'గాడ్ ఫాదర్' సెన్సార్ పూర్తి.. రిపోర్ట్ ఎలా ఉందంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ''గాడ్ ఫాదర్''. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. ఇద్దరు బిగ్ స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

'గాడ్ ఫాదర్' చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'U/A' (యూ/ఏ) సర్టిఫికేట్ జారీ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ దసరా ఒక వ్యక్తి గురించి మరియు అతను మిగిలిన వారిలో కలిగించే భయం గురించి చూపిస్తుంది అని పేర్కొన్నారు.

సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయని దర్శకుడు మోహన్ రాజా ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ని ఆవిష్కరించగా.. మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

'గాడ్ ఫాదర్' సెన్సార్ పోస్టర్ లో చిరంజీవి ని భారీ ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్ గా ప్రెజెంట్ చేశారు. బ్లూ షర్ట్ మరియు పంచెకట్టులో చిరు.. తొలిసారిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒక చెస్ బోర్డ్ మీద స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నారు. ఇది ఈ సినిమాలో సీనియర్ హీరో ఇంటెన్స్ రోల్ ని సూచిస్తోంది.  

'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార - సత్యదేవ్ - సునీల్ - సముద్రఖని - బ్రహ్మాజీ - మురళీ శర్మ - పూరీ జగన్నాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'లూసిఫర్' చిత్రానికి అధికారిక రీమేక్ గా ''గాడ్ ఫాదర్'' సినిమా తెరకెక్కింది. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. ఇందులో భాగంగా ఒరిజినల్ లో లేని విధంగా 'తార్ మార్ తక్కర్ మార్' వంటి పార్టీ సాంగ్ ని పెట్టారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో.. రాబోయే రోజుల్లో దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. రెండు పెద్ద ఈవెంట్స్ చేయడమే కాదు.. మరో మూడు సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్స్ పై ఆర్బి చౌదరి - ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 5న తెలుగు మరియు హిందీ బాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఇసుకలో ఆడుకుంటూ.. బికినీతో సర్ప్రైజ్ చేసిన బ్యూటీ
×