కాంతార

కాంతార మూవీ రివ్యూ
నటీనటులు: రిషబ్ శెట్టి-సప్తమి గౌడ-అచ్యుత్  కుమార్-కిషోర్-వినయ్ బిడప్ప-ప్రకాష్ తుమినాడ్ తదితరులు
సంగీతం: అజ్నీష్ లోక్ నాథ్
ఛాయాగ్రహణం: అరవింద్ కశ్యప్
మాటలు: హనుమాన్ చౌదరి
నిర్మాత: విజయ్ కిరంగదూర్
రచన-దర్శకత్వం: రిషబ్ శెట్టి

కాంతార.. రెండు వారాలుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న కన్నడ చిత్రం. ఈ సినిమా చూసేందుకు వివిధ భాషల వాళ్లు ఎగబడుతుండగా.. ఆయా భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేయడం మొదలుపెట్టింది చిత్ర బృందం. తెలుగులో అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత చకచకా సినిమాను సిద్ధం చేసి తన బేనర్ ద్వారా శనివారం ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. అంత ప్రత్యేకత ఈ సినిమాలో ఏముందో చూద్దాం పదండి.

కథ:

అడవికి ఆనుకుని ఉండే ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఒక దైవదూత సూచన మేరకు తన ఐదొందల ఎకరాల భూమిని గిరిజనులకు రాసిచ్చేస్తాడు. కాల క్రమంలో అతడి వారసుడొకరు ఆ భూమిని తనకి ఇచ్చేయాలని గిరిజనుల మీద ఒత్తిడి తెస్తాడు. కానీ అతను అనూహ్య పరిణామాల మధ్య రక్తం కక్కుకుని చనిపోతాడు. ఇంకో తరం మారాక ఆ చనిపోయిన వ్యక్తి కొడుకైన దేవేంద్ర (అచ్యుత్ కుమార్) గిరిజనులతో సన్నిహితంగా మెలుగుతుంటాడు. అతడి దగ్గర పని చేస్తూ తన ఊరి వాళ్లకు తలలో నాలుకలా ఉండే శివ (రిషబ్ శెట్టి)కి.. కొత్తగా అటవీ అధికారిగా వచ్చిన మురళి (కిషోర్)కి తగువు మొదలవుతుంది. కొన్ని పరిణామాల తర్వాత శివ సోదరుడు చనిపోతాడు. అతణ్ని చంపింది మురళీనే అనుకుంటాడు శివ. కానీ అసలు కథ వేరే అని తర్వాత తెలుస్తుంది. ఇంతకీ శివ సోదరుడిని చంపిందెవరు.. అందుకు కారణమేంటి.. బదులుగా శివ ఏం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒక దశ వరకు సినిమా బాగుండి కూడా.. చివర్లో తుస్సుమనిపిస్తే అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది. సినిమా తేడా కొట్టేస్తుంటుంది. అదే సమయంలో సినిమాను కొంచెం మెరుగ్గా మొదలుపెట్టి.. మధ్యలో కొంచెం అటు ఇటు అయినా.. ఆఖర్లో అద్భుత: అనిపిస్తే చాలు ప్రేక్షకుల కడుపు నిండిపోతుంది. కాంతార సినిమాలో ఉన్న కనికట్టు ఇదే. ఒక సినిమా గురించి మాట్లాడేటపుడు మొదట్నుంచి ఆరంభించాలి కానీ.. కాంతార విషయంలో మాత్రం పతాక ఘట్టం గురించే ప్రస్తావించాలి. గత రెండు వారాలుగా దీని గురించి జరుగుతున్న చర్చలో అతిశయోక్తి ఏమీ లేదు. ముందే భారీ అంచనాలు పెట్టుకుని వెళ్లినా ఇందులోని పతాక సన్నివేశాలు కచ్చితంగా ప్రేక్షకులకు ఆశ్చర్యానుభూతి కలిగిస్తాయి. అందులో రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్ చాలా కాలం గుర్తుండి పోతుంది. అప్పటిదాకా సినిమా ఎగుడుదిగుడుగా సాగినా సరే.. క్లైమాక్సుతో కడుపు నిండి సంతృప్తిగా బయటికి వస్తారు ప్రేక్షకులు.

కథగా చెప్పుకుంటే మరీ కొత్తగా.. ఆశ్చర్యకరంగా ఏమీ అనిపించదు కాంతార. తన పూర్వీకులు పేదలకు దారాదత్తం చేసిన భూమిని తిరిగి పొందడానికి కుట్ర చేసే మేక వన్నె పులి లాంటి  ఒక జమీందారు.. ఆలస్యంగా విషయాన్ని గ్రహించి అతడి ఆట కట్టించే హీరో.. వీరి మధ్య నడిచే కథ ఇది. ఐతే దీనికి ఎంచుకున్న నేపథ్యం భిన్నంగా అనిపిస్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం వల్ల సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసింది మొదట్నుంచే. దీనికి తోడు కన్నడనాట పేరుగాంచిన కోళం ఆట నేపథ్యాన్ని జోడించడం ఇంకో పెద్ద ప్లస్. ఈ ఆట చుట్టూ నడిపిన ఆరంభ సన్నివేశాలతోనే ప్రేక్షకులు ఈ కథలో ఇన్వాల్వ్ అయిపోతారు. మామూలుగా మనకు సంబంధం లేని ఒక వేరే ప్రాంతంలో ఉన్న ఒక ఆచారం గురించి కొంచెం ఎక్కువ మోతాదులో చూపిస్తే.. కనెక్ట్ కావడం కష్టం. కానీ కాంతారలో దేవుడి ముందు కోళం ఆట ఆడే దైవదూత పాత్ర.. దాని చుట్టూ నడిపిన సన్నివేశాలు చూస్తుంటే.. కళ్లు తిప్పుకోకుండా అలా చూస్తూ ఉండిపోతాం. ఆ పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇవ్వడమే కాక ఆ సన్నివేశాలను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఆ సన్నివేశాలను ప్రెజెంట్ చేసిన తీరులో ఏదో ఒక మ్యాజిక్ ఉంది.

ఐతే ఆరంభంలో కథకు కీలకమైన ఈ ఎపిసోడ్ ముగిశాక.. మామూలు సినిమాగా మారిపోతుంది కాంతార. కంబాళ రేసుల నేపథ్యంలో వచ్చే హీరో పరిచయ సన్నివేశాలు బాగున్నా.. కొన్ని కామెడీ సీన్లు ఓకే అనిపించినా.. మిగతా వ్యవహారమంతా రొటీన్ అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో పందుల వేట.. ఫారెస్ట్ ఆఫీసర్ తో గొడవ.. మిగతా సీన్లలో ఏమంత ప్రత్యేకత కనిపించదు. ఒక రెగ్యులర్ సినిమా కథను చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. ద్వితీయార్ధంలోనూ ఒక దశ వరకు కథ ముందుకు కదలదు. ఐతే విలన్ పాత్ర తాలూకు అసలు రూపం బయటపడ్డ దగ్గర్నుంచి కథలో క్యూరియాసిటీ మొదలవుతుంది. విలన్ పాత్రను అంచనా వేయడం కష్టమేమీ కాదు కానీ.. ఆ పాత్రతో కథను మలుపు తిప్పిన  విధానం ఆకట్టుకుంటుంది. చివరి 20-25 నిమిషాల్లో కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలు.. అద్భుతమైన సినిమాటోగ్రఫీ.. ఒళ్లు జలదరించేలా చేసే నేపథ్య సంగీతం.. వీటన్నింటికీ మించి హీరో పాత్ర విశ్వరూపం.. అందులో రిషబ్ శెట్టి మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ వల్ల సినిమా ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకుంటుంది. ఆ సన్నివేశాలు ఇచ్చే హైతో కాంతారకు మన మనసుల్లో ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేస్తాం. క్లైమాక్సులో ప్రేక్షకులు షాకైపోయేలా.. సంచలన రేతిలో ఏమీ జరిగిపోదు కానీ.. ఆ ఎపిసోడ్ ను తీర్చిదిద్దిన విధానంలోనే ఒక ప్రత్యేకత ఉంది. కాంతారకు అదే మేజర్ హైలైట్. పతాక సన్నివేశాలిచ్చే హై వల్ల ముందు వచ్చే రిపీటెడ్.. బోరింగ్ సన్నివేశాలను మన్నించవచ్చు.

నటీనటులు:

కాంతార సినిమా చూశాక ఎవ్వరైనా రిషబ్ శెట్టి ఫ్యాన్ అయిపోవాల్సిందే. శివ అనే సగటు కుర్రాడిలా అతడి నటన మామూలే కానీ.. కోళం ఆట ఆడే దైవదూత పాత్రలో అతడి అప్పీయరెన్స్.. పెర్ఫామెన్స్ చాన్నాళ్లు గుర్తుండి పోతుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో రిషబ్ నటనకు చాలా అవార్డులే దక్కుతాయనడంలో సందేహం లేదు. అప్రయత్నంగా చప్పట్లు కొట్టే స్థాయిలో అతను పెర్ఫామ్ చేశాడు. సప్తమి గౌడ హీరోయిన్ లాగా కాకుండా పాత్రకు తగ్గట్లు ఒక మామూలు అమ్మాయిలా చక్కగా ఒదిగిపోయింది. అచ్యుత్ కుమార్ దొర పాత్రలో అదరగొట్టాడు. అటవీ అధికారిగా కిషోర్ కూడా ఆకట్టుకున్నాడు. హీరో పక్కన మిడిలేజ్డ్ క్యారెక్టర్లో చేసిన నటుడు బాగానే నవ్వులు పంచాడు. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

కాంతారకు సాంకేతిక ఆకర్షణలు బాగా కుదిరాయి. అజ్నీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. పాటలు ఓకే. అరవింద్ కశ్యప్ ఛాయాగ్రహణం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. హోంబళె ఫిలిమ్స్ స్థాయికి తగ్గట్లు నిర్మాణ విలువలు ఉన్నాయి. కిరిక్ పార్టీ లాంటి కాలేజ్ లవ్ స్టోరీతో మంచి పేరు సంపాదించిన రిషబ్ శెట్టి.. కాంతారతో దర్శకుడిగా చాలా మెట్లు ఎక్కాడు. కర్ణాటకలోని ఒక ఆచారాన్ని నేపథ్యంగా తీసుకుని యూనివర్శల్ అప్పీల్ వచ్చేలా ఈ కథను అతను తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. ఓవైపు లీడ్ రోల్ చేస్తూనే కన్ఫ్యూజన్ లేకుండా తన స్క్రిప్టును తెరపై ప్రెజెంట్ చేశాడు.

చివరగా: కాంతార.. క్లైమాక్స్ కనికట్టు

రేటింగ్-3/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater
× RELATED కళ్యాణం కమనీయం
×