విశాఖ మీద ఒట్టు... రైల్వే జోన్ మీదే...

విశాఖ వాసుల కలలను తీర్చే పనిలోనే ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్ ఇక రాదు అంటూ పెద్ద ఎత్తున వస్తున్న వార్తల పట్ల తాజాగా ఆయన స్పందించారు. రైల్వే జోన్ ఎందుకు రాదు తప్పకుండా వస్తుంది. మేము  ఆ పనిలోనే బిజీగా ఉన్నామని ఆయన చెప్పుకున్నారు.

విశాఖ రైల్వే జోన్ మీద మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కూడా వివరించారు. రైల్వే జోన్ కోసం భూసేకరణ పూర్తి అయింది. భూమి కూడా అందుబాటులో ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది మా కమిట్మెంట్. మేము రైల్వే జోన్ కి విశాఖలో ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విశాఖకు రైల్వే జోన్ రాదు అన్న వార్తలు ఇపుడు ఏపీలో అతి పెద్ద రాజకీయ కలకలమే సృష్టించాయి. దీని మీద అటు బీజేపీ ఇటు వైసీపీ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాయి.

బీజేపీ తరఫున సోము వీర్రాజు తో పాటు ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా జోన్ తప్పకుండా వస్తుందని ఇది తమ వద్ద ఉన్న పక్కా సమాచారమని చెప్పుకున్నారు. అదే టైం లో విశాఖ రైల్వే జోన్ రాకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పడమూ విశేషం.

మొత్తానికి ఏపీకి బీజేపీ ఏమీ చేయడం లేదు అన్న సందేశం అయితే రైల్వే జోన్ మూలంగా జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. మరో వైపు చూస్తే ఏపీలో ఉన్న వైసీపీ కూడా కేంద్రాన్ని ఈ విషయం మీద ఏమీ అడగడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి.  దాంతో ఈ రెండు పార్టీలు ఇరుకునపడ్డాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణతో తాత్కాలికంగా ఈ విషయం మీద రేకెత్తిన దుమారం సద్దుమణిగింది. కానీ రైల్వే జోన్ కి శంకుస్థాపన చేస్తే తప్ప జనాలకు పూర్తి స్థాయిలో నమ్మకం అయితే కుదరదు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మద్యం స్కామ్.. రిమాండ్ రిపోర్టులో కేసీఆర్ కూతురుతోపాటు ఉన్న మరో 35 మంది వీరే!
×