ప్రిన్స్

'ప్రిన్స్' మూవీ రివ్యూ
నటీనటులు: శివ కార్తికేయన్-మరియా-సత్యరాజ్-ప్రేమ్ జీ అమరన్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
కథ: అనుదీప్-మోహన్ సాటో
మాటలు: భీమ్ శ్రీనివాస్
నిర్మాతలు: సునీల్ నారంగ్-సురేష్ బాబు-పుస్కుర్ రామ్మోహన్ రావు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అనుదీప్ కేవీ

'జాతిరత్నాలు' సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు అనుదీప్ కేవీ. దీని తర్వాత అతను అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ తో జట్టు కట్టాడు. వీరి కలయికలో తెరకెక్కిన సినిమానే 'ప్రిన్స్'. తెలుగు.. తమిళ భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో అనుదీప్ మరోసారి మ్యాజిక్ చేశాడేమో చూద్దాం పదండి.

కథ:

ఆనంద్ (శివకార్తికేయన్) దేవరకొండ అనే ఊరిలో చాలా సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న కుర్రాడు. అతడి తండ్రి విశ్వనాథం (సత్యరాజ్)కు ఆదర్శ భావాలు ఎక్కువ. కులం.. మతం లాంటి అంతరాలు మనుషుల మధ్య ఉండకూడని చెప్పే అతను.. తన కొడుకు వేరే కులం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చిత్రమైన కండిషన్ పెడతాడు. ఆనంద్.. తాను టీచరుగా పని చేసే స్కూల్లో ఇంగ్లిష్ టీచర్ గా చేరిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయి జెస్సికా ( మరియా)తో ప్రేమలో పడతాడు. కానీ మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్ దేశానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీరి పెళ్లికి విశ్వనాథం నిరాకరిస్తాడు. మరోవైపు మరియా తండ్రికి కూడా ఈ పెళ్లి ఇష్టం ఉండదు. మరి ఈ సమస్యలన్నీ అధిగమించి మరియాను ఆనంద్ ఎలా మరియాను పెళ్లాడాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'జాతిరత్నాలు' సినిమాలో ఒక సీన్లో బుల్లెట్ గాయం తగిలిన మురళీ శర్మ కింద పడిపోయి ఉంటే ప్రాణం ఉందో లేదో చూడమంటే ఊపిరితిత్తులు ఉండే వైపు చెవి పెట్టి విన్న రాహుల్ రామకృష్ణ గుండె కొట్టుకుంటున్న శబ్దం రాలేదనుకుని అతను చచ్చాడని అంటాడు. అది విని.. ''ఒరేయ్ గుండె ఏ పక్కనుంటుందో తెలియదారా.. మ్యాథ్స్ చదువుకోలేదారా'' అంటాడు. వినడానికి చాలా సిల్లీగా అనిపించే ఇలాంటి జోకులకు థియేటర్లలో పగలబడి నవ్వుకున్నారు ప్రేక్షకులు. ఇక్కడ కట్ చేసి ప్రిన్స్ సినిమా విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్ హీరో అతడి ఫ్రెండ్సుని ఇంటరాగేట్ చేసే క్రమంలో మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు అంటాడు. దానికి హీరో ఫ్రెండు బదులిస్తూ.. ''18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్'' అంటాడు. అది చూసి ఇదొక జోకు.. ఇదొక సినిమా అని ప్రేక్షకులు నిట్టూరిస్తే ఆశ్చర్యమేమీ లేదు. 'జాతిరత్నాలు'లో మాదిరే ఇలాంటి సిల్లీ జోకులతో సినిమాను నింపేశాడు అనుదీప్. కానీ కానీ అక్కడ నవ్వులు పంచిన జోకులే.. ఇక్కడ నవ్వులు పాలు అయిపోయాయంటే ఇక్కడ సరైన సందర్భం కుదరకపోవడం.. టోన్ సెట్ కాకపోవడమే కారణం.

కామెడీ పండడానికి ముందు సిచువేషన్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఒక టోన్ సిద్ధం చేసి.. దానికి అనుగుణంగా ప్రేక్షకులను ఒక మూడ్ లోకి తీసుకెళ్తే.. 'క్రింజ్' అనిపించే కామెడీని కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ టోన్.. మూడ్ సెట్ కానపుడు.. తెరపైన చూపించేదంతా వెకిలిగా.. వెటకారంగా అనిపించి మొదట్లోనే డిస్కనెక్ట్ అయిపోతాం. 'ప్రిన్స్' సినిమాలో అదే జరిగింది. 'జాతిరత్నాలు' సినిమా చూస్తున్నపుడు ముందు అందులోని ప్రధాన పాత్రధారులతో కనెక్ట్ అయిపోతాం. వాళ్లు మనలో ఒకళ్లుగా ఫీలవుతాం. వారి మధ్య జరిగే సంభాషణ కానీ.. వారి మధ్య వచ్చే సిచువేషన్లు కానీ.. రిలేటబుల్ గా అనిపిస్తాయి. ఆ పాత్రలతో ట్రావెల్ చేస్తూ వాళ్లు చేసే అల్లరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తాం. ఈ క్రమంలో కామెడీ కొన్ని చోట్ల హద్దులు దాటినా.. సిల్లీగా అనిపించినా.. సర్దుకుపోతాం. కానీ 'ప్రిన్స్' సినిమాలో పాత్రలు.. నటీనటులు.. సిచువేషన్లతో ఏ దశలోనూ కనెక్ట్ కాకపోవడం వల్ల అనుదీప్ 'జాతిరత్నాలు' తరహా కామెడీనే ట్రై చేసినా కూడా ఎక్కడా వర్కవుట్ కాలేదు. శివ కార్తికేయన్ సహా అందరూ నాన్ లోకల్ నటులు.. గుప్పుమనే తమిళ నేటివిటీ.. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని కథాకథనాల వల్ల మొదలైన కొన్ని నిమిషాల నుంచే 'ప్రిన్స్' శిరోభారంగా మారుతుంది.

ప్రిన్స్ బేసిగ్గా ఒక నాన్ సీరియస్ మూవీ. ఇందులో ఏ పాత్రలోనూ సీరియస్నెస్ కనిపించదు. అలాగే సన్నివేశాలు కూడా అలాగే నడుస్తాయి. అనుదీప్ స్టయిలే అంత కాబట్టి ఈ విషయంలో కంప్లైంట్ చేయడానికేమీ లేదు. 'జాతిరత్నాలు' లాంటి  మ్యాజిక్స్ ఎప్పుడో ఒకసారే జరుగుతాయని.. అనుదీప్ స్క్రిప్టుతో అతడి స్టయిల్లోనే సాగిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో'తోనే రుజువైపోయింది. ఆ సినిమా ప్రమోషనల్ వీడియోల్లో వర్కవుట్ అయినంత కామెడీ కూడా ఆ సినిమాలో లేకపోవడం చూసి ప్రేక్షకులు షాకయ్యారు. 'ప్రిన్స్'లో కూడా తన శైలిలో నాన్ సీరియస్ కథను ఎంచుకుని వెటకారపు కామెడీతో నడిపించాలని చూశాడు. అక్కడక్కడా కొన్ని జోకులు సినిమాతో సంబంధం లేకుండా కొంత నవ్వించాయే తప్ప.. ఇందులోని సిచువేషన్లలో అవి సింక్ కాలేదు. చాలా వరకు సన్నివేశాలు విపరీతమైన సాగతీతగా అనిపించి.. ఇంకెప్పుడు దర్శకుడు కట్ చెప్పి వేరే సీన్లోకి వెళ్తాడు అనిపించేలా చేస్తాయి. కథ పరంగా 'ప్రిన్స్' ఏ దశలోనూ ఆసక్తి రేకెత్తించదు.

స్కూల్ టీచర్ క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లడంమేంటో.. పదేళ్ల వయసున్న పిల్లలు ఇంటర్వెల్లో అతడికి తారసపడడం.. వాళ్లతో అతడికి వాదోపవాదాలు జరగడం.. స్టూడెంట్ దగ్గర లవ్ లెటర్ చూసి టీచర్ ఇన్ స్పైర్ కావడం.. తర్వాత తన లవ్ ఎఫైర్ గురించి పిల్లలతో క్లాసులో డిస్కషన్లు పెట్టడం.. ఇలా 'ప్రిన్స్' సినిమాలో కామెడీ పేరుతో హద్దులు దాటిపోయిన సీన్లు ఎన్నెన్నో. హీరోయిన్ని చూడగానే హీరో తొలి చూపులోనే ప్రేమలో పడిపోవడం వరకు ఓకే కానీ.. బ్రిటిష్ అమ్మాయి అయిన కథానాయిక అల్లరి చిల్లరిగా కనిపించే హీరోను అసలెందుకు ప్రేమిస్తుందో అర్థం కాదు. లవ్ స్టోరీనే అంతంతమాత్రంగా అనిపిస్తే.. హీరో తండ్రికి సంబంధించిన స్థలం గొడవ.. దాని చుట్టూ సీరియస్ గా నడిపిన కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. 'ప్రిన్స్' బేసిగ్గా తమిళ సినిమా కావడం.. నటీనటులంతా అక్కడి వారే కావడం.. కథ నేపథ్యంలో తమిళ టచ్ ఉండడం వల్ల అక్కడి ప్రేక్షకులకు కొంచెం కనెక్ట్ అయితే కావచ్చు కానీ.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది రుచించే అవకాశాల్లేవు.

నటీనటులు:

తమిళంలో శివ కార్తికేయన్ చాలా వరకు అల్లరి చిల్లరి కుర్రాడి పాత్రలే చేశాడు. అతను తన శైలికి నప్పుతాడనే అనుదీప్ తనతో సినిమా చేసినట్లున్నాడు. శివ వరకు బాగానే చేసినా.. కూడా అతడి పాత్రలో విషయం లేకపోవడంతో అది పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోయిన్ మరియా సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. ఆమెను తొలి చూపులో హీరోనే కాదు.. ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తుంది. చాలా లవబుల్ గా అనిపించేలా ఉందామె. తనలో ఏదో ఆకర్షణ ఉందనిపిస్తుంది. సత్యరాజ్ హీరో తండ్రి పాత్రలో తనకు అలవాటైన రీతిలో నటించాడు. ప్రేమ్ జీ అమరన్ నెగెటివ్ రోల్ లో ఓకే అనిపించాడు.

సాంకేతిక వర్గం:

'ప్రిన్స్'లో సాంకేతిక ఆకర్షణలు పర్వాలేదు. థమన్ పాటల్లో 'జెస్సికా జెస్సికా' ప్రత్యేకంగా అనిపిస్తుంది. బింబిలికా సాంగ్ కూడా ఓకే. మిగతావి మామూలే. నేపథ్య సంగీతంలో అంత ప్రత్యేకత ఏమీ కనిపించదు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు అనుదీప్ 'జాతిరత్నాలు' స్టయిలే ఫాలో అయినా సరే.. అనుదీప్ అలా మ్యాజిక్ చేయడంలో విఫలమయ్యాడు. 'జాతిరత్నాలు'లో కూడా చెప్పుకోదగ్గ కథ ఉండదు కానీ.. పాత్రలు ఆసక్తి రేకెత్తిస్తాయి. కామెడీ సిచువేషన్లు కూడా బాగా కుదిరాయి. 'ప్రిన్స్'లో అవన్నీ మిస్సయ్యాయి.

చివరగా:  ప్రిన్స్.. నవ్వుల్లేవ్.. నవ్వులపాలే

రేటింగ్ - 2/5
× RELATED కళ్యాణం కమనీయం
×