తెలుగు సినిమాని ట్రోల్ చేయడానికి అవకాశమిచ్చిన 'ఆదిపురుష్' టీజర్..!

తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైన తర్వాత భారతీయ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తోంది. ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మన సినిమాలపై అసూయ పడే బ్యాచ్ లు కూడా ఏర్పడ్డాయి.

తెలుగు హీరోలు మరియు సినిమాల పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం.. నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేయడం మనం తరచుగా చూస్తున్నాం. ఇటీవలి కాలంలో తెలుగు - తమిళ సినీ అభిమానుల మధ్య ఇలాంటి వార్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.

రీసెంట్ గా విడుదలైన 'పొన్నియన్ సెల్వన్ 1' సినిమా విషయంలో తెలుగు వెర్సెస్ తమిళ్ ఫైట్ జరిగింది. మణిరత్నం తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని.. రాజమౌళి తీసిన 'బాహుబలి' చిత్రంతో కంపేర్ చేయడంతో ఈ వార్ జరిగింది.

'పీఎస్ 1' సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపిస్తుండగా.. తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని అసలు 'బాహుబలి' తో ఎలా పోల్చారు అంటూ ట్విట్టర్ లో ట్రోల్ చేశారు. టాలీవుడ్ క్రిటిక్స్ సైతం యావరేజ్ రివ్యూలు రేటింగులు ఇచ్చారు.

దీనిపై కోలీవుడ్ క్రిటిక్స్ మరియు తమిళ అభిమానులు స్పందిస్తూ తెలుగు ప్రేక్షకులను - తెలుగు చిత్రాలను విమర్శించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ''ఆదిపురుష్'' టీజర్ వారికి ట్రోలింగ్ చేయడానికి మరింత అవకాశం కల్పించింది. ట్విట్టర్ లో తమిళ తంబీల ట్వీట్లు చూస్తుంటే.. ఈ విధంగా పగ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” టీజర్ ఆదివారం సాయంత్రం విడుదలైంది. కొందరు తెలుగు విమర్శకులు టీజర్ లోని పాజిటివ్ అంశాలని ప్రశంసిస్తుంటే.. చాలా మంది తమిళ క్రిటిక్స్ మాత్రం అసలు ఈ గ్రాఫిక్స్ ఏంటి? ఇది ఎలాంటి సినిమా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. నెటిజన్లు మీమ్స్ - ఫన్నీ పోస్ట్ లతో రచ్చ చేస్తున్నారు.

అయితే 'ఆదిపురుష్' అనేది టాలీవుడ్ హీరోతో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రూపొందించిన సినిమా అని.. దాన్ని తెలుగు చిత్రంగా పరిగణించలేమని ఇక్కడి అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. అయినా 'కొచ్చాడయాన్' 'పులి' వంటి చిత్రాల కంటే బెటర్ గానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి మంచి సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కంటెంట్ బాగుంటే భాషని పట్టించుకోకుండా.. చిన్నదా పెద్దదా అని బేధం చూపకుండా సినిమాలు చూస్తుంటారు. ఎలాంటి షరతులు లేని సక్సెస్ అందిస్తుంటారు.

అదే కంటెంట్ బాగా లేకపోతే సొంత చిత్రాన్ని కూడా నిర్థాక్ష్యంగా రిజెక్ట్ చేస్తుంటారు. 'పొన్నియన్ సెల్వన్' అయినా 'ఆది పురుష్' అయినా కంటెంట్ ను బట్టే తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనే విషయం తమిళ తంబీలు తెలుసుకుంటే మంచిది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED మహేష్.. రాజమౌళి సినిమాలో హాలీవుడ్ స్టార్స్..!
×