సీఎం విమానానికి విరాళం.. ఖమ్మం టీఆర్ఎస్ నేతలు అంత ధనవంతులా?

టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఓ విమానాన్ని కొనుగోలు చేయనున్నారనే వార్త ఇటీవల అందరినీ ఆకర్షించింది. లోక్ సభ ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమ సమయం ఉంది. ఈలోగా టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కానున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ భావించారు. దీంతో ఇతర రాష్ట్రాల నేతలను కలుపుకొని పోయి.. కూటమిగా నిలిచేందుకు ఆయనకు తక్కువ వ్యవధి ఉంది. దీనిని సాధ్యమైన మేర వినియోగించుకోవాల్సిన పరిస్థితి.

అందుకనే ఓ విమానం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది నేతలు విరాళం ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే.. ఈ 8 మందిలో ముగ్గురు ఖమ్మం జిల్లా వారేననే కథనాలు వినిపించాయి. దీంతో వామ్మో .. ఖమ్మం జిల్లా నేతలు అంత ధనవంతులా? అంటూ కొందరు నోరెళ్లబెట్టారు.

ఎవరా ముగ్గురు..?

కేసీఆర్ విమానం కొనుగోలుకు విరాళం ఇచ్చారంటున్న/ఇవ్వబోతున్న ముగ్గురు ఖమ్మం జిల్లా నేతలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 8మంది నాయకులు విరాళాలు ఇస్తే ఆ ముగ్గురు ఒకే జిల్లా వారు కావడం చర్చనీయాంశమైంది. కాగా ఖమ్మం నుంచి ప్రాతినిధ్వం వహిస్తున్న వారిలో ఓ ప్రజాప్రతినిధి అత్యంత ధనవంతులన్న సంగతి తెలిసిందే. ఆయనకు రాజకీయాల్లోకి రాకమునుపే వ్యాపారాలున్నాయి. భూములు సైతం పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటి విలువ ప్రస్తుతం కొన్ని వేల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. బహుశా విరాళాలు ఇచ్చినవారిలో ఆయన ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆ వ్యాపార- రాజకీయవేత్త కూడానా?

విమానం కొనుగోలుకు విరాళం ఇచ్చిన మరో నాయకుడు ఎవరంటే.. ఇటీవలే చట్ట సభల ప్రాతినిధ్యం దక్కిన నాయకుడని చెబుతున్నారు. ఈయనకూ వ్యాపారాలు దండిగా ఉన్నాయి. కొంత కాలం కిందటే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనూహ్యంగా చట్ట సభల ప్రాతినిధ్యం దక్కింది. తనకు ఈ అవకాశం వచ్చినందుకు ఈయన ఢిల్లీలో చేసిన హడావుడి ఖర్చే రూ.3 కోట్ల వరకు ఉందని చెబుతారు. ఆర్థికంగా బలీయమైన నేత కావడంతో విమానానికి విరాళం ఇచ్చిన రెండో నేతగా ఈయన పేరు వినిపిస్తోంది.

మూడో నేత.. మాజీనా..? మరెవరైనానా..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమానం కొనుగోలుకు విరాళం ఇచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన మూడో నేత ఎవరనేది కాస్త సందిగ్ధంగా ఉంది. జిల్లా నుంచి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం నామమాత్రంగా మిగిలిన నాయకుడా..? లేక గతంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడా? అనేది తెలియాల్సి ఉంది. వీరిలో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన నాయకుడి పైనే అందరి చర్చ నడుస్తోంది.

ఆయన కాంట్రాక్టర్ కూడా కావడమే దీనికి కారణం. ఇటీవల వైభవంగా తన ఇంట్లో శుభకార్యాన్ని జరిపించిన వైనం కూడా దీనికి ఊతమిస్తోంది. కాగా గతంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేతకు విరాళం ఇచ్చేంత ఆలోచన లేదని సమాచారం. మొత్తానికి కేసీఆర్ కొనబోయే విమానానికి ముగ్గురు ఖమ్మం నేతలు విరాళం ఇవ్వడం అనేది అందరి నోళ్లలో నానుతోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED #లిక్కర్ క్వీన్.. ట్విటర్ లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్
×