సర్దార్

'సర్దార్' మూవీ రివ్యూ
నటీనటులు: కార్తి-రాశి ఖన్నా-రజిష విజయన్-చుంకీ పాండే-మునీష్ కాంత్-లైలా తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్
నిర్మాత: లక్ష్మణ్ కుమార్
రచన-దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్

తమిళ స్టార్ హీరో సూర్యకు తమ్ముడు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. వైవిధ్యమైన చిత్రాలతో చాలా త్వరగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు కార్తి. అన్నతో సమానంగా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కార్తి నుంచి వచ్చిన కొత్త చిత్రం 'సర్దార్'. విశాల్ 'అభిమన్యుడు' సినిమాతో ఆశ్చర్యపరిచిన పి.ఎస్.మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

పోలీస్ ఇన్ స్పెక్టర్ అయిన విజయ్ ప్రకాష్ (కార్తి) ఒక అనాథ. అతడి తండ్రిపై దేశద్రోహి ముద్ర పడడంతో తన చిన్నతనంలోనే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని అతనొక్కడే మిగులుతాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ అతణ్ని చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు. ఎస్ఐగా విజయ్ ప్రకాష్ మంచి పేరు సంపాదించినా.. ఒక దేశ ద్రోహి కొడుకు అనే ముద్ర అతణ్ని వెంటాడుతుంటుంది. అలాంటి టైంలోనే ఇండియాలో విప్లవాత్మకంగా మొదలవుతున్న వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన మంగ (లైలా) అనే మహిళ కేసును విచారించడం మొదలుపెడతాడు. ఐతే ఆమెది ఆత్మహత్య కాదని.. తనను చంపేశారని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అర్థమవుతుంది. అదే సమయంలో ఆమె ఒక సీక్రెట్ నెట్వర్క్ తో కలిసి పని చేస్తోందని.. వీళ్లంతా కలిసి సర్దార్ అనే వ్యక్తి కోసం వెతుకుతున్నారని తెలుస్తుంది. ఇంతకీ ఆ సర్దార్ ఎవరు.. తన కథేంటి.. తన లక్ష్యమేంటి.. మంగను ఎవరు ఎందుకు చంపారు.. వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టు కథేంటి.. ఇలాంటి విషయాలన్నీ తెర మీదే చూడాలి.

కథనం-విశ్లేషణ:

ఒకప్పుడు తమిళ సినిమాలను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. మన చుట్టూ మనకు తెలియకుండా జరిగే విషయాల గురించి గొప్పగా పరిశోధించి.. వాటికి తమ ఊహా శక్తిని జోడించి అద్భుతమైన కథలు తయారు చేసేవారు. అవి భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకునేవి. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమానైనా ఆదరించే తెలుగు ప్రేక్షకులకు తమిళ సినిమాలపై ఎంతో గురి ఉండేది. కానీ గత కొన్నేళ్లలో తమిళ సినిమాల ప్రమాణాలు పడిపోయాయి. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో తిరోగమనంలో పయనిస్తున్నారు అక్కడి ఫిలిం మేకర్స్. ఐతే ఇలాంటి టైంలోనూ అప్పుడప్పుడూ కొందరు దర్శకులు ఒకప్పటి తమిళ సినిమా ప్రమాణాలను అందుకుంటున్నారు. పి.ఎస్.మిత్రన్ ఆ కోవకే చెందుతాడు. విశాల్ తో ఈ యువ దర్శకుడు తీసిన 'అభిమన్యుడు' చూసి ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఈ ఇంటర్నెట్ యుగంలో మన వ్యక్తిగత సమాచారం విషయంలో జాగ్రత్త వహించకపోతే ఏం జరుగుతుందో హెచ్చరిస్తూనే.. సైబర్ క్రైమ్ నెట్కర్క్ చుట్టూ ఉత్కంఠభరితంగా ఆ చిత్రాన్ని తీర్చిదిద్దిన మిత్రన్.. రెండో సినిమా 'హీరో' (తెలుగులో శక్తి)తోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'సర్దార్'తో మరోసారి వారెవా అనిపించాడు మిత్రన్. కార్తి రూపంలో మంచి పెర్ఫామర్ దొరకడంతో మిత్రన్ ఈసారి మరింతగా మెరుపులు మెరిపించాడు. 'సర్దార్'ను ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే.. ఉత్కంఠకు గురిచేసే థ్రిల్లర్ గా తీర్చిదిద్దాడు.

'అభిమన్యుడు' మాదిరే.. ఈ కథ కూడా సామాజికాంశాలతో ముడిపడ్డదే. చాలా యునీక్ గా అనిపించేదే. మనకు తెలియకుండా మనం ఇరుక్కుంటున్న ఒక ఉచ్చు.. ప్రమాదకరంగా మారుతున్న మన భవిష్యత్తు గురించి హెచ్చరికను జారీ చేసేదే. ఒకప్పుడు చెరువులు.. నదులు.. బావుల్లో స్వచ్ఛమైన నీరు తాగుతూ ఆరోగ్యంగా జీవించిన మనం.. ఇప్పుడు నీటిని బాటిళ్లు.. క్యాన్లు.. ట్యాంకుల్లో కొని తాగుతున్నాం. ఇదంతా వాటర్ మాఫియా పుణ్యమే అని.. భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు తప్పవని చెప్పడం 'సర్దార్'లో మూల కథాంశం. సినిమా కాబట్టి ఈ విషయాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చూసి  చూపించిన మాట వాస్తవం. కానీ ఈ సినిమా చూశాక వాటర్ బాటిల్లో నీళ్లు తాగేటపుడు ఒక్క క్షణం ఆలోచంచడం ఖాయం. ఈ పాయింట్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తుంటే.. ఇదేదో డాక్యుమెంటరీ టైపు సినిమా అనుకుంటే పొరపాటే. ఈ విషయాలను చాలా ఉత్కంఠభరితంగా.. ఆసక్తికరంగా కమర్షియల్ మీటర్ ఫాలో అవుతూనే.. ఉత్కంఠ రేకెత్తించేలా చెప్పాడు దర్శకుడు మిత్రన్. 'సర్దార్' అసలు కథలోకి వెళ్లడానికి ముందు హీరో పరిచయ సన్నివేశాలు.. కొన్ని మామూలు సీన్లతో కొంచెం బోర్ కొట్టిస్తుంది. కానీ అసలు కథను మొదలుపెట్టాక మాత్రం పరుగులు పెడుతుంది.

విలన్ తెరపైకి రావడంతోనే ప్రేక్షకులు అరెస్టయిపోతారు. వాటర్ మాఫియా దేశంలో ఉన్న నీటి వనరులన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నం.. వాటర్ బాటిళ్ల వల్ల తలెత్తే దుష్పరిణామాలు.. లాంటి అంశాల చుట్టూ దర్శకుడు ఎంతో పరిశోధించి తీసిన సన్నివేశాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆలోచన రేకెత్తిస్తాయి. ఒకింత భయాన్ని కూడా కలిగిస్తాయి. నరేషన్ కొంచెం గందరగోళంగా అనిపించినప్పటికీ.. లైలా పాత్ర చుట్టూ నడిపిన మిస్టరీ ఆకట్టుకుంటుంది. ఇక సర్దార్ పాత్ర గురించి ఇచ్చే బిల్డప్ తో దాని గురించి ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ కలుగుతుంది. ఇంటర్వెల్ ముంగిట ఆ పాత్రకు మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు దర్శకుడు. 60 ఏళ్ల వ్యక్తి అంతలా చెలరేగిపోవడం అతిశయోక్తిలా అనిపించినా.. మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఇంటర్వెల్ బ్లాక్‌ ను డిజైన్ చేశారు.

గూఢచారి అయిన సర్దార్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ తో ద్వితీయార్ధం కూడా ఆసక్తికరంగానే నడుస్తుంది. అతడి సీక్రెట్ మిషన్లు.. తన వ్యక్తిగత జీవితం.. చివరగా దేశద్రోహిలా ముద్ర వేయించుకుని పరాయి దేశంలో ఖైదీలా మగ్గిపోయే వరకు అతడి కథలో డ్రామా బాగా పండింది. వర్తమానంలోకి వచ్చాక సర్దార్ అక్కడి నుంచి తప్పించుకునే ఎపిసోడ్ కూడా బాగా పేలింది. ఒక దశ దాటాక యంగ్ కార్తీ పాత్ర పూర్తిగా సైడ్ అయిపోయి సర్దార్ ప్రతాపమే చూస్తాం. చివరిదాకా ఆ పాత్ర ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ సాగుతుంది. కథ పరంగా ఆసక్తి మిస్ కాకుండానే.. ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ సీన్లతో సినిమా ముందుకు సాగుతుంది. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ సన్నివేశాల్లో భారీతనం ఆకట్టుకుంటుంది. కథ పరిధి చాలా ఎక్కువ ఉండడం.. అన్ని విషయాలూ అర్థం చేసుకోలేని విధంగా అక్కడక్కడా నరేషన్ కొంచెం గందరగోళంగా ఉండడం.. లెంగ్త్ ఎక్కువవడం లాంటి చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ.. 'సర్దార్' ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో.. ఆశ్చర్యపరచడంలో విఫలం కాలేదు. కమర్షియల్ విలువలు మిస్ కాకుండానే భిన్నమైన అనుభూతిని ఇవ్వడంలో 'సర్దార్' సక్సెస్ అయింది.

నటీనటులు:

కార్తి ఒక ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోనందు వల్ల అతడి దగ్గరికి ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలు వస్తుంటాయి. ఖాకి.. ఖైదీ.. ఇప్పుడు సర్దార్.. ఇలా తన కెరీర్లో మైలురాళ్లలా నిలిచే సినిమాలు చేయగలుగుతున్నాడతను. 'సర్దార్'లో కార్తి పాత్ర.. అతడి నటన చూసి వేరే హీరోలు అసూయ చెందితే ఆశ్చర్యం లేదు. అంత లోతు ఉన్న.. వేరియేషన్లు చూపించగలిగిన పాత్రను చేశాడతను. యంగ్ క్యారెక్టర్లో మామూలుగానే అనిపించినా.. సర్దార్ పాత్రలో మాత్రం కార్తి అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇలాంటి పాత్రలు స్టార్ హీరోలకు అరుదుగా దొరుకుతుంటాయి. సినిమా అంతా అతడి డామినేషనే కనిపిస్తుంది. విలన్ పాత్రలో చుంకీ పాండే బాగానే చేశాడు. హీరోయిన్లలో రజిష విజయన్ తక్కువ స్క్రీన్ టైంలోనే ఆకట్టుకుంది. రాశి ఖన్నా పర్వాలేదు. మునీష్ కాంత్ సహాయ పాత్రలో ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లాడి పాత్రను చేసిన కుర్రాడు గుర్తుండిపోతాడు. లైలా చాన్నాళ్ల తర్వాత సహాయ పాత్రలో మెరిసింది.

సాంకేతిక వర్గం:

'సర్దార్'కు తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు జి.వి.ప్రకాష్ కుమార్. ఎలివేషన్ సీన్లలో ఎలా గూస్ బంప్స్ ఇచ్చాడో.. కథలో కీలకమైన సన్నివేశాలు వస్తున్నపుడు వాటిలో లీనం అయ్యేలా ఆర్ఆర్ తో డ్రైవ్ చేశాడు. సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అవి పర్వాలేదనిపిస్తాయి. జార్జ్ సి.విలియమ్స్ ఛాయాగ్రహణం సినిమాలో మరో టెక్నికల్ హైలైట్. సినిమా చాల ా రిచ్ గా కనిపించడంలో ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు జార్జ్ కెమెరా పనితనం కూడా కీలకంగా పని చేసింది. రైటర్ కమ్ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ మరోసారి తన ముద్రను చూపించాడు. అతను ఆషామాషీగా 'సర్దార్'ను తీయలేదని... తీయడని సినిమా మొదలైన కాసేపటికే అర్థమవుతుంది. దర్శకుడు కథాకథనాల విషయంలో ఎంత కసరత్తు చేశాడో తెరపై కనిపిస్తుంది. అతను అంతర్జాతీయ అంశాలతో ముడిపెట్టి కథను తీర్చిదిద్దుకున్న తీరు.. ఎక్కడా బిగి సడలకుండా ఆసక్తికర స్క్రీన్ ప్లేతో సినిమాను ముందుకు నడిపించిన తీరు మెప్పిస్తుంది.

చివరగా: సర్దార్.. ది విన్నర్

రేటింగ్-3/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater
× RELATED కళ్యాణం కమనీయం
×