బెంగళూరులో ఓ పోలీస్ కేసు.. ఇద్దరు ఏపీ టెకీల పరార్

సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించాలన్నది వారి కల. కానీ దాన్ని వారు ప్రతిభతో సంపాదించలేదు. లంచాలు ఇచ్చి అక్రమంగా జాబ్ కొట్టారు. కానీ పనితీరు తేడా కొట్టడంతో తేడా వచ్చి కంపెనీ పెద్దలు ఆరాతీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. మూడు లక్షల రూపాయలకు జాబ్ లు అమ్మేశారని తెలుసుకొని పోలీస్ కేసు పెట్టారు. ఇప్పుడు ఏపీకి చెందిన ఇద్దరు టెకీలు ఇందులో అడ్డంగా బుక్కయ్యారు.

ఓ హెల్త్ కేర్ సంస్థలో ఇటీవలే ఏపీకి చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ డెవలపర్లు జాయిన్ అయ్యారు. అందులో ఒక వ్యక్తి అబ్బాయి కాగా.. మరొకరు అమ్మాయి. ఈ ఇద్దరూ కూడా రిక్రూట్ మెంట్ సమయంలో అవకతవకలకు పాల్పడ్డారు. తమను ఇంటర్వ్యూ చేసే ఉన్నత ఉద్యోగికి లంచాన్ని ఎరగా వేశారు. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలను ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా ఈ ఇద్దరు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టారు. అనంతరం సిమెన్స్ హెల్త్ కేర్ లో ఉద్యోగంలో చేరారు.

ప్రాక్టికల్ గా వారి పనితీరుకు.. వారు ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభకు చాలా తేడా ఉండడంతో టీమ్ హెడ్ గమనించాడు. ఎక్కడో తేడా జరిగిందని నిఘా ఉంచారు. ఇంటర్వ్యూ నిర్వహించిన ఉద్యోగిని ప్రశ్నించగా.. లంచం తీసుకున్నట్టు అంగీకరించాడు.

దీంతో ఇద్దరు ఏపీ టెకీలతోపాటు లంచం తీసుకున్న ఉద్యోగిపైన కూడా సదురు సంస్థ కేసు పెట్టింది. ఉద్యోగం లభించిన వెంటనే మూడు లక్షల రూపాయలను చెల్లించడానికి ఈ ఇద్దరు ఏపీ టెకీలు ఒప్పందం చేసుకొని జాబ్ కొట్టారని.. జాబ్ లో చేరాక ఇంటర్వ్యూ నిర్వహించిన వ్యక్తికి ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇక ఈ ఇద్దరు ఏపీ టెకీల వ్యవహారం బయటపడడంతో వీరిద్దరూ రాజీనామా చేశారు. జాబ్ లో జాయిన్ అయినప్పుడు కంపెనీ ఇచ్చిన ల్యాప్ ట్యాప్ లను తిరిగి ఇవ్వలేదు. వారిద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. వారిద్దరూ ఏపీలో ఉన్నారని.. నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నాన్నా పులి.. ఇదేనా బాబు రాజకీయం..!
×