ఓరి దేవుడా

'ఓరి దేవుడా' మూవీ రివ్యూ
నటీనటులు: విశ్వక్సేన్-మిథిలా పాల్కర్-ఆశా భట్-మురళీ శర్మ-రాహుల్ రామకృస్ణ-నాగినీడు-వెంకటేష్ కాకుమాను-విక్టరీ వెంకటేష్ (క్యామియో) తదితరులు
సంగీతం: లియాన్ జేమ్స్
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: తరుణ్ భాస్కర్
నిర్మాతలు: ప్రసాద్ వి.పొట్లూరి-దిల్ రాజు
రచన-దర్శకత్వం: అశ్వత్ మారిముత్తు

కొన్ని నెలల కిందటే 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రంతో ఆకట్టుకున్నాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. ఇప్పుడు అతడి నుంచి వచ్చిన కొత్త సినిమా 'ఓరి దేవుడా'. 'ఓ మై కడవులే' అనే తమిళ సినిమా ఆధారంగా ఒరిజినల్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని రూపొందించాడు. దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి లాంటి అగ్ర నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (విశ్వక్సేన్).. అను (మిథిలా పాల్కర్) చిన్నప్పట్నుంచి స్నేహితులు. అను తనను ఇష్టపడడంతో ఆమెతో పెళ్లికి ఓకే అంటాడు అర్జున్. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ అను పట్ల అర్జున్ కు ఎలాంటి ఫీలింగ్స్ ఏర్పడవు. వారి కాపురంలో కలహాలు రేగుతాయి. ఇద్దరూ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అనుతో జీవితం నరకప్రాయం అనుకుని, ఆమెతో విడిపోవడానికి సిద్ధపడ్డ అర్జున్ కు ఒక దైవదూత రెండో అవకాశం ఇస్తాడు. ఆ ఛాన్స్ ఏంటి.. దాని వల్ల అర్జున్ జీవితం ఎలా మలుపు తిరిగింది.. చివరికి అనుతో అతడి ప్రయాణం ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

తమిళంలో చాలా ఏళ్ల కిందట '12 బి' అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో ఒక సరికొత్త కథను ప్రేక్షకులకు పరిచయం చేశాడు దర్శకుడు జీవా. ఆ సినిమాలో హీరో ఒక ఇంటర్వ్యూ అటెండయ్యేందుకు బస్ ఎక్కబోయి దాన్ని మిస్సవుతాడు. అందుకు చాలా ఫీలవుతాడు. ఐతే బస్ మిస్ కావడం వల్ల అతడి జీవితం ఏమైందో చూపిస్తూనే.. ఒక వేళ హీరో ఆ బస్సు ఎక్కి ఉంటే తన జీవితం ఎలా ఉండేదో సమాంతరంగా ఇంకో కథను నడిపించాడు దర్శకుడు. జీవితాన్ని ఉన్నదున్నట్లుగా ఆస్వాదించడమే కరెక్ట్ అని.. అలా చేసి ఉంటే.. ఇలా జరక్కపోయి ఉంటే అంటూ బాధ పడడంలో అర్థం లేదనే  సందేశాన్ని చివరగా ఇస్తుందా చిత్రం. 'ఓరి దేవుడా' కాన్సెప్ట్ సైతం ఇంతే. '12 బి' నుంచి స్ఫూర్తి పొందాడో ఏమో.. యువ దర్శకుడు అశ్వథ్ మారిముత్తు ఈ ఐడియానే డిపరెంట్ స్క్రీన్ ప్లే.. నరేషన్ తో ఇంకో రకంగా ప్రెజెంట్ చేశాడు 'ఓ మై కడవులే' చిత్రంలో. అదే ఇప్పుడు తెలుగులో 'ఓరి దేవుడా' పేరుతో అతనే రీమేక్ చేశాడు. జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది ఉండి.. జీవితాలను చక్కదిద్దుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ ఇందులో హైలైట్. ఇలాంటి ఫాంటసీ ఐడియాలు ఎవరికైనా నచ్చుతాయి. యూనివర్శల్ గా అనిపిస్తాయి. కాబట్టి తెలుగులోనూ ఈ ఐడియా బాగానే వర్కవుట్ అయింది.

సినిమా ఆద్యంతం ఉండే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ 'ఓరి దేవుడా'కు పెద్ద ప్లస్. చాలా వరకు ఇందులో సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగిపోతాయి. కొన్ని చోట్ల కామెడీ బాగానే వర్కవుట్ అయిన ఈ సినిమాలో.. ఎమోషన్లు బాగా పండాయి. కాకపోతే స్లో నరేషన్ వల్ల అక్కడక్కడా బోర్ ఫీలింగ్ కలుగుతుంది. కథలో వచ్చే మలుపులు కొత్తగా అనిపించినా.. వాటికి ముందు వెనుక మాత్రం సినిమా రొటీన్ గానే అనిపిస్తుంది. చిన్నప్పట్నుంచి కలిసి పెరిగిన స్నేహితురాలు తనకు ప్రపోజ్ చేస్తే ఆమెతో పెళ్లికి ఓకే చెప్పిన కుర్రాడు.. ఆమెతో తనకు సెట్టవ్వక ఇబ్బంది పడే నేపథ్యంలో ప్రథమార్ధం నడుస్తుంది. తన మామ నడిపే టాయిలెట్ కమోడ్ ఫ్యాక్టరీలో హీరో పడే ఇబ్బందులు హిలేరియస్ గా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో చాలా వరకు వినోదాన్ని పంచేవి ఆ సన్నివేశాలే. ఇక భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు.. గొడవలు.. అపార్థాలు.. ఆపై విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం.. ఇదంతా మామూలు వ్యవహారమే. ఇక ప్రేక్షకులను ప్రథమార్ధంలో సర్ప్రైజ్ చేసేది ఫాంటసీ యాంగిల్. ఆధునికంగా కనిపించే దేవుడిగా వెంకీ.. ఆయన అసిస్టెంటుగా రాహుల్ రామకృష్ణలతో కలిసి విశ్వక్సేన్ చేసిన సందడి ఆకట్టుకుంటుంది. హీరోకు దేవుడు రెండో ఛాన్స్ ఇవ్వడం దగ్గర ఇంటర్వెల్ మలుపు క్యూరియాసిటీ పెంచుతుంది.

హీరో మళ్లీ జీవితంలో వెనక్కి వెళ్లి తన జీవితాన్ని మార్చుకునేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు క్రేజీగా అనిపిస్తాయి. సినిమా మొత్తానికి హైలైట్ గా అనిపించే ఎపిసోడ్ ద్వితీయార్ధంలో వస్తుంది. తాను మరోలా అర్థం చేసుకున్న హీరోయిన్ తండ్రికి సంబంధించిన నేపథ్యంలో.. అందులోని ఎమోషన్ ప్రేక్షకులను కదిలిస్తుంది. చాలా హృద్యంగా అనిపించే ఈ సన్నివేశాలను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. ఐతే ఇక్కడ ఎమోషనల్ టర్న్ తీసుకునే సినిమా చివరి దాకా ప్రేక్షకులను అదే మూడ్ లో ఉంచుతుంది. హీరోలో రియలైజేషన్ రావడం మొదలయ్యాక.. ప్రతి సన్నివేశం అదే తరహాలో నడుస్తుంది. ఇక చివరి దాకా కథ ఎలా నడుస్తుందో ప్రేక్షకులకు ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. రాను రాను మెలో డ్రామా ఎక్కువపోయి.. సినిమా మరీ నెమ్మదిగా నడుస్తున్న భావన కలుగుతుంది. కానీ ఏ సన్నివేశం కూడా బాగా లేదు అనిపించకపోవడం ప్లస్. అంతా బాగానే ఉన్నా లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మాత్రం ఎక్కడా వర్కవుట్ అయినట్లు అయితే అనిపించదు. వాళ్లిద్దరూ కలవాలనే బలమైన కోరిక ప్రేక్షకుల్లో కలగకపోవడం మైనస్సే. ఐతే భారంగా నడుస్తున్న సినిమాను కొంచెం సరదాగా.. హడావుడి మధ్య ముగించడంతో కొంచెం హుషారు వస్తుంది. ఓవరాల్ గా చూస్తే 'ఓరి దేవుడా'లో టైంపాస్ వినోదానికి ఢోకా లేదు. ఎమోషన్లు.. కామెడీ బాగానే వర్కవుట్ అయ్యాయి. వావ్ అనిపించదు కానీ.. 'ఓకే' అనిపించే సినిమా ఇది.

నటీనటులు:

విశ్వక్సేన్ మంచి పెర్ఫామర్ అనే విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' తర్వాత ఈ చిత్రంలో పూర్తి భిన్నంగా కనిపించాడు. అతడికిది టైలర్ మేడ్ రోల్ లాగా అనిపిస్తుంది. ఆధునిక యువకుడైన అర్జున్ పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. భార్యతో వేగలేక ఇబ్బంది పడే సగటు భర్తగా ఫ్రస్టేషన్ చూపించే సన్నివేశాల్లోనే కాక.. ఎమోషనల్ సీన్లలోనూ అతను ఆకట్టుకున్నాడు. మిథిలా పార్కర్ హీరోయిన్ లాగా కాకుండా ఒక సగటు అమ్మాయిలా కనిపిస్తుంది. పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించింది. మరో హీరోయిన్ ఆశా భట్ పర్వాలేదు. మురళీ శర్మ కీలక పాత్రలో మెరిశారు. తన అనుభవాన్ని చూపించారు. కనిపించేది తక్కువ సేపే అయినా.. కీలకమైన క్యామియో రోల్ లో విక్టరీ వెంకటేష్ ఆకట్టుకున్నాడు. ఆయన ప్రేక్షకులకు మంచి ఉత్సాహాన్నిస్తాడు. వెంకీ అసిస్టెంటుగా రాహుల్ రామకృష్ణ కూడా మంచి జోష్ ఇస్తాడు.  హీరో స్నేహితుడిగా వెంకటేష్ కాకుమాను ఓకే.

సాంకేతిక వర్గం:

మాతృకకు పని చేసిన సాంకేతిక నిపుణులతోనే తెలుగు వెర్షన్ కు కూడా కొనసాగించాడు అశ్వత్ మారిముత్తు. వాళ్లు ఒరిజినల్ అందం చెడకుండానే మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఔట్ పుట్ ఇచ్చారు. లియాన్ జేమ్స్ సంగీతం హుషారుగా సాగింది. అనిరుధ్ పాడిన గుండెల్లోన పాట మంచి ఊపు తెస్తుంది. మిగతా పాటలు.. నేపథ్య సంగీతం కూడా బాగున్నాయి. విధు అయ్యన్న ఛాయాగ్రహణం నీట్ గా.. కలర్ ఫుల్ గా సాగింది. రెండు పెద్ద బేనర్లు కలిసి నిర్మించిన చిత్రంలో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు తాను తమిళంలో తీసిన సినిమాను యాజిటీజ్ ఫాలో అయిపోయాడు. కథాంశం యూనివర్శల్ కావడం.. అందులో కొత్తదనం ఉండడం వల్ల తెలుగులో పెద్దగా ఇబ్బంది లేకపోయింది. ఇలాంటి పాయింట్ ను గతంలో కొందరు దర్శకులు టచ్ చేసినప్పటికీ.. అశ్వత్ డిఫరెంట్ ప్రెజెంటేషన్ తో ఆకట్టుకున్నాడు. కథతో పాటు అతడి స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధాన్ని ఇంకొంచెం క్రిస్పీగా మలుచుకుని ఉంటే బాగుండేది. తరుణ్ భాస్కర్ మాటలు సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి.

చివరగా: ఓరి దేవుడా.. ఓకే ఎంటర్టైనర్

రేటింగ్-2.75/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater
× RELATED కళ్యాణం కమనీయం
×