ఊర్వశివో రాక్షసివో

'ఊర్వశివో రాక్షసివో' మూవీ రివ్యూ
నటీనటులు: అల్లు శిరీష్-అను ఇమ్మాన్యుయెల్-వెన్నెల కిషోర్-అనీష్ కురువిల్లా-పోసాని కృష్ణమురళి-ఆమని-కేదార్ శంకర్ తదితరులు
సంగీతం: అచ్చు రాజమణి-అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: తన్వీర్ మీర్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని-విజయ్
రచన-దర్శకత్వం: రాకేశ్ శశి

చాలా పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కెరీర్లో ఇప్పటిదాకా 'శ్రీరస్తు శుభమస్తు' మినహా సరైన విజయం లేని అల్లు శిరీష్.. ఇప్పుడు 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా కనిపించిన ఈ రొమాంటిక్ కామెడీ ఈ రోజే ప్రేక్షకుల ముందుు వచ్చింది. ఈ చిత్రమైనా శిరీష్ నిరీక్షణకు తెరదించేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

శ్రీ (అల్లు శిరీష్) ఒక మామూలు మధ్య తరగతి కుర్రాడు. చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగం తెచ్చుకున్న అతను సింధు (అను ఇమ్మాన్యుయెల్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తన ఆఫీసులోనే కలీగ్ అవుతుంది. ఆమెతో పరిచయం జరిగిన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అనుకోకుండా ఒక రోజు ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. దీంతో ఇక సింధుతో పెళ్లికి సిద్ధం అయిపోతాడు శ్రీ. కానీ ఆమె మాత్రం తనకు పెళ్లి ఇష్టం లేదని.. తన గోల్ వేరని చెబుతుంది. శ్రీ ఒత్తిడి చేయడంతో ముందు సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అంటుంది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీ అందుకు ఓకే అన్నాడా.. తర్వాత వీరి ప్రయాణం ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒక పదేళ్ల కిందట 'ఈ రోజుల్లో' సినిమాతో యువ దర్శకుడు మారుతి టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ మొదలుపెట్టాడు. యూత్ లక్ష్యంగా డబుల్ మీనింగ్ టచ్ ఉన్న డైలాగులు.. సీన్లతో అప్పుడు అదో టైపు సినిమాలు టాలీవుడ్ ను ముంచెత్తాయి. ఐతే వీటిలో కొన్ని చిత్రాల వరకు బాగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత ఈ టైపు సినిమాలు జనాలకు మొహం మొత్తేశాయి. డబుల్ మీనింగ్ డోస్ బాగా ఎక్కువైపోయి కొన్ని సినిమాలు మరీ 'చీప్'గా అనిపించడంతో ఆ సినిమాల వరదకు అడ్డు కట్ట పడింది. ఇంటర్నెట్ విప్లవం కారణంగా పోర్న్ కంటెంట్ కూడా చాలా ఈజీగా దొరికేస్తోంది. ఇక జబర్దస్త్ లాంటి కామెడీ షోల వల్ల డబుల్ మీనింగ్ జోకులు.. కామెడీకి లోటే లేదు. కాబట్టి ఈ రోజుల్లో యూత్ ను బోల్డ్ కంటెంట్ తో ఆకట్టుకోవడం కష్టమైపోతోంది. ఇలాంటి టైంలో యూత్ ను టెంప్ట్ చేసే రొమాన్స్.. వాళ్లకు గిలిగింతలు పెట్టే కామెడీ డోస్ సరిపాళ్లలో కుదిరిన సినిమాగా 'ఊర్వశివో రాక్షసివో'ను చెప్పొచ్చు. ఒక మామూలు కథను ఎక్కడా బోర్ కొట్టని విధంగా ఎంటర్టైనింగ్ గా నరేట్ చేయడంతో ఇందులో టైంపాస్ వినోదానికి ఢోకా లేకపోయింది.

నిజానికి 'ఊర్వశివో రాక్షసివో' ఒరిజినల్ మూవీ ఏమీ కాదు. 'ప్యార్ ప్రేమ కాదల్' అనే హిట్ మూవీకి రీమేక్. తమిళంలో ఇదొక బూతు సినిమాగా ముద్ర వేయించుకుంది. 'బస్ స్టాప్' తరహా సినిమాగా చూశారు దీన్ని. ఐతే హీరోయిన్ మెడికల్ షాప్ దగ్గర హీరోను ఆపి.. ఏదో టాబ్లెట్ అడిగి, అలాగే నీక్కూడా ఏమైనా కావాలంటే తీసుకో, ఇంట్లో నాన్న కూడా లేడు అని హింట్ కూడా ఇస్తుంది. ట్రైలర్లో ఈ సీన్ పెట్టి సినిమాను ప్రమోట్ చేశారంటే తమిళ ప్రేక్షకులు దీన్ని ఏ కోణంలో చూసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఐతే తెలుగులో కొంచెం పేరున్న కాస్టింగ్ పెట్టుకుని.. గీతా ఆర్ట్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు కాబట్టి అక్కడితో పోలిస్తే ఈ సినిమా రేంజ్ పెరిగింది. అలా అని ఇందులో అడల్ట్ డోస్ ఏమీ తగ్గలేదు. సినిమా నిండా బోలెడన్ని ఇంటిమేట్ సీన్లున్నాయి. ఇక కామెడీలో అయితే డబుల్ మీనింగ్ డోస్ మామూలుగా లేదు. దీనికి తోడు లైట్ హార్టెడ్ హ్యూమర్ కూడా తోడవడంతో ఎక్కడా బోర్ అయితే కొట్టించదు 'ఊర్వశివో రాక్షసివో'. ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేసే సీన్లు ఇందులో బోలెడున్నాయి.

రెండుంబావు గంటల నిడివి ఉన్న 'ఊర్వశివో రాక్షసివో'లో ఒక రెండు గంటల పాటు కథనం పరుగులు పెడుతుంది. తొలి సన్నివేశం నుంచి కామెడీ డోస్ కు లోటు ఉండదు. మహా సిగ్గరి అయిన హీరో.. డేరింగ్ అండ్ డాషింగ్ అయిన హీరోయిన్.. భిన్నధ్రువాల్లా అనిపించే ఈ రెండు పాత్రల మధ్య పరిచయ సన్నివేశాల నుంచి.. ప్రతి సీన్ సరదాగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్.. సునీల్ కలిసి ఎక్కడా ఫన్ డోస్ తగ్గకుండా చూశారు. హీరో హీరోయిన్ల మధ్య కూడా వినోదం పండేలా సీన్లు పడ్డాయి. హీరోయినే హీరోను శృంగారానికి ప్రేరేపించే సన్నివేశాలు కుర్రాళ్లను కుదురుగా కూర్చోనివ్వవు. లిప్ లాక్స్ అయితే లెక్కపెట్టుకోనన్ని ఉన్నాయి సినిమాలో. కథలో వచ్చే సింపుల్ ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి.

'ఊర్వశివో రాక్షసివో'లో హై డోస్ కామెడీ ఎపిసోడ్ అంటే.. 'శ్రీ ప్రిమియర్ లీగ్' పేరుతో హీరో తన తల్లికి.. గర్ల్ ఫ్రెండుకి మధ్య నలిగిపోతూ మేనేజ్ చేయడానికి పడే పాట్లను రన్నింగ్ కామెంట్రీతో నడిపించిందే. డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువైనా సరే.. అర్థం చేసుకున్న వాళ్లకు ఈ ఎపిసోడ్ హిలేరియస్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత సీన్లలో కూడా కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఐతే చివరి 20 నిమిషాల్లో మాత్రం 'ఊర్వశివో రాక్షసివో' భారంగా అనిపిస్తుంది. అంత వరకు పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపించే సినిమాను.. మరీ సీరియస్ టోన్లో నడిపించడం.. విషాదభరిత గీతాలు పెట్టడం వల్ల అవి సింక్ కాలేదనిపిస్తుంది. కథను ముగించడానికి అలా చేయక తప్పలేదేమో కానీ.. ఆ 20 నిమిషాలు మాత్రం సమయం భారంగా గడుస్తుంది. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ను కూడా కొంచెం షార్ప్ చేసి ఉంటే 'ఊర్వశివో రాక్షసివో' కంప్లీట్ ఎంటర్టైనర్ అయ్యుండేది. అడల్ట్ డోస్ ఎక్కువ కావడం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమాకు దూరం చేయొచ్చు. యూత్ కు మాత్రం 'ఊర్వశివో రాక్షసివో' బాగానే ఎక్కేస్తుంది.

నటీనటులు:

అమాయకమైన మధ్యతరగతి కుర్రాడి పాత్రలో అల్లు శిరీష్ ఆకట్టుకున్నాడు. కెరీర్ ఆరంభంలో మాదిరి కాకుండా ఇప్పుడు పాత్రకు యాప్ట్ అనిపిస్తున్నాడంటే శిరీష్ మెరుగైనట్లే చెప్పాలి. శ్రీ పాత్రలో మంచి ఈజ్ చూపించాడతను. ఎక్కడా కృత్రిమత్వం లేకుండా క్యారెక్టర్లో సహజంగా కనిపించాడు. పాత్ర తాలూకు అమాయకత్వాన్ని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేశాడు. సీరియస్ సీన్లలోనూ శిరీష్ ఓకే అనిపించాడు. అను ఇమ్మాన్యుయెల్.. ఫారిన్ రిటర్న్డ్ మోడర్న్ అమ్మాయిగా పాత్రకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె నేపథ్యం అదే కావడంతో ఈ పాత్ర చేయడానికి పెద్దగా కష్టపడలేదు. కెరీర్లో ఇప్పటిదాకా ఏ  సినిమాలో లేని రేంజిలో అందాల విందు చేయడమే కాక.. ఇంటిమేట్ సీన్లలో ఈజ్ చూపించింది. శిరీష్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. హీరో స్నేహితుడి పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతను కనిపించిన ప్రతిసారీ నవ్వులు పండాయి. సునీల్ సైతం బాగానే వినోదాన్ని పంచాడు. హీరో తల్లి పాత్రలో ఆమని ఆకట్టుకుంది. పృథ్వీ.. కేదార్ శంకర్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

అచ్చు రాజమణి-అనూప్ రూబెన్స్ కలిసి అందించిన పాటలు ఓకే అనిపిస్తాయి. పాటలు మరీ వినసొంపుగా లేవు. అలా అని తీసిపడేసేలానూ లేవు. సినిమా గమనానికి పాటలు బాగానే ఉపయోగపడ్డాయి. నేపథ్య సంగీతం బాగానే సాగింది. తన్వీర్ మీర్ ఛాయాగ్రహణం నీట్ గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన మేర ఉన్నాయి. దర్శకుడు రాకేశ్ శశి రీమేక్ మూవీని బాగా డీల్ చేశాడు. తమిళంతో పోలిస్తే సినిమా తెలుగులో మరింత వినోదాత్మకంగా అనిపిస్తుంది. ఒరిజినల్ కొంచెం బి-గ్రేడ్ మూవీలా అనిపిస్తుంది. అక్కడితో పోలిస్తే ఇక్కడ కొంచెం క్లాస్ టచ్ కనిపిస్తుంది. యూత్ ను టార్గెట్ చేసిన సీన్లు.. డైలాగుల విషయంలో రాకేశ్ ప్రతిభ చాటుకున్నాడు. ఇంకొంచెం అడల్ట్ డోస్ తగ్గించి ఉంటే.. ముగింపును షార్ప్ చేసి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. అయినప్పటికీ దర్శకుడి పనితనానికి మంచి మార్కులే పడతాయి.

చివరగా: ఊర్వశివో రాక్షసివో.. రొమాన్స్ పీక్స్.. కామెడీ ప్లస్

రేటింగ్ - 3/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater
× RELATED కళ్యాణం కమనీయం
×