భర్తను సర్ ప్రైజ్ చేసేందుకు విశాఖ నుంచి చంటి బిడ్డను తీసుకొని హైదరాబాద్ కు?

క్రికెట్ మీద ప్రేమ.. అభిమానం తప్పేం కాదు. కానీ.. పిచ్చ ఉండకూడదు. అది కూడా.. అపాయంలోకి నెట్టేసే పిచ్చ అస్సలు ఉండకూడదు. కానీ.. ఈ విషయాన్ని మర్చిపోయి.. కేవలం తాను ఇచ్చే సర్ ప్రైజ్ మీద ఫోకస్ పెట్టిన ఒక మహిళ తీరు షాకింగ్ గానే కాదు.. పలువురికి ఒళ్లు మండేలా చేస్తోంది. ఇంతకూ జరిగిందేమంటే.. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల కోసం సాగుతున్న రచ్చ తెలిసిందే.

హైడ్రామా అనంతరం గురువారం జింఖానా గ్రౌండ్ లో క్రికెట్ టికెట్లు అమ్మకానికి పెట్టిన వైనం గురించి తెలిసిందే. ఈ టికెట్ల కోసం వేలాది మంది జింఖానా గ్రౌండ్ కు పోటెత్తారు.

ఈ వేలాది మందిలో బాగా చదువుకున్నట్లుగా కనిపించిన ఒక మహిళ తన చంటిబిడ్డను తీసుకొని అక్కడకు రావటం చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. అసలే ఒకవైపు తొక్కిసలాట.. మరోవైపు పోలీసుల లాఠీ చార్జితో పరిస్థితి ఆగమాగంగా ఉన్న వేళలో.. అక్కడి పోలీసులు ఆమెను గుర్తించారు.

చంటి బిడ్డను భుజాన వేసుకొని వచ్చిన ఆమెను ఆపి.. ఆమె వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన విషయాల్ని విన్న వారు షాక్ తిన్నారు. ఆమెది విశాఖపట్నం అని.. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు అవసరమైన టికెట్లు ఆన్ లైన్ లో దొరకలేదని.. అందుకే విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలిపారు. అంతేకాదు.. తన భర్త ఆర్మీలో పని చేస్తుంటారని.. ఆయనకు క్రికెట్ అంటే ఇష్టమని.. ఈ నెల 25న (మ్యాచ్ జరిగే రోజున)సెలవుపై నగరానికి వస్తున్నారని.. అందుకే ఆయనకు సర్  ప్రైజ్ చేసేందుకు మ్యాచ్ టికెట్ల కోసం వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు.

దీంతో షాక్ తిన్న పోలీసులు.. ఆమె చేతిలో ఉన్న చంటి బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకొని.. ఆమెకు ప్రత్యేకంగా టికెట్లు ఇప్పించి పంపించేశారు.దీనికి సంబంధించిన విషయాలు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వచ్చాయి.

క్రికెట్ మీద అభిమానం తప్పు కాదు కానీ.. నెలల పిల్లాడ్ని పట్టుకొని ఇంతటి రిస్కు చేయటం అవసరమా? అంటూ పలువురు తప్పు పడుతున్నారు. అంతా బాగుంది కానీ.. ఏదైనా తేడా వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కదా? అన్న మాట వినిపిస్తోంది. నిజమే కదా? భర్తకు సర్ ప్రైజ్ ఇవ్వటం కోసం అపాయానికి ఎదురెళ్లటం అంత మంచిది కాదు కదా?నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఫైర్బ్రాండ్ నానీకి .. జగన్ బిగ్ షాక్
×