'అల్లూరి' షోలు క్యాన్సిల్.. ఇక మీ చేతుల్లోనే అంటూ శ్రీవిష్ణు ట్వీట్..!

వర్సటైల్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ''అల్లూరి''. 'నిజాయితీకి మారుపేరు' అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 23) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకున్న విధంగా ఇవాళ మార్నింగ్ షోలు పడలేదు.

అనుకోని కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో 'అల్లూరి' సినిమా మార్నింగ్ షో రద్దు చేయబడ్డాయి. అయితే మ్యాట్నీ షో నుంచి ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు ట్విట్టర్ లో స్పందించారు.

''కొన్ని సమస్యల కారణంగా మేము 'అల్లూరి' మార్నింగ్ షోలను తీసుకురాలేకపోయాము. మ్యాట్నీస్ నుంచి మీదే. ఇక మీ చేతుల్లోనే.. మీ సమీప సినిమా హాళ్లలో 'అల్లూరి' చిత్రాన్ని ఆస్వాదించండి'' అని శ్రీ విష్ణు ట్వీట్ లో పేర్కొన్నారు.

'అల్లూరి' సినిమా మార్నింగ్ షో చూద్దామని టికెట్లు బుక్ చేసుకున్న సినీ ప్రియులు.. షో క్యాన్సిల్ అవడంతో నిరాశ చెందారు. రిలీజ్ ను ప్రాపర్ గా ప్లాన్ చేయలేదని ప్రొడ్యూసర్స్ పై శ్రీ విష్ణు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆర్థిక సమస్యల కారణంగా 'అల్లూరి' సినిమా మార్నింగ్ షోలు రద్దు చేయబడినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రొడ్యూసర్ మరియు ఫైనాన్సియర్స్ కి మధ్య ఏర్పడిన సమస్య కారణంగానే ఇలా జరిగిందని.. చివరకు అంతా సర్దుమణగడంతో సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారని అంటున్నారు.

కాగా వాస్తవ సంఘటనల ఆధారంగా పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా 'అల్లూరి' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు నటించాడు. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్ గా కనిపించింది.

బెక్కం బబిత సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించగా.. వైటల్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

ఇందులో సుమన్ - తనికెళ్ల భరణి - మధుసూధన్ రావు - ప్రమోదిని - రాజా రవీంద్ర - పృధ్వీ రాజ్ - రవివర్మ - జయవాణి - వాసు ఇంటూరి - జయవాణి - వెన్నెల రామారావు - శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన శ్రీవిష్ణు ''అల్లూరి''.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED 20 ఏళ్ల గుర్తింపు ఒక్క సినిమాతోనే...!
×