ఆ దేశాల్ని దోచుకున్నప్పుడు ఈ నీతులు ఏమయ్యాయి?

ఉక్రెయిన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్ధ భేరి మోగించిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికీ యుద్ధాన్ని ఆపని సంగతి తెలిసిందే. యుద్ధం ప్రారంభించి ఎనిమిది నెలలు అవుతున్నా.. పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా అధినేత బేఖాతరు చేస్తున్నారు.

అంతేకాకుండా ఉక్రెయిన్‌లోని రష్యన్ బలగాల ఆధీనంలో ఉన్న  జోపోరిజ్జియా ఖేర్సన్ లూహాన్స్క్ డోనెటెక్ట్స్.. ఈ  నాలుగు ప్రాంతాలను అధికారికంగా తన దేశంలో కలుపుకున్నారు. ఇందుకోసం ప్రజాభిసేకరణ చేశారు అయితే ఉక్రెయిన్ ప్రాంతాల విలీనంపై అమెరికాతోపాటు ఐరోపా దేశాలు ఐక్యరాజ్యసమితి నిప్పులు చెరిగాయి. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా రష్యన్ వ్యాపారవేత్తలు ప్రభుత్వ నేతలు తమ దేశంలో పర్యటించకుండా నిషేధం విధించాయి.

దీంతో అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా జపాన్ తదితర దేశాలపై రష్యా అధినేత పుతిన్ మండిపడ్డారు. తమకు నీతులు చెబుతున్న పాశ్చాత్య దేశాలు ఇతర దేశాల విషయంలో ఎందుకు ఉదారంగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. భారత్‌ను ఆఫ్రికా దేశాలను దోచుకుంది ఈ పాశ్చాత్య దేశాలు కావా అని నిలదీశారు. వలస విధానాలు సామ్రాజ్యవాదంతో భారత్‌ను ఆఫ్రికాను ఆయా దేశాలు నిలువుదోపిడీ చేశాయని మండిపడ్డారు.

రష్యాకు పునర్వైభవం తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నియమాలు నిబంధనలకు లోబడి ప్రపంచం ఉండాలని చెబుతున్న పాశ్చాత్య దేశాలు మరి అప్పుడు వాటినెందుకు పాటించలేదని దుయ్యబట్టారు.
రసాయన అణ్వాయుధాలతో పాశ్చాత్య దేశాలు ఆయా దేశాలను నాశనం చేశాయని తీవ్ర విమర్శలు గుప్పించారు.

పుతిన్ రష్యన్ ప్రసంగానికి ఆంగ్ల అనువాదాన్ని తాజాగా విడుదల చేశారు. ఇందులో "నియమాల ఆధారంగా ప్రపంచక్రమం ఉండాలని పశ్చిమ దేశాలు అంటున్నాయి. ఇదంతా చెత్త. ఆ దేశాలు తీవ్ర నయవంచనకు పాల్పడుతున్నాయి. ఆయా దేశాలు ద్వంద్వ ప్రమాణాలకు పాల్పడుతున్నాయి. మధ్యయుగాల్లోనే పశ్చిమ దేశాలు వలస విధానాలను అమల్లోకి తెచ్చాయి. అనంతరం బానిస వ్యాపారమూ జరిగింది. అమెరికాలో రెడ్ ఇండియన్లు ఊచకోతకు గురయ్యారు. ఎన్నో గిరిజన జాతులు అంతరించేలా చేశారు. భారత్‌ను ఆఫ్రికాను పశ్చిమ దేశాలు దోచుకున్నాయి. ఇది మానవ స్వభావానికి స్వేచ్ఛకు న్యాయానికి వ్యతిరేకం" అని పుతిన్ అమెరికా ఇంగ్లండ్‌లపై నిప్పులు చెరిగారు.

భారతదేశాన్ని దోచుకున్నప్పుడు పాశ్చాత్య దేశాలకు ఇవన్నీ గుర్తుకు రాలేదా..? అంటూ అమెరికా యూరోపియన్ దేశాలను నిలదీశారు. ఆఫ్రికా దేశస్తులను బానిసలుగా మార్చి ఆ దేశాలను దోచుకున్నాయని ధ్వజమెత్తారు. ఇంగ్లండ్ ఫ్రాన్స్ దేశాలు చైనాకు వ్యతిరేకంగా యుద్ధాలు చేశాయని పుతిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాగా నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇకపై అక్కడి ప్రజలు తమ వారే అని.. వారంతా రష్యన్లే అని పుతిన్ స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత జోపోరిజ్జియా ఖేర్సన్ లూహాన్స్క్ డోనెక్క్స్ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు రష్యాలో విలీనం కావడానికే మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. దీంతో ఉక్రెయిన్ లోని 15 శాతం భూభాగం ఇకపై రష్యాలో చేరినట్లు అయింది. కాగా 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు  ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ మాట్లాడుతూ.. అక్రమంగా ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడం యూఎన్ చార్టర్ కు వ్యతిరేకమని రష్యా చర్యను ఖండించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఈడీ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత
×