల ఇంట్లో గడపడం వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడం ఈ వయసు వారికి మధురానుభూతులు. వారి బాల్యంలో సెల్ ఫోన్ అనే మాటే లేకపోవడంతో హాయిగా సాగింది. కానీ ఇప్పటి బాల్యం అంతా సెల్ కు బంధీ అయిపోతోంది. పిల్లలు అన్నం తినకుంటే.. చేతికి సెల్ ఫోన్ ఇచ్చి బుజ్జగించి పెట్టడం అందరం చూస్తున్నాం. కానీ ఆ కాలంలో చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టేవారు. అందుకే 20-30 ఏళ్ల కిందట బాల్యాన్ని చూసినవారు ఎంతో ధన్యులు అని చెప్పక తప్పదు.

ఈ ఏడాది బ్లాక్ బ్లస్టర్లన్నీ సెల్ లేని కాలానివే.. 2022లో బ్లాక్ బ్లస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలు నాలుగు.. పుష్ప కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్ కాంతారా. ఇవన్నీ పీరియాడికల్ కథలే. పుష్ప కథలో మాత్రమే కొంత సెల్ ఫోన్ (పేజర్ రూపంలో) ఉనికి కనిపిస్తుంది. 1995 బ్యాక్ గ్రౌండ్ లో తీసిన సినిమా కాబట్టి ఆ మాత్రమైనా చూపాల్సి వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ 1920ల నాటి కథ. పూర్తిగా బ్రిటిషర్ల హయాం. అందులో ల్యాండ్ లైన్ కే అవకాశం తక్కువ. కేజీఎఫ్ 1970-80 దశకాల్లోనిది. అందులో ల్యాండ్ లైన్ కమ్యూనికేషన్ ను చూపారు. కాగా తాజాగా విడుదలైన "కాంతారా" నేపథ్యమూ 1990. సినిమాలో 1850 కాలాన్నీ చూపారు. దీంతో సెల్ ఫోన్ కు అవకాశమే లేదు. ఏదేమైనా.. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాయి. ఏంతైనా.. సెల్ ఫోన్ లేని కాలం అంటే.. స్కూళ్లు లేని కాలం కదా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
×