ఒకే ఒక జీవితం

చిత్రం : ఒకే ఒక జీవితం
న‌టీన‌టులు: శ‌ర్వానంద్-వెన్నెల కిషోర్-ప్రియ‌ద‌ర్శి-రీతు వ‌ర్మ‌-అమ‌ల అక్కినేని త‌దిత‌రులు
సంగీతం: జేక్స్ బిజోయ్
ఛాయాగ్ర‌హ‌ణం: సుజీత్ సారంగ్
మాట‌లు: త‌రుణ్ భాస్క‌ర్
నిర్మాత‌లు: ఎస్.ఆర్.ప్ర‌భు-ఎస్.ఆర్.సురేష్ బాబు
క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం: శ్రీ కార్తీక్

చాన్నాళ్లుగా స‌రైన విజ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్న యువ క‌థానాయ‌కుడు.. ఇప్పుడు ఒకే ఒక జీవితం చిత్రంతో ప్రేక్ష‌కులల‌ ముందుకు వచ్చాడు. త‌మిళ‌.. తెలుగు భాష‌ల్లో రూపొందిన ఈ చిత్రం చ‌క్క‌టి ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. మ‌రి సినిమా అంచ‌నాల‌ను అందుకుందా.. శ‌ర్వాకు మ‌ళ్లీ ఓ విజ‌యాన్నిచ్చేలా ఉందా.. చూద్దాం ప‌దండి.

కథ‌:

ఆది (శ‌ర్వానంద్) ఒక గిటారిస్ట్. మ్యుజీషియ‌న్ కావాల‌న్న‌ది అత‌డి ల‌క్ష్యం. కానీ ఆత్మ‌విశ్వాస లోపంతో కెరీర్లో ముంద‌డుగు వేయ‌లేక‌పోతుంటాడు. అత‌డి ఇద్ద‌రు స్నేహితులు (వెన్నెల కిషోర్.. ప్రియ‌ద‌ర్శి) కూడా కొన్ని స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. వీరి జీవితాలు నిరాశాజ‌న‌కంగా సాగుతున్న స‌మ‌యంలో సైంటిస్ట్ పాల్ (నాజ‌ర్) వీరికి ప‌రిచ‌యం అవుతాడు. ఆయ‌న కాలంలో ప్ర‌యాణించే టైం మెషీన్ ను త‌యారు చేసి ఉంటాడు. కానీ అప్ప‌టికే ఒక ప్ర‌యోగం చేసి విఫ‌ల‌మైన పాల్.. ఈసారి దాన్ని ప‌రీక్షించ‌డానికి ఆదినే ఎంచుకుంటాడు. చిన్న‌త‌నంలో మ‌ర‌ణించిన త‌న త‌ల్లిని కాపాడుకోవ‌డం కోసం త‌న జీవితం ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని తెలిసీ టైం మెషీన్లో ప్ర‌యాణించ‌డానికి ఆది సిద్ధ‌ప‌డ‌తాడు. త‌మ జీవితాల‌ను మార్చుకోవ‌డానికి ఇదే మంచి అవ‌కాశ‌మ‌ని త‌న ఇద్ద‌రు స్నేహితులు కూడా అత‌డికి తోడ‌వుతారు. మ‌రి ఈ ముగ్గురూ రెండు ద‌శాబ్దాలు వెన‌క్కి వెళ్లి ఏం సాధించారు.. అక్క‌డ వీరికి ఎదురైన అనుభ‌వాలేంటి.. చివ‌రికి ఈ ప్ర‌యాణంలో వీరి జీవితాలు ఏ మ‌లుపు తిరిగాయి అన్న‌ది మిగ‌తా క‌థ‌.

క‌థ‌నం-విశ్లేష‌ణ‌:

ఇండియ‌న్ స్క్రీన్ మీద టైం ట్రావెల్ నేప‌థ్యంలో వ‌చ్చిన సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలు చాలా చాలా త‌క్కువ‌. కానీ ఆ త‌క్కువ చిత్రాల్లో చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న‌వే ఉన్నాయి. తెలుగులో మూడు ద‌శాబ్దాల కింద‌ట వ‌చ్చిన ఆదిత్య 369 ఇప్పుడు చూసుకున్నా ఎంతో ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. ఇక కొన్నేళ్ల కింద‌ట సూర్య హీరోగా విక్ర‌మ్ కుమార్ రూపొందించిన 24 సైతం టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగి ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌టి అనుభూతిని క‌లిగించింది. ఇక త‌మిళంలోనే రూపొందిన ఇండ్రు నేట్రు నాలై సైతం కాలంలో ప్ర‌యాణించే క‌థ‌తో అమితంగా ఆక‌ట్టుకుంది. ఈ మూడు చిత్రాల నేప‌థ్యం ఒక‌టే అయినా.. వాటి క‌థాక‌థ‌నాలు వేటిక‌వే భిన్నంగా ఉండి ప్రేక్ష‌కులను ఉత్కంఠ‌కు గురి చేస్తూ ఆద్యంతం అల‌రించిన‌వే. ఇప్పుడు శ‌ర్వానంద్ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ రూపొందించిన ఒకే ఒక జీవితం టైమ్ ట్రావెల్ నేప‌థ్యాన్ని వాడుకుంటూ మ‌న‌ల్ని మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకెళ్తుంది. పై మూడు చిత్రాల‌కు దీన్ని భిన్నంగా నిలిపేది ఇందులోని అమ్మ పాత్ర తాలూకు ఎమోష‌న్. క‌థ‌లో ఈ పాత్ర‌కు ఇచ్చిన ప్రాధాన్యం.. దాని చుట్టూ అల్లుకున్న ఎమోష‌నల్ సీన్లు ప్రేక్ష‌కుల హృద‌యానికి తాకితే.. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో వ‌చ్చే క‌థ‌లోని మ‌లుపులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. దీనికి తోడు సిచువేష‌న్ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను అక్క‌డ‌క్క‌డా బాగానే గిలిగింత‌లు పెట్టారు. మ‌రీ ఉర్రూత‌లూగించేసే సినిమా అని చెప్ప‌లేం కానీ.. ఎక్క‌డా బోర్ కొట్టించ‌కుండా ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేయ‌డంలో ఒకే ఒక జీవితం విజ‌య‌వంత‌మైంది.

కాలంలో ప్ర‌యాణించడం అన్న‌దే విన‌డానికి.. చూడ్డానికి.. చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించే అంశం. ఇలాంటి ఫాంట‌సీ కాన్సెప్ట్స్ చూస్తున్న‌పుడు.. మ‌న జీవితంలో కూడా ఇలా జ‌రిగితే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటాం. చాలా ఈజీగా క‌నెక్ట‌వుతాం. ఒకే ఒక జీవితం కూడా ప్రేక్ష‌కుల‌ను చాలా త్వ‌ర‌గా క‌థ‌తో క‌నెక్ట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. పాత్ర‌ల ప‌రిచ‌యానికి మ‌రీ ఎక్కువ తీసుకోకుండా షార్ప్ గా ఆరంభ స‌న్నివేశాల‌ను లాగించేశాడు ద‌ర్శ‌కుడు. అర‌గంట లోపే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను ప‌రిచ‌యం చేసి మూడు ప్ర‌ధాన పాత్ర‌ల‌ను కాలంలో ప్ర‌యాణింప‌జేశాడు. క‌థ త్వ‌ర‌గా ఈ మ‌లుపు తీసుకోవ‌డంతో ఇక్క‌డి నుంచి త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే క్యూరియాసిటీ క‌లుగుతుంది. హీరో, అత‌డి స్నేహితులు ప్ర‌స్తుత వ‌య‌సులో, ఆలోచ‌న‌ల్లోనే ఉంటూ.. చిన్న‌నాటి త‌మ‌ను తాము చూసుకోవ‌డం.. అప్ప‌టి త‌మ జీవితాల‌ను క‌రెక్ట్ చేసి వ‌ర్త‌మానాన్ని మార్చ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్.. ప్రియ‌ద‌ర్శి.. త‌మ చిన్న‌నాటి పాత్ర‌ల‌తో క‌నెక్ట్ అయి వారిని మార్చ‌డానికి చేసే ప్ర‌య‌త్నం భ‌లే ఫ‌న్నీగా అనిపిస్తుంది. వీళ్లిద్ద‌రూ ఓ వైపు గిలిగింత‌లు పెడుతూ సాగితే.. ఇంకో వైపు అమ్మ‌తో శ‌ర్వా ప్ర‌యాణం హృద్యంగా.. ఉద్వేగ భ‌రితంగా సాగుతుంది. కామెడీ.. ఎమోష‌న్లు స‌మ‌పాళ్లలో మేళ‌వించిన ద‌ర్శ‌కుడు ప్ర‌థ‌మార్ధంలో క‌థ‌నాన్ని ప‌రుగులు పెట్టించాడు.

ఇక ఇంట‌ర్వెల్ ట్విస్టు ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీని మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. ఈ మ‌లుపు ద్వితీయార్ధంలోనూ స‌న్నివేశాల‌ను కొత్త‌గా నడిపించ‌డానికి.. ఉత్కంఠ‌ను పెంచ‌డానికి తోడ్ప‌డింది. ముగ్గురు ప్ర‌ధాన పాత్ర‌ధారులు తిరిగి వ‌ర్త‌మానంలోకి ఎలా వ‌స్తారు.. టైమ్ ట్రావెల్లో జ‌రిగిన త‌ప్పును ఎలా స‌రి చేస్తారు అనే ఆస‌క్తి చివ‌రి వ‌ర‌కు కొన‌సాగుతుంది. రెండో అర్ధంలో అమ్మ పాత్ర‌తో ఎమోష‌న్లు మ‌రింత బాగా పండాయి. కామెడీకి స్కోప్ త‌గ్గిన‌ప్ప‌టికీ థ్రిల్ ఫ్యాక్ట‌ర్ వ‌ర్క‌వుట్ కావ‌డంతో బోర్ కొట్ట‌డానికి ఛాన్స్ లేక‌పోయింది. కొన్ని స‌న్నివేశాలు నెమ్మ‌దిగా న‌డిచాయ‌నే కంప్లైంట్ త‌ప్పితే.. సినిమా సాఫీగా సాగిపోతుంది. సినిమా అంత‌కు ముందు వ‌ర‌కు సాగిన తీరుతో పోలిస్తే క్లైమాక్స్ కొంత మామూలుగా అనిపిస్తుంది కానీ.. నిరాశ‌ప‌రిచేదైతే కాదు. విధిని ఎవ్వ‌రూ మార్చ‌లేరు అనే పాయింట్ ను ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. మొత్తంగా చూస్తే టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో మ‌రో కొత్త క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు శ్రీ కార్తీక్ విజ‌య‌వంతం అయ్యాడు. శ‌ర్వాకు క‌చ్చితంగా ఇది పెద్ద రిలీఫ్ అన‌డంలో సందేహం లేదు. అత‌డి పెర్ఫామెన్స్ కూడా బాగుండ‌డంతో ఒకే ఒక జీవితం బాక్సాఫీస్ విన్న‌ర్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

న‌టీన‌టులు:

శర్వానంద్ చాన్నాళ్ల త‌ర్వాత ప్రేక్ష‌కుల‌ను మెప్పించే పాత్ర చేశాడు. అత‌డికిది టైల‌ర్ మేడ్ రోల్ అని చెప్పొచ్చు. భావోద్వేగాలు పండించాల్సిన స‌న్నివేశాల్లో శ‌ర్వా క‌ట్టి ప‌డేశాడు. ముఖ్యంతో అమ్మ‌తో ముడిప‌డ్డ స‌న్నివేశాల్లో శ‌ర్వా న‌ట‌న హృద్యంగా సాగింది. కాలంలో వెన‌క్కి వెళ్లి చ‌నిపోయిన అమ్మ‌ను మ‌ళ్లీ చూసే.. ఆమె వంట రుచి చూసే స‌న్నిశాల్లో.. అలాగే ప‌తాక ఘ‌ట్టంలో శ‌ర్వా అద్భుతంగా న‌టించాడు. హీరోయిన్ రీతు వ‌ర్మ త‌క్కువ నిడివి.. ప‌రిధి ఉన్న పాత్ర‌లో ఓకే అనిపించింది. త‌న కెరీర్ కు ఇదంత ఉప‌యోగ‌ప‌డే పాత్ర అయితే కాదు. హీరో స్నేహితులుగా వెన్నెల కిషోర్.. ప్రియ‌ద‌ర్శి ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డి న‌టించారు. వారికి క‌థ‌లో కూడా మంచి ప్రాధాన్యం ద‌క్కింది. సినిమాలో ఎంట‌ర్టైన్మెంట్ బాధ్యత అంతా వీళ్లిద్ద‌రే తీసుకున్నారు. అమ‌ల అక్కినేని అమ్మ పాత్ర‌లో ఒదిగిపోయింది. ఆమె ఇలాంటి పాత్ర‌లు మ‌రిన్ని చేస్తే బాగుంటుంద‌నిపిస్తుంది.

సాంకేతిక వ‌ర్గం:

ఈ చిత్రానికి సాంకేతిక నిపుణుల స‌హ‌కారం బాగానే కుదిరింది. జేక్స్ బిజోయ్ మంచి ఫీల్ ఉన్న పాట‌లు ఇచ్చాడు. అన్నింట్లోకి అమ్మ పాట ప్ర‌త్యేకంగా అనిపిస్తుంది. నేప‌థ్య సంగీతం కూడా ఆక‌ట్టుకుంది. సుజీత్ సారంగ్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. విజువ‌ల్స్ క‌ల‌ర్ ఫుల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గ్గ‌ట్లు బాగా కుదిరాయి. త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు అత‌డి స్ట‌యిల్లో స‌హ‌జంగా.. షార్ప్ గా సాగాయి. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ కార్తీక్ విభిన్న‌మైన క‌థ‌ను ఎంచుకుని.. ఆస‌క్తిక‌ర‌మైన స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ పెంచుతూ సినిమాను ముందుకు న‌డిపించాడు. ర‌చ‌యిత‌గా.. ద‌ర్శ‌కుడిగా అత‌డి ప‌నిత‌నం మెప్పిస్తుంది. అత‌డికి మంచి భ‌విష్య‌త్తు ఉంది.

చివ‌ర‌గా: ఒకే ఒక జీవితం.. వినోదాల‌ ప్ర‌యాణం

రేటింగ్-3/5
× RELATED పొన్నియన్ సెల్వన్
×