ఎన్టీయార్ పేరు మార్చి వైసీపీ పప్పులో కాలు వేసిందా....?

వైసీపీ పెద్దలకు అనవసరంగా కెలుక్కోవడం ఎపుడూ అలవాటే అని అంటూంటారు. అంతా సాఫీగా ఉంటే ఇష్టం ఉండదో ఏమో తెలియదు కానీ ఏదో ఒక విషయాన్ని పట్టుకుని వివాదం చేసుకోవడమే జరుగుతూ వస్తోంది అన్నది మూడేళ్ల వైసీపీ పాలనలో తీసుకున్న అనేక నిర్ణయాలు చూస్తే అర్ధమవుతాయి. ఇదిలా ఉంటే అనవసరంగా విజయవాడ హెల్త్ వర్శిటీకి ఎన్టీయార్ పేరుని తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం మాత్రం చిచ్చు రేపుతోంది.

దీంతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడింది అని అంటున్నారు. ఇక వైసీపీలో చూస్తే ఎన్టీయార్  అంటే కరడు కట్టిన ఫ్యాన్స్ చాలా మంది నాయకులుగా ఉన్నారు. అలాగే క్యాడర్ లో కూడా ఎన్టీయార్ ఫ్యాన్స్ వైసీపీ వైపు టర్న్ అయిన వారు ఉన్నారు. నిజమైన ఎన్టీయార్ ఫ్యాన్స్ ఎపుడూ చంద్రబాబుని సమర్ధించలేదు సరికదా వారు ఆయన ఓడిపోవాలని బలంగా కోరుకున్నారు. అలాంటి వారికి కాంగ్రెస్ సీఎం అయినా వైఎస్సార్ బాగా ఇష్టపడిన నాయకుడు అయ్యారు.

అందుకే 2004లో వైఎస్సార్ వైపు చాలా మంది టర్న్ అయి ఓటేశారు. ఆయన పోయిన తరువాత జగన్ వైపు సహజంగానే వచ్చారు. వారు అంతా చంద్రబాబుకు యాంటీ తప్ప ఎన్టీయార్ కి కాదు. ఈ విషయం చాలా సుస్పష్టం. ఈ ఓటు బ్యాంక్ వైసీపీకి తెలియకుండానే యాడ్ అయింది. అది ఎప్పటికీ అలా ఉంచుకోవాల్సిన రాజకీయ తెలివిడి వైసీపీ పెద్దలలో కరవు అయిన కారణం చేతనే ఇపుడు అనసవర వివాదాలు తెచ్చుకుని ఇద్దరు మహా నాయకుల మధ్యన పోటీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు అయిందని అంటున్నారు.

ఏపీలో చూస్తే దాని కంటే ముందు తెలుగు రాజకీయాల్లో చూస్తే ఒక ఎన్టీయార్ ఒక వైఎస్సార్ అని చెబుతారు. ఈ ఇద్దరు ఎవరికి వారే అన్నట్లుగా రాజకీయ వ్యక్తిత్వాలు ఉంటాయి. ఈ ఇద్దరికీ అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు. ఇద్దరికీ పోలిక పెట్టలేరు. అలాగే ఇద్దరికీ పోటీ కూడా పెట్టలేరు. కానీ అలాంటి పనిని వైసీపీ పెద్దలు చేసి తమ కన్ను తామే పొడచుకున్నారు అని అంటున్నారు అంతా.

ఇక్కడ ఎన్టీయార్  గొప్ప అని అంటే వైఎస్సార్ తక్కువ చేసిన వారు అవుతారు. అలాగే వైఎస్సార్ గొప్ప అంటే ఎన్టీయార్  చిన్నబోతారు. ఏ వైపు చూసినా ఎవరో ఒక నాయకుడి ఫ్యాన్స్ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నిజానికి ఈ ఇద్దరూ కూడా స్ట్రైట్ పాలిటిక్స్ చేశారు. ఇద్దరూ ముక్కుసూటిగా ఉన్నారు. ఇద్దరూ కూడా తమ జీవిత పర్యంతం ప్రజల కోసం తపన పడిన నాయకులు. అలాంటి జనం గుండెల్లో ఉన్న ఇద్దరు నాయకుల మీద పోటీ పెట్టి అందులో ఎవరు గొప్ప అని తేల్చుకోమనడం అంటే అంతకంటే తప్పు వేరేది ఉంటుందా అన్నదే అతి పెద్ద చర్చ.

ఇది నిజానికి లాజిక్ తో ఆలోచిస్తే ఎంత బ్లండర్ మిస్టేక్ అన్నది కూడా అవగతం అవుతుంది అని అంటున్నారు. ఇక చూస్తే గోదావరి జిల్లాలలో ఉన్న ఎన్టీయార్  ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ వైసీపీని ఈ విషయంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారుట. ఇదే విధంగా చూస్తే మహానాయకులు. జనాలు చిరకాలం తలచుకునే వారి మధ్యన పోటీ పెట్టాలని ఎలా అనిపించింది అన్న చర్చ కూడా వస్తోంది.

విజయవాడ హెల్త్ వర్శిటీకి ఎన్టీయార్  పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెడితే ఆయనకు కొత్తగా వచ్చిన ఖ్యాతి లేదు. అలాగే ఎన్టీయార్ కి పోయినది కూడా లేదు. కానీ వైసీపీకి మాత్రం ఈ చర్య రాజకీయంగా అతి పెద్ద నష్టమే చేకూరుస్తుంది అని అంటున్నారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదు తప్పు దిద్దుకుంటే వైసీపీ సర్కార్ తన మర్యాద మన్నన అలా కాపాడుకుంటుంది అని సూచనలు అందుతున్నాయి. అలాగే వైసీపీలో ఉన్న ఎన్టీయార్ ఫ్యాన్స్ కూడా సంతోషిస్తారు. రాజకీయంగా అది వైసీపీకి కరెక్ట్ డెసిషన్ అవుతుంది అని కూడా చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఎకరానికి 30 వేలు ఇస్తా.. భూములు ఇవ్వండి: రైతులకు సీఎం జగన్ వినతి
×